భారతదేశం జి20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నేటితో 365 రోజులు పూర్తయ్యాయి. ‘‘వసుధైవ కుటుంబకం’’...  అంటే- ‘ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు’ స్ఫూర్తిని చాటేలా పునరంకితమవుతూ.. పునరుజ్జీవనానికి బీజం వేసిన క్షణమది.

   మనం నిరుడు ఈ బాధ్యత స్వీకరించే నాటికి యావత్ ప్రపంచం బహుముఖ సవాళ్లతో సతమతం అవుతోంది. ఆ మేరకు క్షీణిస్తున్న బహుపాక్షికత నడుమ కోవిడ్-19 మహమ్మారి దుష్ప్రభావం నుంచి కోలుకోవడం, నానాటికీ పెరుగుతున్న వాతావరణ మార్పు సమస్యలు, ఆర్థిక అస్థిరత, వర్ధమాన దేశాల్లో రుణభారం తదితరాలన్నీ చోటు చేసుకున్నాయి. అలాగే ఘర్షణలు, వివాదాలు, స్పర్థాత్మకతల మధ్య ప్రగతి సంబంధిత సహకార భావన దెబ్బతిని, పురోగమనం కుంటుపడింది.

   ఈ నేపథ్యంలో జి20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన భారతదేశం ఆనాటి  దుస్థితి నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించి, ప్రత్యామ్నాయం చూపాలని నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా జిడిపి కేంద్రక ప్రగతి నుంచి మానవ-కేంద్రక పురోగమనంవైపు మళ్లాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. మనమధ్య విభజన తెస్తున్న కారణాన్ని కాకుండా మనల్ని ఏది ఏకం చేయగలదో దానిగురించి గుర్తుచేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో అంతిమంగా అంతర్జాతీయ చర్చలు పరిణామశీలమై- కొందరి స్వార్థానికి కాకుండా అందరి ఆకాంక్షలు, ప్రయోజనాలకు పెద్దపీట వేయక తప్పలేదు. అయితే, ఇందుకోసం ముఖ్యంగా చేయాల్సిందల్లా బహుపాక్షికతలో మూలాల నుంచి సంస్కరణలు తేవడం.

   ‘‘సార్వజనీనత, ఆకాంక్షాత్మకత, కార్యాచరణాత్మకత, నిర్ణయాత్మతకత’’ అనే నాలుగు పదాలు జి20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో మన విధానమేమిటో సుస్పష్టంగా నిర్వచించాయి. అటుపైన జి20 సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించిన ‘న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం’ (ఎన్డీఎల్డీ) ఈ సూత్రాల అమలులో మన నిబద్ధతను ప్రస్ఫుటం చేసింది.

   సార్వజనీనత అన్నది మన అధ్యక్ష పదవికి ఆత్మవంటిది. దీనికి అనుగుణంగా ఆఫ్రికా సమాఖ్య (ఎయు)కు జి20లో శాశ్వత సభ్యత్వం కల్పించడం ద్వారా 55 ఆఫ్రికా దేశాలను ఈ వేదికమీదకు చేర్చాం. దీంతో ప్రపంచ జనాభాలో 80 శాతానికి ప్రాతినిధ్యం వహించే విధంగా జి20 విస్తరించింది. తద్వారా అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలపై  మరింత సమగ్ర చర్చలను ఈ క్రియాశీల వైఖరి ప్రోత్సహించింది.

   ఇక ‘దక్షిణార్థ గోళం దేశాల గళం’ పేరిట భారతదేశం తొలిసారి రెండు దఫాలుగా నిర్వహించిన శిఖరాగ్ర సదస్సు బహుపాక్షికత నవోదయానికి శుభారంభం పలికింది. ఆ విధంగా దక్షిణార్థ గోళ దేశాల సమస్యలను భారతదేశం అంతర్జాతీయ చర్చల ప్రధాన స్రవంతిలోకి తెచ్చింది. తద్వారా ప్రపంచ ప్రగతికి మార్గ ప్రణాళికలో వర్ధమాన దేశాలు తమవంతు ప్రాతినిధ్యం వహించే కొత్త శకానికి నాంది పలికింది.

