* ప్రతి గ్రామ పంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పిఏసి), ప్రతి పంచాయతీ/ గ్రామంలో పాడి సహకార సంఘాలు, తీర ప్రాంతంలో ఉన్న ప్రతి పంచాయతీ/గ్రామంలో మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయడం, ప్రస్తుతం పనిచేస్తున్న పిఏసి/ పాడి/మత్స్య సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడం
* రానున్న అయిదేళ్ల కాలంలో కనిసం రెండు లక్షల బహుళ ప్రయోజన పిఏసి/ పాడి/మత్స్య సహకార సంఘాలను నెలకొల్పాలని ప్రాథమిక లక్ష్యం నిర్ణయం
* మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను నాబార్డ్, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో ' హోల్-ఆఫ్-గవర్నమెంట్' విధానంతో అమలు చేయడానికి ప్రణాళిక రూపకల్పన
* వ్యాపార కార్యక్రమాలు విస్తరించడానికి పిఏసి/ పాడి/మత్స్య సహకార సంఘాలకు వీలు కల్పించడానికి అనువుగా ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన
* సహకార సంఘాల సభ్యులుగా ఉన్న రైతులు పండించిన ఉత్పత్తులను మార్కెట్ కు తరలించడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించి, రైతుల ఆదాయం పెరిగేలా చూడండం, గ్రామ స్థాయిలో రైతులకు అవసరమైన రుణ సౌకర్యాలు ఇతర సేవలు అందించడం
.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి క్షేత్ర స్థాయి ఉద్యమాన్ని విస్తరించడానికి ప్రణాళిక అమలు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యవేక్షణలో కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆధ్వర్యంలో పనిచేస్తున్న సహకార మంత్రిత్వ శాఖ ఈ ప్రణాళికకు రూపకల్పన చేసింది. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పిఏసి), ప్రతి పంచాయతీ/ గ్రామంలో పాడి సహకార సంఘాలు, తీర ప్రాంతంలో ఉన్న ప్రతి పంచాయతీ/గ్రామంలో మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయడం, ప్రస్తుతం పనిచేస్తున్న పిఏసి/ పాడి/మత్స్య సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందింది. ' హోల్-ఆఫ్-గవర్నమెంట్' విధానంతో మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖలు అమలు చేస్తున్న వివిధ పథకాలను నాబార్డ్, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో అమలు చేయడానికి వీలు కల్పించే విధంగా ప్రణాళిక రూపకల్పన జరిగింది. ప్రణాళికలో భాగంగా రానున్న అయిదేళ్ల కాలంలో కనిసం రెండు లక్షల బహుళ ప్రయోజన పిఏసి/ పాడి/మత్స్య సహకార సంఘాలను నెలకొల్పాలని ప్రాథమిక లక్ష్యంగా నిర్ణయించారు. కార్యాచరణ ప్రణాళికను నాబార్డ్, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సంయుక్తంగా రూపొందిస్తాయి.
సంయుక్తంగా అమలు చేయడానికి ప్రస్తుతం అమలు జరుగుతున్న ఈ క్రింది పథకాలను గుర్తించారు:
ఎ. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ:
i) పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం అమలు జరుగుతున్న జాతీయ ప్రాజెక్టు.నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్‌మెంట్ (ఎన్పీడీడీ),
ii. డెయిరీ ప్రాసెసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్(డీఐడీఎఫ్)
బి. మత్స్య పరిశ్రమ శాఖ:
i. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ( పీఎంఎంఎస్ వై),
ii. ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ (ఎఫ్ఐడీఎఫ్)
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సహకార సంఘాల సభ్యులుగా ఉన్న రైతులు పండించిన ఉత్పత్తులను మార్కెట్ కు తరలించడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించి, రైతుల ఆదాయం పెరిగేలా చూడడం, గ్రామ స్థాయిలో రైతులకు అవసరమైన రుణ సౌకర్యాలు ఇతర సేవలు పొందడానికి అవకాశం కలుగుతుంది. పునరుద్ధరణ సాధ్యం కాని సహకార సంఘాలను రద్దు చేసి వాటి స్థానంలో నూతనంగా ప్రాథమిక సహకార సంఘాలను ఏర్పాటు చేస్తారు.
నూతనంగా గ్రామీణ ప్రాంతాల్లో పిఏసి/ పాడి/మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక వల్ల రైతులు తాము పండించిన పంటలకు ఎక్కువ ధరలు పొందుతారు. మార్కెట్ పరిధి పెరుగుతుంది. ఉత్పత్తులను సులువుగా రవాణా చేయడానికి వీలు కలుగుతుంది.
అమలు చేయడానికి అవసరమైన పధకాలను గుర్తించి వాటిని పటిష్టంగా అమలు చేయడానికి మార్గదర్శకాలను రూపొందించడానికి కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి బహుళ మంత్రిత్వ శాఖల కమిటీ ఏర్పాటవుతుంది. కమిటీ సభ్యులుగా కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ, మత్స్య, పశుసంవర్ధక పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖల మంత్రులు, సంబంధిత కార్యదర్శులు, నాబార్డ్, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు చైర్మన్లు వ్యవహరిస్తారు.కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాల మేరకు, పటిష్టంగా అమలు జరిగేలా చూసేందుకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు అయ్యాయి.
