ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సింగపూర్ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి శ్రీ హెంగ్ స్వే కేట్ ఈ రోజున సమావేశమయ్యారు.
ఈ సందర్భం గా శ్రీ కేట్ తమ ప్రధాని శ్రీ లీ సియెన్ లూంగ్ యొక్క మరియు సీనియర్ మంత్రి శ్రీ గోహ్ చోక్ టోంగ్ యొక్క సందేశాన్ని శ్రీ మోదీ కి అందజేశారు. వారితో తాను జరిపిన ఫలప్రద సమావేశాల ను ప్రధాన మంత్రి శ్రీ మోదీ గుర్తు కు తెచ్చుకొని, మరి వారికి తన శుభాకాంక్షల ను తెలియ జేయవలసింది గా ఉప ప్రధాని శ్రీ కేట్ ను కోరారు.
కిందటి నెల లో న్యూ యార్క్ లోని ఐక్య రాజ్య సమితి లో మహాత్మ గాంధీ 150వ జయంతి కి గుర్తు గా నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమం లో ప్రధాని శ్రీ లీ సియెన్ లూంగ్ పాలుపంచుకొన్నందుకు కూడా ప్రధాన మంత్రి శ్రీ మోదీ తన ప్రశంసలు వ్యక్తం చేశారు.
భారతదేశ ప్రభుత్వం చేపట్టిన పరివర్తన పూర్వకమైన చర్యల ను ఉప ప్రధాని శ్రీ కేట్ ప్రస్తావించి, తత్ పర్యవసానం గా ఇనుమడించిన పెట్టుబడి అవకాశాలు, మరీ ముఖ్యం గా భారతదేశం లోని మౌలిక సదుపాయాల కల్పన రంగం లో ఇవి మరింత గా పెరగడాన్ని ప్రస్తావించారు. అలాగే, ఆయన ఫిన్‌టెక్ రంగం సహా, సాంకేతిక విజ్ఞాన రంగం లో సింగపూర్ మరియు భారతదేశం ల మధ్య సహకారం పెంపొందడాన్ని గురించి కూడా ప్రముఖం గా ప్రస్తావించారు.
ఉభయ దేశాల మధ్య వ్యాపారం మరియు పెట్టుబడి సంబంధాలు వర్ధిల్లుతూ ఉండటం పట్ల ప్రధాన మంత్రి శ్రీ మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సింగపూర్ లో భీమ్ యాప్, ఇంకా రూపే కార్డు ల ప్రారంభాన్ని గురించి ఆయన చెప్తూ, ఇవి ఆర్థిక లావాదేవీల లో సరళత్వాన్ని ఎంతగానో ఇనుమడింప చేశాయని పేర్కొన్నారు. సింగపూర్ కు చెందిన విద్యార్థుల భాగస్వామ్యం తో చెన్నై లో సంయుక్తం గా నిర్వహించిన రెండవ హ్యాకథన్ ఫలప్రదమైందని కూడా ఆయన అన్నారు. ఈ పరిణామాలు అన్నీ ఉభయ దేశాల మధ్య సన్నిహిత, సాముదాయక వ్యాపారపరమైన మరియు నూతన ఆవిష్కరణ సంబంధిత భాగస్వామ్యం నెలకొంటోందనడానికి నిదర్శనం గా ఉన్నాయని చెప్పారు.