   సార్వజనీనత అన్నది భారత దేశీయ విధాన ఉత్తేజాన్ని జి20కి వ్యాపింపజేసింది. ఆ మేరకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి తగినట్లుగా జి20కి భారత నాయకత్వం ప్రజాధ్యక్షతగా రూపొందింది. ఈ మేరకు ‘‘ప్రజా భాగస్వామ్యం’’ కింద నిర్వహించిన అనేక కార్యక్రమాల ద్వారా 140 కోట్ల మంది పౌరులకు జి20 చేరువైంది. ఇందులో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకూ భాగస్వామ్యం ఇవ్వబడింది. అలాగే జి20 నిర్దేశాలకు అనువుగా వాస్తవిక అంశాలపై అంతర్జాతీయ దృష్టిని విస్తృత ప్రగతి లక్ష్యాల వైపు మళ్లించేలా భారత్ బాధ్యత వహించింది.

   ప్రపంచం సాధించాల్సిన లక్ష్యాలపై 2030 నాటి గడువుకు నేడు మనం అత్యంత కీలకమైన మధ్యకాలంలో ఉన్నాం. అందువల్ల 2023కు సంబంధించి జి20 కార్యాచరణ ప్రణాళికను భారత్ రూపొందించింది. ఇది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)ను వేగవంతం చేయడంతోపాటు ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పర్యావరణ సమతౌల్యం, పరస్పర అనుసంధానిత సమస్యల పరిష్కారం కోసం విస్తృత కార్యాచరణ-ఆధారిత విధానం వగైరాలను సూచించింది.

   ఈ ప్రగతి ప్రణాళిక పురోగమనానికి జనహిత మౌలిక సదుపాయాలు (డిపిఐ) అత్యంత కీలకం. ఆ మేరకు ‘ఆధార్, యుపిఐ, డిజిలాకర్’ వంటి డిజిటల్ ఆవిష్కరణల విప్లవాత్మక ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూసిన భారత్ తనవంతుగా నిర్ణయాత్మక సిఫారసులు చేసింది. జి20 ద్వారా మనం జనహిత మౌలిక సదుపాయాల భాండాగారం ఏర్పాటును విజయవంతంగా పూర్తి చేశాం. దీన్ని ప్రపంచ సాంకేతిక సహకారంలో గణనీయ పురోగమనంగా పేర్కొనవచ్చు. ఈ భాండాగారంలో 16 దేశాల నుంచి 50కిపైగా దేశాల ‘డిపిఐ’లున్నాయి. సమగ్రాభివృద్ధి శక్తిని సద్వినియోగం చేసుకునే దిశగా దక్షిణార్థ గోళ దేశాలు వీటిని అనుసరించడమేగాక, తమదైన ‘డిపిఐ’ల నిర్మాణం, వినియోగం కోసం ఈ భాండాగారాన్ని చక్కగా వాడుకోవాలి.

   మన ఏకైక భూగోళం కోసం తక్షణ, శాశ్వత, సమాన మార్పు సృష్టి లక్ష్యంగా మనం  ప్రతిష్టాత్మక, సమగ్రమైన లక్ష్యాలను అనుసరిస్తున్నాం. భూగోళ పరిరక్షణ, పేదరిక నిర్మూలన నడుమ మన ఎంపికకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడం ఎలాగో ‘ఎన్డీఎల్డీ’ నిర్దేశిత ‘హరిత ప్రగతి ఒప్పందం’ వివరిస్తుంది. పరస్పర పూరకాలైన ఉపాధి-పర్యావరణ వ్యవస్థలు, వాతావరణ స్పృహతో వినియోగం, భూగోళ హిత ఉత్పాదనకు తగిన ప్రణాళికను సూచిస్తుంది. ఇక 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని  ప్రతిష్టాత్మక రీతిలో మూడు రెట్లు పెంచాలని కూడా జి20 తీర్మానం పిలుపునిచ్చింది. మరోవైపు ప్రపంచ జీవఇంధన కూటమి ఏర్పాటు, హరిత ఉదజని కోసం సమష్టి కృషి, పరిశుభ్ర, హరిత ప్రపంచ నిర్మాణంపై జి20 ఆదర్శాలు కాదనలేని నిజాలు. భారత్ అనాదిగా అనుసరిస్తున్న విలువలు ఇవే. అలాగే సుస్థిర జీవనం కోసం జీవనశైలి (లైఫ్) వంటివాటిద్వారా ప్రపంచం మన ప్రాచీన అనుసరణీయ సంప్రదాయాల ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

