కోవిడ్ కు సంబంధించిన పరిస్థితిని సమీక్షించడం కోసం సాధికార బృందాలతో దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపు వంటి చర్యల గురించి, ఆర్థిక మరియు సంక్షేమ చర్యలపై ఏర్పాటైన సాధికార బృందం, ప్రధానమంత్రి కి సవివరమైన ప్రదర్శన ఇచ్చింది. "ఒక దేశం – ఒకటే రేషన్ కార్డు" పధకం ద్వారా చేపట్టిన చర్యల కారణంగా ఆహార ధాన్యాల పంపిణీ సులభతరమైన విషయాన్ని ఈ సమావేశంలో చర్చించారు. ముందు వరుసలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ప్రయోజనం చేకూర్చే బీమా పధకం అమలు కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. ఉచిత ఆహార-ధాన్యాలు సరఫరా చేసే పధకం యొక్క ప్రయోజనాలు, ఎటువంటి సమస్యలు లేకుండా, పేద ప్రజలు పొందేలా, రాష్ట్రాలతో, సన్నిహిత సమన్వయంతో పనిచేయాలని, ప్రధానమంత్రి ఆదేశించారు. పెండింగులో ఉన్న బీమా దావాల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలనీ, తద్వారా మరణించిన వారిపై ఆధారపడిన వారు సకాలంలో ప్రయోజనాలను పొందగలుగుతారనీ, ప్రధానమంత్రి పేర్కొన్నారు.
మహమ్మారిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన సలహాలు, వివిధ విధివిధానాల రూపకల్పన పై, సరఫరా వ్యవస్థ, రవాణా నిర్వహణను సులభతరం చేయడానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన సాధికార బృందం, సవివరమైన ప్రదర్శన ఇచ్చింది. ఎటువంటి అవరోధాలు లేకుండా, సరుకుల రవాణాను నిర్ధారించడానికి ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ప్రధానమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా సరఫరా వ్యవస్థలో అంతరాయాలు నివారించబడతాయని ఆయన చెప్పారు.
ప్రవేటు రంగం, ఎన్ఎ.జి.ఓ.లు, అంతర్జాతీయ సంస్థలతో చురుకైన భాగస్వామ్యంతో ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో, ప్రైవేటు రంగం, ఎన్.జి.ఓ.లు, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం కోసం ఏర్పాటైన సాధికార బృందం, ప్రధానమంత్రి కి వివరించింది. ప్రత్యేకత లేని పనులలో పౌర సమాజానికి చెందిన కార్యకర్తలను ప్రోత్సహించడం ద్వారా, ఆరోగ్య సంరక్షణ రంగం పై ఒత్తిడిని తగ్గించడానికి వారి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో అన్వేషించాలని, ప్రధానమంత్రి, సంబంధిత అధికారులను కోరారు. రోగులు, వారిపై ఆధారపడిన వారితో పాటు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ మార్గాలను నెలకొల్పడానికీ, నిర్వహించడానికీ, ఎన్.జీ.ఓ.లు సహాయపడతాయనే అంశంపై వారు చర్చించారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడానికీ, కాల్ సెంటర్లను నిర్వహించడానికీ, మాజీ సైనికులను ప్రోత్సహించవచ్చు.