వారంతా భారత తీరాలను దాటి వెళ్లారు గానీ, దేశం పట్ల వారి ప్రేమాభిమానాలు మటుకు వారితోనే ఉన్నాయి. ప్రపంచ యవనికపై అత్యంత సచేతనం, విజయవంతమైన ప్రవాసీ సమాజాల్లో భారతీయులదీ ఒకటి. ఆయా దేశాల స్థానిక సంస్కృతి, సంప్రదాయాలతో వీరంతా చక్కగా మమేకమై స్థిరపడటమే కాక వారి అభివృద్ధికి కూడా దోహదపడుతున్నారు. అదే సమయంలో వారి హృదయాలు భారతదేశం కోసమే కొట్టుకుంటుంటాయి కాబట్టే దేశానికి అవసరమైనప్పుడల్లా వారు చేయూతను ఇస్తూనే ఉన్నారు.
శ్రీ నరేంద్ర మోదీ ప్రవాసుల ఆదరణను సదా చూరగొంటూ ఉన్నారు. భారతదేశాన్ని పరివర్తన మార్గం పట్టించగల ఉజ్జ్వల మార్పునకు ప్రతినిధిగా ఆయనను పరిగణిస్తారు. ప్రతి విదేశీ పర్యటనలో ప్రవాసులతో సంధానం దిశగా ప్రధాన మంత్రి ఈ అంశాన్ని ప్రస్తావిస్తుంటారు. న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ నుంచి సిడ్నీలోని ఆల్ఫోన్స్ ఎరీనా దాకా; హిందూ మహాసముద్రంలోని సెశెల్స్, మారిషస్‌ల నుంచి షాంఘై దాకా సంగీత వినీలాకాశంలో ప్రకాశించే ఉజ్జ్వల తార (రాక్ స్టార్)కు లభించే తరహాలో ప్రవాస భారతీయులు శ్రీ నరేంద్ర మోదీని స్వాగతిస్తున్నారు.
ప్రధాన మంత్రి ప్రసంగాలు ఎల్లప్పుడూ తీవ్ర ఆకాంక్షల సమాహారంగా ఉంటూ, భారతదేశంలో మార్పు దిశగా వీస్తున్న పవనాలను గురించి వివరిస్తుంటాయి. ప్రజల జీవితాలలో ఆశాభరితమైన మార్పును తీసుకురావవడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెల్లడిస్తుంటాయి. భారతదేశ ప్రగతిలో ప్రవాసుల పాత్రను ప్రస్ఫుటం చేస్తుంటాయి.
ప్రవాస భారతీయుడు (పిఐఒ), విదేశంలోని భారత పౌరుడు (ఒసిఐ) పథకాల విలీన సంస్కరణ ఎంతో ముఖ్యమైనదే కాక ప్రవాసులంతా ఎంతగానో ఆశించింది కావడంతో వారంతా దీనిని విశేషంగా ప్రశంసించారు. అలాగే వీసా నిబంధనల సడలింపును, సరళీకరణను కూడా అనేక ప్రాంతాలలో కొనియాడారు.
ప్రవాస సముదాయాల సమావేశాల్లోనే కాక వివిధ విమానాశ్రయాలు, పలు కార్యక్రమాలకు హాజరయ్యే సందర్భాలలో కూడా భారత ప్రవాసులు శ్రీ మోదీని సాదరంగా స్వాగతిస్తుంటారు. ప్రధాన మంత్రి విదేశాల్లో పాల్గొనే కార్యక్రమాల్లో ‘మోదీ.. మోదీ.. మోదీ’ అంటూ హర్షధ్వానాలు చేయడం సర్వసాధారణ దృశ్యం. ఫ్రాన్స్‌లోని ప్రథమ ప్రపంచ యుద్ధ స్మారకం వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలోనూ ఇదే విధంగా నినదిస్తున్న సమయంలో అలా చేయవద్దని ప్రధాన మంత్రి వారించారు. దానికి బదులుగా “అమరవీరులు వర్ధిల్లాలి” (షహీద్ అమర్ రహే) అని నినదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు
భారతదేశ అభివృద్ధిలో ప్రవాసుల కీలక పాత్రను గుర్తించిన ప్రధాన మంత్రి ఆ దిశగా వారిని కర్తవ్యోన్ముఖులను చేస్తుంటారు.