   ఉత్తరార్థ గోళ దేశాల నుంచి గణనీయ ఆర్థిక సహాయంతోపాటు సాంకేతిక చేయూతను కోరడం ద్వారా వాతావరణ న్యాయం-సమానత్వం విషయంలో మన నిబద్ధతను కూడా ‘ఎన్డీఎల్డీ’ నొక్కి చెప్పింది. కాగా, అభివృద్ధికి ఆర్థిక చేయూత పరిమాణంలో తొలిసారిగా ఆశించన మేర రెట్టింపు పెరుగుదల నమోదైంది. ఆ మేరకు ఈ సాయం బిలియన్ల స్థాయి నుంచి ట్రిలియన్ల స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో వర్ధమాన దేశాలు 2030 నాటికి తమ దేశీయ ప్రగతి లక్ష్యాల (ఎన్డీసీ)ను సాధించడానికి $5.9 ట్రిలియన్ డాలర్లు అవసరమని జి20 అంగీకరించింది.

   భారీ స్థాయిలో నిధుల సమీకరణ అవసరం దృష్ట్యా మెరుగైన, విస్తృత, ప్రభావశీల  బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల ప్రాముఖ్యాన్ని కూడా జి20 సుస్పష్టం చేసింది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్ విషయంలోనూ భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఐరాస భద్రత మండలి వంటి ప్రధానాంగాల పునర్నిర్మాణం మరింత సమాన ప్రపంచ క్రమాన్ని నిర్ధారిస్తుంది.

   న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం లింగ సమానత్వానికీ పెద్దపీట వేసింది. ఆ మేరకు ఇది వచ్చే ఏడాదికల్లా మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యాచరణ బృందం ఏర్పాటు అవసరాన్ని నొక్కిచెప్పింది. భారత మహిళా రిజర్వేషన్ బిల్లు-2023 ద్వారా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయించడం ద్వారా మహిళా చోదక ప్రగతిపై భారత్ నిబద్ధతను జి20 ప్రతిబింబించింది.

   విధానపరమైన సమన్వయం, విశ్వసనీయ వాణిజ్యం, ప్రతిష్టాత్మక వాతావరణ కార్యాచరణపై దృష్టి సారిస్తూ ఈ కీలక ప్రాధాన్యాలన్నిటా పరస్పర సహకార స్ఫూర్తిని ‘ఎన్డీఎల్డీ’ చాటిచెప్పింది. మన అధ్యక్షత సమయంలో జి20 ద్వారా 87 నిర్ణయాలు తీసుకోవడంతోపాటు 118 పత్రాలకు ఆమోదం సాధించడం గర్వించదగిన అంశం. మునుపటితో పోలిస్తే ఇదెంతో గణనీయమైన పెరుగుదల.

   మన జి20 అధ్యక్షత సమయంలో భౌగోళిక-రాజకీయాంశాలు, ఆర్థికవృద్ధి-ప్రగతిపై వాటి ప్రభావం వగైరాలపైనా చర్చలకు భారత్ నాయకత్వం వహించింది. ఉగ్రవాదం, విచక్షణ రహితంగా పౌరుల ప్రాణాలు తీయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని తుదముట్టించడమనే విధానంతోనే ఈ బెడదను నిర్మూలించడం సాధ్యమని స్పష్టం చేసింది. మనం శత్రుత్వం స్థానంలో మానవత్వాన్ని స్వీకరించాలి. ఆ మేరకు ఇది యుద్ధ యుగం కాదనే వాస్తవాన్ని పునరుద్ఘాటించాలి.

   జి20 అధ్యక్ష బాధ్యతల సమయంలో భారత్ అసాధారణ విజయాలు సాధించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది: ఇది బహుపాక్షికతను పునరుజ్జీవింపజేసింది... దక్షిణార్థ గోళ దేశాల గళాన్ని మరింతగా వినిపించింది... ప్రగతి సాధనకు ప్రాముఖ్యమిచ్చింది... అన్ని రంగాల్లోనూ మహిళా సాధికారత కోసం పోరాడింది.

