ప్రముఖులారా,
మీరు ఇచ్చిన వెల కట్టలేని సూచనలు – సలహాలు, వ్యక్తం చేసిన సకారాత్మక ఆలోచనలను నేను స్వాగతిస్తున్నాను. భారతదేశ ప్రతిపాదనల విషయానికి వస్తే, వాటికి సంబంధించిన అన్ని వివరాలను నా బృందం మీకు తెలియజేస్తుంది. అన్ని విషయాల్లోనూ మనం ఒక నిర్ణీత కాలం లోపల ముందుకు వెళదాం.
ప్రముఖులారా,
భారతదేశానికి, కేరికామ్ దేశాలకు మధ్య ఉన్న సంబంధాలు మన గతానుభవాలు, తక్షణావసరాలతో పాటు మన భవిష్యత్తు ఆశలు, ఆకాంక్షలపైన ఆధారపడి ఉన్నాయి.
ఈ సంబంధాలను మరెంతగానో ముందుకు తీసుకు పోవాలని భారతదేశం భావిస్తోంది. మనం చేస్తున్న యావత్తు కృషిలోనూ, అభివృద్ధి చెందుతున్న దేశాలకున్న ఆందోళనతో పాటు ఆయా దేశాల ప్రాధాన్యాలపైనా మనం దృష్టి సారించాం.
కిందటి సంవత్సరం జి20కి భారతదేశం అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించినప్పుడు, జి20 అభివృద్ధి చెందుతున్న దేశాల వాణిగా తెర మీదకు వచ్చింది. నిన్న బ్రెజిల్‌లో కూడా... అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నేను ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చాను.
ప్రపంచ వ్యాప్తంగా సంస్కరణలు అవసరమని భారతదేశంతో పాటు కేరికామ్ లోని మన మిత్రులంతా అంగీకరించినందుకు నేను సంతోషిస్తున్నాను.
వారంతా నేటికాలపు ప్రపంచానికి, ఇప్పటి సమాజానికి అనుగుణంగా తమను తాము మలచుకోవలసిన అవసరం ఉంది. ఇది తక్షణావసరం. దీనిని సాకారం చేయాలంటే, అందుకు కేరికామ్‌తో కలసి పని చేయడం, కేరికామ్ మద్ధతును పొందడం ఎంతో ముఖ్యం.
ప్రముఖులారా,
ఈ రోజు మన సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలు సహకార పరంగా ప్రతి రంగంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి.
ఈ నిర్ణయాలను ఆచరణలోకి తీసుకు రావడంలో ఇండియా-కేరికామ్ జాయింట్ కమిషన్ కు, సంయుక్త కార్యాచరణ సంఘాలకు ఓ ముఖ్య పాత్ర ఉంటుంది.
మన మధ్య ఉన్న సకారాత్మక సహకారాన్ని ముందుకు తీసుకు పోవడానికి, కేరికామ్ మూడో శిఖరాగ్ర సమావేశాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయవలసిందని నేను సూచిస్తున్నాను.
అధ్యక్షుడు శ్రీ ఇర్ఫాన్ అలీ కి, ప్రధాని శ్రీ డికన్ మిషెల్ కు, కేరికామ్ సచివాలయానికి, మీ అందరికీ కూడా నేను మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.