హనోవర్ పారిశ్రామిక ప్రదర్శనను ప్రపంచంలో అతి పెద్ద, ప్రతిష్టాత్మక పారిశ్రామిక మహా సమ్మేళనంగా భావిస్తారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక తయారీదారు సంస్థలు వాటి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తుంటాయి. ఈ ప్రదర్శనను తిలకించేందుకు దేశ దేశాల నుండి లక్షలాది మంది ఈ నగరానికి తరలివస్తారు. భారతదేశం కూడా 2015లో హనోవర్ పారిశ్రామిక ప్రదర్శనలో పాల్గొనే దేశాలలో ఒక భాగస్వామిగా మారింది.
ఈ ప్రదర్శనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ లు సంయుక్తంగా ప్రారంభించారు. పెట్టుబడులకు వీలు కల్పించడంలో భారతదేశం సునిశిత శక్తి, సుసంపన్నసామర్థ్యాలు హనోవర్ ప్రదర్శనలో కళ్లకు కట్టాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ పేరిట ఏర్పాటు చేసిన విశిష్ట ప్రాంగణం... భారతీయ విలువలు, క్షేత్ర స్థాయిలో చోటుచేసుకున్న మార్పులను వివరిస్తూ భారతదేశంలో ఉత్పాదన అంటే పెట్టుబడులకు ఓ ఆకర్షణీయ గమ్యమన్న వాస్తవాన్నిచాటిచెప్పింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంగణాలు విస్తృత ఆదరణను చూరగొన్నాయి
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ- బి జె పి నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వ పాలన మొదలైన తొలి ఏడాదిలోనే హనోవర్ ప్రదర్శన వంటి ప్రతిష్టాత్మక పారిశ్రామిక మహా సమ్మేళన దేశాలలో భారతదేశం కూడా ఒక భాగస్వామి కాగల అవకాశం లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. వ్యాపార సౌలభ్య కల్పన దిశగా తొలి ఏడాది పాలనలోనే ఎన్ డి ఎ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. పన్ను వ్యవస్థల సరళీకరణ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే వాతావరణ సృష్టి గురించి వివరించారు.
శ్రీ మోదీ ద్వైపాక్షిక పర్యటనకు వెళ్లిన దేశాలన్నిటిలోనూ అనేక మంది ప్రపంచ నాయకులు ‘మేక్ ఇన్ ఇండియా’ విజయవంతం కాగలదంటూ పరిపూర్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. వీరిలో మలేషియా ప్రధాని శ్రీ నజీబ్ రజాక్, సింగపూర్ ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్, ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఎబాట్, జపాన్ ప్రధాని శ్రీ శింజో అబె, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ హోలాండ్, కెనడా ప్రధాని శ్రీ హార్పర్ తదితరులు ఉన్నారు.
భారతదేశంపై సానుకూల దృక్పథ సృష్టితో పాటు దేశంలో పెట్టుబడులు, తయారీకి గల అవకాశాలను ఎరుకపరచేందుకు గడచిన ఏడాది కాలంలో ప్రధాన మంత్రి చేసిన ప్రయత్నాలు ఫలించి, భారతదేశంలో గల విస్తృత అవకాశాల వైపు ప్రపంచం ఇప్పుడు దృష్టి సారిస్తోంది.