   ఈ నేపథ్యంలో భూగోళం పచ్చగా పరిఢవిల్లడంతోపాటు ప్రపంచ ప్రజానీకానికి శాంతి-శ్రేయస్సు దిశగా ఇప్పటివరకూ మనం సమష్టిగా చేసిన కృషి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని విశ్వసిస్తూ జి20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ దేశానికి అప్పగిస్తున్నాం.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Indian economy 'resilient' despite 'fragile' global growth outlook: RBI Bulletin

Media Coverage

Indian economy 'resilient' despite 'fragile' global growth outlook: RBI Bulletin
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ఐక్యతా మహాకుంభమేళా – నవ శకానికి నాంది
February 27, 2025

పవిత్ర నగరమైన ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఒక గొప్ప ఐక్యతా మహాయజ్ఞం పూర్తయింది. ఒక జాతిలో చైతన్యం పురివిప్పినప్పుడు- శతాబ్దాల నాటి అణచివేత ధోరణికి సంబంధించిన సంకెళ్ల నుంచి విముక్తి కలిగినపుడు- ఉప్పొంగిన ఉత్సాహంతో అది స్వేచ్ఛా వాయువుల్ని ఆస్వాదిస్తుంది. గత నెల 13 నుంచి ప్రయాగరాజ్‌లో దిగ్విజయంగా సాగిన ఐక్యతా మహాకుంభ మేళా (ఏక్తా కా మహాకుంభ్) సరిగ్గా ఈ ఫలితానికి సాక్షిగా నిలిచింది.

|

గతేడాది జనవరి 22న, అయోధ్యలోని రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా, నేను దైవభక్తి గురించీ, దేశభక్తి గురించీ మాట్లాడుతూ దేవుడి పట్లా, దేశం పట్లా- భక్తి ఉండాలని చెప్పాను. ప్రయాగరాజ్‌లో జరిగిన మహా కుంభమేళాకు దేవుళ్లు, దేవతలతో పాటు, సాధువులు, మహిళలు, పిల్లలు, యువకులు, వృద్ధులు ఇలా అంతా ఒక్కచోటనే కలిశారు. జాతి చైతన్యం మేల్కొన్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూశాం. ఇది ఐక్యతా మహా కుంభమేళా. ఈ పవిత్ర సందర్భం కోసం 140 కోట్ల మంది భారతీయుల నమ్మకాలన్నీ ఒకే చోట, ఒకే సమయంలో ఏకమయ్యాయి.

ఈ పవిత్ర ప్రయాగరాజ్ ప్రాంతంలోనే శృంగవర్‌పూర్ అనే పవిత్ర ప్రాంతం ఉంది. ఇది ఐక్యత, సామరస్యం, ప్రేమకు గుర్తుగా ఈ పుణ్యభూమిలోనే ప్రభు శ్రీరాముడు, నిషధరాజు కలుసుకున్నారు. వారి కలయిక భక్తికీ, సద్భావనకూ ప్రతీక. నేటికీ, ప్రయాగరాజ్ అదే స్ఫూర్తిని మనలో నింపుతోంది.

|

45 రోజులుగా... దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది ప్రజలు ఈ సంగమ ప్రాంతానికి తరలిరావడాన్ని నేను చూశాను. సంగమం వద్ద భావోద్వేగాలు ఒక అలలా పెరుగుతూనే వచ్చాయి. ఈ త్రివేణీ సంగమంలో మునిగి పుణ్యస్నానాన్ని ఆచరించాలన్న ఏకైక లక్ష్యం ప్రతి భక్తుడిలోనూ ప్రతిఫలించింది. గంగా, యమునా, సరస్వతుల పవిత్ర సంగమం ప్రతి యాత్రికునిలో ఉత్సాహాన్నీ, శక్తినీ, ధైర్యాన్నీ నింపింది.

|

ఆధునిక మేనేజ్‌మెంటు నిపుణులు, ప్రణాళిక, విధాన నిపుణులకు ఈ మహా కుంభమేళా ఒక అధ్యయన అంశం. ప్రపంచంలో మరెక్కడా కూడా దీనికి సాటిరాగలదిగానీ, ఈ స్థాయిలో కనిపించే ఉదాహరణగానీ లేదు.

