‘చౌరీ చౌరా’ అమరవీరుల కు చరిత్ర పుటల లో ఇవ్వదగినంత ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు అంటూ ప్రధాన మంత్రి గురువారం నాడు విచారాన్ని వ్యక్తం చేశారు. అంతగా ప్రచారం లోకి రానటువంటి అమరవీరుల, స్వాతంత్య్ర యోధుల గాథలను దేశ ప్రజల ముంగిట కు తీసుకు రావడానికి మనం చేసే కృషే వారికి అర్పించగలిగే ఒక యథార్థమైన నివాళి కాగలదు అని ఆయన అన్నారు. దేశం స్వాతంత్య్రం సంపాదించుకొని 75వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న ఈ ఏడాది లో, ఈ కార్యానికి మరింత సందర్భ శుద్ధి ఉంది అని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో గల చౌరీ చౌరా లో ‘చౌరీ చౌరా’ శత వార్షికోత్సవాల ను ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించిన తరువాత శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమంలో ప్రసంగించారు.
చౌరీ చౌరా అమరవీరుల గురించిన చర్చ ఎంత మేరకు అయితే జరగాలో అంత జరగక పోవడమనేది దురదృష్టకరం అని ప్రధాన మంత్రి అన్నారు. చౌరీ చౌరా అనేది సామాన్య ప్రజానీకం స్వీయ ప్రేరణను పొంది సలిపినటువంటి పోరాట ఘట్టం అని ఆయన అన్నారు. ‘‘ఈ పోరాటం తాలూకు క్రాంతికారుల కు చరిత్ర పుటల లో దక్కవలసినంత ప్రాముఖ్యం లభించలేదు; అయినప్పటికీ కూడా వారు చిందించిన రక్తం ఈ గడ్డ లో మిళితమైవుంది’’ అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.
స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించినంతవరకు ఒక ఘటన కు గాను 19 మంది స్వాతంత్య్ర యోధుల ను ఉరి తీసిన అటువంటి ఘట్టాన్ని మరొకటి కనుగొనడం అరుదైన విషయం అని ప్రధాన మంత్రి అన్నారు. బాబా రాఘవ్ దాస్, పండిత్ మదన్ మోహన్ మాలవీయ ల కృషి ఫలితంగా ఇంచుమించు 150 మంది ఉరికంబం పాలబడకుండా ప్రాణాల ను దక్కించుకొన్న సంగతి ని శ్రీ నరేంద్ర మోదీ గుర్తుకు తెచ్చారు.
స్వాతంత్య్ర సంగ్రామం తాలూకు అంతగా తెలియనటువంటి అంశాల ను అన్వేషించడానికి జరుగుతున్న ప్రయత్నాల లో విద్యార్థులు, యువతీ యువకులు పాలుపంచుకొంటున్న ఈ ప్రచార కార్యక్రమం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్య్రాన్ని దక్కించుకొని 75 సంవత్సరాల కాలం పూర్తి అయిన సందర్భాన్ని గురించి, స్వాతంత్య్ర సమర వీరుల లో అంతగా వెలుగు లోకి రానటువంటి వారిని గురించి తెలియజేసే ఒక పుస్తకాన్ని రాయండి అంటూ యువ రచయితల ను విద్య మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని ఆయన తెలిపారు. చౌరీ చౌరా తాలూకు స్వాతంత్ర్య యోధులు అనేక మంది జీవితాలను దేశం కట్టెదుటకు తీసుకువచ్చేందుకు అవకాశం ఉండవచ్చంటూ ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ ‘చౌరీ చౌరా’ శతవార్షికోత్సవాలను స్థానిక కళల కు, స్థానిక సంస్కృతి కి, ఆత్మనిర్భరత కు జతపరుస్తూ ఉండటం అనేది మన స్వాతంత్య్ర యోధుల కు అర్పిస్తున్నటువంటి ఒక నివాళి లా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకుగాను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను కూడా ఆయన ప్రశంసించారు.