ఐక్యరాజ్య సమితి 76వ సర్వ ప్రతినిధి సభ సమావేశాలకు (యూఎన్‌జీఏ) అధ్యక్షుడుగా ఎన్నికైన మాల్దీవ్స్ విదేశాంగ శాఖ మంత్రి గౌరవనీయులైన అబ్దుల్లా షాహిద్ ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఫోన్‌ద్వారా సంభాషించారు. న్యూయార్క్‌లో 2021 జూలై 7న జరిగిన ఎన్నికలో ఐక్యరాజ్యసమితి 76వ సర్వ ప్రతినిధి సభ సమావేశాలకు (యూఎన్‌జీఏ) అధ్యక్షుడుగా ఎన్నికైన మాల్దీవ్స్ విదేశాంగ శాఖ మంత్రి గౌరవనీయులైన అబ్దుల్లా షాహిద్ ఆ హోదాలో భారత్ సందర్శనకు రానున్నారు.
ఈ నేపథ్యంలో గౌరవనీయులైన అబ్దుల్లా షాహిద్ ఎన్నికపై ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ప్రపంచ వేదికపై మాల్దీవ్స్ ప్రతిష్ఠ ఇనుమడించడాన్ని ఈ పరిణామం ప్రతిబింబిస్తున్నదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నికైన అనంతరం ‘ప్రెసిడెన్సీ ఆఫ్ హోప్’ దిశగా ఆయన చేసిన దార్శనిక ప్రకటనపై ప్రధానమంత్రి అభినందనలు తెలుపుతూ… ఆ పదవీ బాధ్యతల నిర్వహణలో ఆయనకు భారతదేశం నుంచి పూర్తి మద్దతు, సహకారం ఉంటాయని హామీ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి విభాగాలుసహా బహుపాక్షికత ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించడానికి, ప్రపంచ ప్రజానీకం ఆకాంక్షలను నెరవేర్చడానికి బహుపాక్షికతకు ప్రాధాన్యం ఎంతో అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవలి సంవత్సరాల్లో భారత్-మాల్దీవ్స్ ద్వైపాక్షిక సంబంధాలు వేగంగా పురోగమించడంపై ప్రధానమంత్రి-గౌరవనీయులైన అబ్దుల్లా షాహిద్లు చర్చించారు. కోవిడ్-19 మహమ్మారి ఎన్నో ఆటంకాలు కల్పించినప్పటికీ అనేక ద్వైపాక్షిక ప్రాజెక్టులు ప్రగతి పథంలో పయనిస్తుండటంపై ప్రధానమంత్రి ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. 'పొరుగుదేశాలకు ప్రాధాన్యం' అనే భారతదేశ విధానంతోపాటు 'సాగర్' దార్శనికత సౌధానికి మాల్దీవ్స్ కీలక స్తంభమని ఆయన నొక్కి చెప్పారు.
.