ఈ నదుల సంగమ తీరానికి కోట్లాది మంది ఎలా వచ్చారని ప్రపంచం ఆశ్చర్యంతో చూసింది. ఎప్పుడు వెళ్లాలన్న విషయంలో ప్రజలకు ఎలాంటి అధికారిక ఆహ్వానాలుగానీ, ముందస్తు సమాచారంగానీ ఏదీ లేదు... అయినా కోట్లాది మంది స్వచ్ఛందంగా మహా కుంభమేళాకు ప్రయాణం కట్టారు. సంగమానికి చేరుకుని, పుణ్య జలాల్లో మునక వేయడం ద్వారా అలౌకిక ఆనందాన్ని ఆస్వాదించారు.

|

పుణ్య జలాల్లో మునక తర్వాత… మాటలకు అందని ఆనందం, తృప్తితో నిండిపోయిన భక్తుల ఆ ముఖాల్ని మరిచిపోవడం అసాధ్యం. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులైన మన సోదరసోదరీమణులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈ పవిత్ర సంగమానికి చేరుకోగలిగారు.

|

ముఖ్యంగా భారత యువత భాగస్వామ్యం నాకు మరింత ఉత్సాహాన్ని అందించింది. మహా కుంభమేళాలో పాల్గొనడం ద్వారా మన అద్భుత సంస్కృతీ, వారసత్వాలకు మార్గదర్శకులుగా ఉంటామంటూ యువత మనకు గొప్ప సందేశాన్ని పంపింది. వాటి పరిరక్షణ దిశగా వారికున్న బాధ్యతలను గుర్తించి, వాటిని ముందుకు తీసుకుకెళ్లేందుకు సంకల్పించారు.

ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు అత్యధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు కొత్త రికార్డులను సృష్టించారు. ఇక్కడికి వచ్చిన వారికి మించి, వివిధ కారణాలతో ఇక్కడికి రాలేకపోయినవారు సైతం ఈ పుణ్యకార్యంతో మానసికంగా అనుసంధానమయ్యారు. ఇక్కడి నుంచి వెళుతూ వెళుతూ భక్తులు తీసుకెళ్లిన త్రివేణీ సంగమ జలాలను లక్షలాది మందికి అలౌకిక ఆనందాన్ని అందించాయి. మహా కుంభమేళా యాత్ర చేసి వెనక్కి వచ్చిన వారికి ఊరంతా ఆహ్వానం పలికింది. సమాజం వారిని గౌరవించింది.

|

గత కొన్ని వారాలుగా జరిగిన ఈ మహా కార్యక్రమం అపూర్వం. రాబోయే శతాబ్దాలకు పునాది వేసింది.

ఎవరి ఊహలకూ అందని స్థాయిలో భక్తులు ప్రయాగరాజ్ కు తరలివచ్చారు. గతంలో జరిగిన కుంభమేళాల ఆధారంగా మాత్రమే అధికార యంత్రాంగం అంచనా వేసింది.

ఈ ఐక్యతా మహాకుంభమేళాలో సుమారుగా అమెరికా జనాభాకు రెండింతల మంది పాలుపంచుకున్నారు.

కోట్లాది భారతీయుల ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక పండితులు విశ్లేషిస్తే... భారత్ తన వారసత్వం పట్ల గర్విస్తోందనీ, కొత్తగా లభించిన చేతనతో వారంతా ముందుకు సాగుతున్నారనీ కచ్చితంగా తెలుసుకుంటారు. ఒక నవ శకం ఆవిష్కారం అయిందనీ, ఇది రేపటి భారతదేశపు నిర్మాణానికి దారులు వేస్తుందని నేను నమ్ముతున్నాను.

|

మహా కుంభమేళా భారత జాతీయతను వేల సంవత్సరాలుగా బలోపేతం చేసింది. పూర్ణ కుంభమేళా జరిగిన ప్రతిసారీ సాధువులు, పండితులు, మేధావులు ఒక చోటకు వచ్చి, ఆయా కాలాల్లోని సమాజ స్థితిగతుల గురించి చర్చించేవారు. వారి ఆలోచనలు దేశానికి, సమాజానికి దిశానిర్దేశం చేసేవి. ప్రతి ఆరేళ్లకోసారి జరిగే అర్ధకుంభ మేళాలో అప్పటి వరకూ చేసిన ఆలోచనలను సమీక్షించేవారు. 144 సంవత్సరాల పాటు జరిగిన 12 పూర్ణకుంభ మేళా కార్యక్రమాల తర్వాత- వాడుకలో లేని, కాలం చెల్లిన సంప్రదాయాలను రద్దు చేసేవారు. సరికొత్త ఆలోచనలను స్వీకరించేవారు. కొత్త సంప్రదాయాలకు శ్రీకారం చుట్టి, మారిన కాలంతోపాటు ప్రయాణం చేసేవారు.

