రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన దాదాపు రూ.6,456 కోట్లు ఖర్చయ్యే మూడు ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదాన్ని తెలిపింది.
ఈ ప్రాజెక్టులు ఇంతవరకు రైలు మార్గాల సదుపాయానికి నోచుకోనటువంటి ప్రాంతాలను కలుపుతూ రవాణా సంబంధిత సామర్థ్యాన్ని మెరుగు పరచనున్నాయి. అంతేకాకుండా, ఇప్పటికే నిర్వహణలో ఉన్న మార్గాల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, రవాణా వ్యవస్థ వృద్ధికి కూడా తోడ్పడతాయి. ఇది సరఫరా వ్యవస్థలు మరింత సమగ్రతను సంతరించుకోవడానికి, ఆర్థిక వృద్ధి జోరందుకోవడానికి ఉపకరిస్తాయి.
ఈ నూతన మార్గాల ప్రతిపాదనలు భారతీయ రైల్వేలలో సామర్థ్యాన్ని, సేవల తాలూకు విశ్వసనీయతను పెంపొందించి, నేరుగా సంధాన సంబంధిత సౌలభ్యాన్ని అందిస్తూ, రాకపోకలను మెరుగు పరచనున్నాయి. మల్టి-ట్రాకింగ్ ప్రాజెక్టును ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన కార్యకలాపాలు మరింత సరళతరం అవుతాయి. రద్దీ తగ్గుతుంది. రకపోకల రద్దీ మరీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో రద్దీని తగ్గించాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. దానిలో భాగంగానే ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును ఆమోదించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించిన ఒక నవ భారత ఆవిష్కరణ దృష్టికోణానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆయా ప్రాంతాల సంపూర్ణ అభివృద్ధికి దోహద పడుతూ, ఆయా ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను, స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతూ, ప్రజల సమగ్రాభివృద్ధికి తోడ్పడతాయి.
బహుళ విధ సంధానానికి ఉద్దేశించిన ‘పిఎమ్-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ లో ఈ ప్రాజెక్టులు ఒక భాగం. ఒక ఏకీకృత ప్రణాళిక రచన ద్వారా బహుళ విధ సంధానం సాకారం కానుంది. అదే జరిగితే ప్రజల రాకపోకలకూ, వస్తు రవాణాకూ, సేవల మెరుగుదలకూ నిరంతరాయ సంధానం సమకూరుతుంది.
ఒడిషా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోని ఏడు జిల్లాల్లో ఏర్పాటయ్యే ఈ మూడు ప్రాజెక్టులు భారతీయ రైల్వేలకు ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు దాదాపుగా 300 కిలో మీటర్ల మేరకు విస్తరిస్తుంది.
ఈ ప్రాజెక్టుల అమలుతో మరో 14 కొత్త స్టేషన్లు వస్తాయి. ఫలితంగా అభివృద్ధిని కోరుకుంటున్న నువాపాడా, తూర్పు సంగ్భమ్ లకు ఇతర ప్రాంతాలతో అనుసంధానం అవుతాయి. కొత్త లైన్ల వల్ల దాదాపుగా 1300 గ్రామాలకు, సుమారు 11 లక్షల జనాభాకు లబ్ది చేకూరుతుంది. మల్టి-ట్రాకింగ్ ప్రాజెక్టు దాదాపుగా 1,300 గ్రామాలకు, సుమారు 19 లక్షల జనాభాకు అనుసంధానాన్ని పెంచనుంది.
వ్యావసాయిక ఉత్పత్తులు, ఎరువులు, బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు, సిమెంటు, సున్నపురాయి వగైరా సరుకులు ఈ మార్గాల నుంచే రవాణా అవుతుంటాయి. సామర్థ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన పనులను పూర్తి చేయడం వల్ల ప్రతి ఏడాదీ అదనంగా 45 మిలియన్ టన్నుల (ఎమ్‌టిపిఎ) మేరకు అదనంగా వస్తు రవాణా సుసాధ్యం అవుతుంది.
రైల్వేలు పర్యావరణ హితం, శక్తిని ఆదా చేసేవీ కావడంతో, ఇటు వాతావరణ లక్ష్యాల సాధనకు, అటు దేశంలో వస్తు రవాణా సంబంధిత వ్యయాన్ని కనీస స్థాయికి కుదించడంలోను, చమురు దిగుమతులను తగ్గించడం (10 కోట్ల లీటర్లు స్థాయిలో) తో పాటు కార్బన్ డై ఆక్సైడ్ (CO2) ఉద్గారాల స్థాయిని కుదించడంలోను (240 కోట్ల కిలోలు ఇది మరో మాటలో చెప్పాలంటే 9.7 కోట్ల చెట్ల పెంపకానికి సమానం) రైల్వే వ్యవస్థ సహాయకారిగా ఉంటున్నది.