వైద్య పరికరాల తయారీ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను నూతన విధానం ప్రోత్సహిస్తుంది. పెట్టుబడిదారులు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా నిధుల సమీకరణ జరుగుతుంది.
మానవ వనరుల అభివృద్ధి: శాస్త్రవేత్తలు, నియంత్రణ నిపుణులు, ఆరోగ్య నిపుణులు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు మొదలైన విలువ ఆధారిత మానవ వనరుల అభివృద్ధి కోసం విధానంలో చర్యలు అమలు జరుగుతాయి. వైద్య పరికరాల రంగంలో నిపుణుల నైపుణ్యం, రీస్కిల్లింగ్ , అప్‌స్కిల్లింగ్ కోసం అవసరమైన సహకారాన్ని నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ అందిస్తుంది.
భవిష్యత్ వైద్య సాంకేతికతలు, అత్యాధునిక తయారీ పరిశోధనల కోసం నైపుణ్యం కలిగిన మానవ వనరులు లభించేలా చూసేందుకు భవిష్యత్ అవసరాల కోసం నైపుణ్యం కలిగిన మెడ్‌టెక్ మానవ వనరులను అభివృద్ధి చేయడానికి విదేశాలకు చెందిన పరిశ్రమ వర్గాలు/ విద్యా సంస్థలతో కలిసి ప్రత్యేక చర్యలు అమలు చేయడానికి నూతన విధానం వీలు కల్పిస్తుంది.
బ్రాండ్ రూపకల్పన, చైతన్య కార్యక్రమాలు : వివిధ మార్కెట్ అంశాలను పరిశీలించి తగిన చర్యలు అమలు చేసేందుకు మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రత్యేక ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని నూతన విధానంలో ప్రతిపాదించారు. భారతదేశంలో విజయవంతంగా అమలు జరుగుతున్న విధానాలు అమలు చేయడానికి గల అవకాశాలను గుర్తించి, తయారీ, నైపుణ్య రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా అమలు జరుగుతున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేసి అమలు చేయడానికి నూతన విధానం వీలు కల్పిస్తుంది.
వైద్య పరికరాల తయారీ రంగంలో పోటీతత్వ, స్వావలంబన, స్థితిస్థాపకత సాధించి రంగాన్ని వినూత్న పరిశ్రమగా అభివృద్ధి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలను నూతన విధానం అందిస్తుంది. దేశ ఆరోగ్య సంరక్షణ అవసరాలు మాత్రమే కాకుండా ప్రపంచం ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీర్చే విధంగా నూతన విధానం అమలు జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి రోగి-కేంద్రీకృత విధానంతో వైద్య పరికరాల రంగాన్ని వేగవంతమైన వృద్ధి మార్గంలో నడపడం లక్ష్యంగా నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ, 2023 అమలు జరుగుతుంది.