144 ఏళ్ల తర్వాత... ఈ మహా కుంభమేళాలో, మన సాధువులు మరోసారి భారత అభివృద్ధి ప్రయాణానికి సరికొత్త సందేశాన్ని అందించారు. అది ఏమంటే- అభివృద్ధి చెందిన భారతదేశం - వికసిత్ భారతం.

ఈ ఐక్యతా మహా కుంభమేళాకు ప్రతి యాత్రికుడు- ధనికులు కావచ్చు, పేదలు కావచ్చు.. యువకుడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు.. గ్రామాలు కావచ్చు, నగరాలు కావచ్చు… తూర్పు పశ్చిమాలు, ఉత్తర దక్షిణాలు… కులం, మతం, భావజాలం అన్న భేదాలేమీ లేకుండా కలిసిపోయారు. ఇందులో సాకారమైన ఏక్ భారత్- శ్రేష్ఠతా భారత్ కోట్లాది మందిలో ధైర్యాన్ని ప్రోది చేసింది. ఇపుడు, ఇదే స్ఫూర్తితో అభివృద్ధి చెందిన భారతావని నిర్మాణం కోసం మనం చేరువ అవుదాం.

|

బాల్యంలో శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకు బ్రహ్మాండమంతటినీ తన నోటిలో చూపిన సంగతి నాకు జ్ఞాపకానికి వచ్చేలా చేసింది. ఈ మహా కుంభమేళా- సమష్టిగా భారత దేశ ప్రజల అపారమైన శక్తిని ఇటు దేశానికీ, అటు ప్రపంచానికీ చూపించింది. మనం ఇప్పుడు ఈ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం కోసం మనల్ని మనం అంకితం చేసుకోవాలి.

గతంలో భక్తి ఉద్యమానికి చెందిన ప్రబోధకులు మన సమష్టి సంకల్ప బలాన్ని గుర్తించి, ప్రోత్సహించారు. స్వామి వివేకానంద నుంచి శ్రీ అరబిందో వరకు, గొప్ప ఆలోచనాపరులంతా మన సమిష్టి సంకల్ప శక్తిని మనకు తెలియజెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ సైతం దీని ప్రభావాన్ని గుర్తించారు. అయితే దురదృష్టవశాత్తూ స్వాతంత్య్రానంతరం ఈ సమిష్టి బలాన్ని సరిగ్గా గుర్తించి, అందరి సంక్షేమం కోసం ఉపయోగించినట్లయితే, కొత్తగా ఏర్పడిన స్వతంత్ర దేశానికి గొప్ప శక్తిని అందించి ఉండేది. దురదృష్టవశాత్తూ ఇంతకు పూర్వం ఎవరూ చేసి ఉండలేదు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఇపుడు ఈ సమష్టి సంకల్ప బలం నా కళ్ల ముందు కనిపించడం పట్ల నా మనసు ఉల్లాసం చెందుతోంది.

|

వేదాల నుంచి వివేకానందుని బోధనల వరకు, ప్రాచీన గ్రంథాల నుంచి ఆధునిక ఉపగ్రహాల వరకు, భారతదేశానికి సంప్రదాయలు ఈ దేశాన్ని తీర్చిదిద్దాయి. మన పూర్వీకులు, మహారుషులు అందించిన జ్ఞాపకాల నుంచి మనం కొత్త స్ఫూర్తిని అందుకోవాలని ఒక పౌరుడిగా నా విజ్ఞప్తి. నూతన సంకల్పంతో ముందుకు సాగడానికి మనకు ఈ ఐక్యతా మహా కుంభమేళా సహాయపడొచ్చు. ఐక్యతను మన మార్గదర్శక సూత్రంగా చేసుకుందాం. దేశ సేవే- మాధవ సేవగా భావిస్తూ కలిసికట్టుగా పనిచేద్దాం.