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ఆర్థిక పరిపుష్ఠి కల్పించేందుకు పంచాయతీ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కల్పించే విధంగా చట్ట సవరణ చేసేందుకు సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరిపిన మంత్రిత్వ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మార్పుల వల్ల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు గిడ్డంగుల నిర్మాణం, ఆహార ధాన్యాల సేకరణ, ఎరువులు విత్తనాల సరఫరా, ఎల్పీజీ/సిఎన్జీ/పెట్రోల్/డీజిల్ అమ్మకాలు, స్వల్ప, దీర్ఘ కాళికా రుణాలు మంజూరు, వుమ్మడి సేవా కేంద్రాల ఏర్పాటు, చౌక ధరల దుకాణం ఏర్పాటు, నీటి పారుదల లాంటి 25 వ్యాపార కార్యకలాపాలు చేపట్టడానికి వీలవుతుంది. తమకు అనువుగా ఉండే విధంగా మార్పులు చేసి నూతన చట్ట నిబంధనలకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఆమోదం తెలియజేయాలని సూచిస్తూ 2023 జనవరి 5న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ముసాయిదా ప్రతులు పంపింది.
జాతీయ స్థాయిలో సహకార వ్యవస్థ సమాచార నిధి ఏర్పాటు చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సహకార సంఘాల రెజిస్ట్రార్ల సహకారంతో పంచాయతీ/గ్రామ స్థాయిలో పనిచేస్తున్న సహకార సంఘాల వివరాలు సేకరించడానికి చర్యలు చేపట్టింది. 2021 జనవరి నాటికి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల సమాచార నిధి ఏర్పాటయింది. మత్స్య/ పాడి సహకార సంఘాల సమగ్ర సమాచారం ఫిబ్రవరి నాటికి సిద్దమవుతుంది. ఈ వివరాల ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు లేని పంచాయతీ, గ్రామం వివరాలు తెలుస్తాయి. నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికి జాతీయ సహకార డేటాబేస్, ఆన్‌లైన్ సెంట్రల్ పోర్టల్ ద్వారా చర్యలు అమలు చేస్తారు.
PACS / పాడి పరిశ్రమ / మత్స్య సహకార సంఘాలు వాటి సంబంధిత జిల్లా మరియు రాష్ట్ర స్థాయి సమాఖ్యలతో అనుసంధానించబడతాయి. 'హోల్-ఆఫ్-గవర్నమెంట్' విధానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, ఈ సొసైటీలు పాల పరీక్షా ప్రయోగశాలలు, బల్క్ మిల్క్ కూలర్లు, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, బయోఫ్లోక్ చెరువుల నిర్మాణం, చేపల కియోస్క్‌లు,హేచరీల అభివృద్ధి, లోతైన సముద్రపు చేపలు పట్టే నౌకలను కొనుగోలు చేయడం వంటి వాటి కార్యకలాపాలను విస్తరించడానికి అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటాయి.
దేశంలో పనిచేస్తున్న 98,995 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో 13 కోట్ల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. సభ్య రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ మొదలైన సేవలు అందిస్తున్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు సభ్యులకు స్వల్పకాలిక , మధ్యకాలిక రుణాలు అందిస్తూ సహకార రుణ సౌకర్యం అందిస్తున్నాయి. 352 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు,, 34 రాష్ట్ర సహకార బ్యాంకులు (StCBలు) ద్వారా రీ ఫైనాన్స్ సౌకర్యం అందిస్తోంది.
దాదాపు 1,99,182 మంది సభ్యులను కలిగి ఉన్న ప్రాథమిక పాడి పరిశ్రమ సహకార సంఘాలు రైతుల నుంచి పాల సేకరణ, పాల పరీక్షా సౌకర్యాలు, పశువుల దాణా విక్రయం, పొడిగింపు సేవలు మొదలైన సేవలు అందిస్తున్నాయి.
దాదాపు 38 లక్షల మంది సభ్యులను కలిగి ఉన్న 25,297 ప్రాథమిక మత్స్యకార సహకార సంఘాలు పనిచేస్తున్నాయి.సమాజంలో అత్యంత అట్టడుగు స్థాయి కి చెందిన వారికి మార్కెటింగ్ సౌకర్యాలు, చేపలు పట్టే పరికరాలు, చేపల విత్తనాలు, దాణా సేకరణలో సహకారం అందిస్తున్న ప్రాథమిక మత్స్యకార సహకార సంఘాలు పరిమిత స్థాయిలో రుణ సదుపాయాలు కూడా అందజేస్తున్నాయి.
అయితే, ఇప్పటికీ దేశంలో 1.6 లక్షల పంచాయతీల్లో పీఏసీఎస్‌లు ఏర్పాటు కాలేదు. , దాదాపు 2 లక్షల పంచాయతీల్లో పాల సహకార సంఘం ఏర్పాటు కాలేదు. . దేశంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో ఈ ప్రాథమిక స్థాయి సహకార సంఘాలు పోషించే ముఖ్యమైన పాత్రను దృష్టిలో ఉంచుకుని దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, అట్టడుగు స్థాయి వరకు సహకార సంఘాలను ఏర్పాటు చేసి అన్ని పంచాయితీలు/గ్రామాలు సహకార వ్యవస్థ ప్రయోజనం పొందేలా చూసేందుకు సంఘటిత కృషి అవసరం ఉంటుంది.