వారణాసిలో ఎన్నికల ప్రచారంలో, "గంగామాత నన్ను పిలిచింది" అని నేను చెప్పాను. ఇది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు. మన పవిత్ర నదుల పరిశుభ్రత పట్ల బాధ్యత కోసం ఇచ్చిన పిలుపు కూడా. ప్రయాగరాజ్‌లోని గంగా, యమునా, సరస్వతుల సంగమాన్ని దర్శించినప్పుడు నా సంకల్పం మరింత బలపడింది. మన నదుల పరిశుభ్రత మన జీవితాలతో లోతుగా ముడిపడి ఉంది. చిన్నవైనా, పెద్దవైనా మన నదులన్నింటినీ జీవదాతలుగా భావించి వాటిని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ మహా కుంభమేళా మన నదుల పరిశుభ్రత కోసం మనం మన కృషిని కొనసాగించేందుకు స్ఫూర్తినిచ్చింది.

|

ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత తేలికైన పని కాదని నాకు తెలుసు. మా భక్తిలో ఏవైనా లోపాలు ఉంటే మమ్మల్ని క్షమించమని గంగా, యమునా, సరస్వతి మాతలను నేను ప్రార్థిస్తున్నాను. జనతా జనార్ధనుడని చూస్తున్నాను. ప్రజలను నేను దైవ స్వరూపంగా భావిస్తాను. వారికి సేవ చేసే మా ప్రయత్నాల్లో ఏదైనా లోపం జరిగి ఉంటే, నేను అందుకు ప్రజలను సైతం క్షమాపణ కోరుతున్నాను.

మహాకుంభ్‌లో కోట్లాది మంది భక్తి భావంతో పాలుపంచుకున్నారు. వారికి సేవ చేసే బాధ్యతను సైతం అదే భక్తి భావంతో నిర్వహించాం. యోగి జీ నాయకత్వంలో, పరిపాలన యంత్రాంగం, ప్రజలు కలిసి ఈ ఐక్యతా మహా కుంభమేళాను విజయవంతం చేయడానికి కలిసికట్టుగా పనిచేశారని ఉత్తరప్రదేశ్ పార్లమెంటు సభ్యునిగా నేను గర్వంగా చెప్పగలను. రాష్ట్రం, కేంద్రం, పాలకులు లేదా నిర్వాహకులు అనే తేడాలేవీ లేకుండా ప్రతి ఒక్కరూ తమనుతాము సేవకులుగా భావించి అంకితభావంతో పనిచేశారు. పారిశుధ్య కార్మికులు, పోలీసులు, పడవలు నడిపేవారు, డ్రైవర్లు, ఆహారం అందించే వ్యక్తులు ఇలా అందరూ అవిశ్రాంతంగా పని చేశారు. ప్రత్యేకించి, అనేక అసౌకర్యాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రయాగరాజ్ ప్రజలు యాత్రికులను హృదయపూర్వకంగా స్వాగతించిన విధానం చాలా స్ఫూర్తిదాయకం. వారికి, ఉత్తరప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

|

మన దేశ ఉజ్వల భవిష్యత్తుపై నాకు ఎప్పుడూ అచంచలమైన నమ్మకం ఉంది. ఈ మహా కుంభమేళాను వీక్షించడంతో నా దృఢ విశ్వాసం మరింత బలోపేతమైంది.

140 కోట్ల మంది భారతీయులు ఈ ఐక్యతా మహా కుంభమేళాను ప్రపంచస్థాయి కార్యక్రమంగా మార్చిన తీరు నిజంగా అద్భుతం. మన ప్రజల అంకితభావం, భక్తి, ప్రయత్నాలు నాకు ఎంతో సంతోషం కలిగించాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన శ్రీ సోమనాథుడిని త్వరలోనే దర్శించుకుంటాను. ఈ జాతీయ సమష్టి కృషి ఫలాలను ఆయనకు సమర్పిస్తాను. అలాగే ప్రతి భారతీయుడి క్షేమం కోసం ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తాను.

మహా కుంభమేళా భౌతికంగా మహాశివరాత్రి పర్వదినాన విజయవంతంగా ముగిసి ఉండవచ్చు. కానీ గంగానది శాశ్వత ప్రవాహంలా, మహాకుంభమేళా మేల్కొల్పిన ఆధ్యాత్మిక బలం, జాతీయ స్పృహ అలాగే ఐక్యత మనకు అనేక తరాల వరకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.