మధ్యాదాయ వర్గాల ఇళ్లు, తక్కువ ధరల తో కూడిన గృహాల నిర్మాణ రంగం లో నిలిచిపోయిన పనుల పూర్తి కి ప్రాధాన్యం తో రుణ సహాయం కింద నిధుల మంజూరు కోసం స్పెశల్ విండో ను ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఈ నిధి కి సంబంధించి ప్రభుత్వం పోషక సంస్థ గా వ్యవహరిస్తూ, 10,000 కోట్ల రూపాయల మేర నిధులు సమకూర్చే బాధ్యత ను స్వీకరిస్తుంది. ‘సెక్యూరిటీస్ ఎండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (సెబి) వద్ద ‘కేటగిరి-11 ఎఐఎఫ్’ (ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి) రుణ నిధి గా నమోదు అయ్యే ఈ నిధి వ్యవహారాలు వృత్తిపరమైన నిబద్ధత తో నడపబడుతాయి.
ఈ మేరకు ప్రత్యేక గవాక్షం కింద తొలి ‘ఎఐఎఫ్’ ఏర్పాటు లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లోని ‘ఎస్ బిఐ క్యాప్ వెంచర్స్ లిమిటెడ్’ ‘పెట్టుబడి నిర్వహణ సంస్థ’గా వ్యవహరించేలా ప్రతిపాదించబడింది. వాయిదా వేసిన గృహ నిర్మాణ పథకాల ను పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం ద్వారా నిధుల కోసం అన్వేషిస్తున్న నిర్మాణదారుల కు ఈ సంస్థ ఊరట కల్పిస్తుంది. ఆ మేరకు వారు త్వరగా ఇళ్ల ను నిర్మించి కొనుగోలుదారుల కు స్వాధీనం చేసేందుకు వీలు చిక్కుతుంది. స్థిరాస్తి రంగం అనేక ఇతర పరిశ్రమల తో అంతర్గతం గా ముడిపడి ఉంది. కాబట్టి ఈ రంగం లో నమోదు అయ్యే వృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థ లోని ఇతర ప్రధాన రంగాల పైన సానుకూల ప్రభావాన్ని చూపుతూ, వాటి పై ఒత్తిడిని తగ్గిస్తుంది.
పూర్వరంగం:
మధ్యాదాయ వర్గాల ఇళ్లు, అందుబాటు ధరల తో కూడిన గృహ నిర్మాణం కోసం స్పెశల్ విండో ను ఏర్పాటు చేస్తామని మాన్య ఆర్థిక శాఖ మంత్రి 2019వ సంవత్సరం సెప్టెంబరు 14వ తేదీ న ప్రకటించారు. ప్రస్తుతం నిధుల ఒత్తిడి లో గల ఈ గృహ నిర్మాణ పథకాల పూర్తి కి అవసరమైన తుది దశ నిధుల ను ఈ ప్రత్యేక గవాక్షం సమకూరుస్తుంది. తదనుగుణం గా గృహ నిర్మాణ రంగ భాగస్వాముల తో అంతర మంత్రిత్వ కమిటీ లు, పలు ఇతర భాగస్వామ్య సంస్థ లు సంప్రదింపులు సాగించాయి. ఈ సంప్రదింపుల లో గృహ నిర్మాణ ఆర్థిక సహాయ సంస్థలు, బ్యాంకు లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ లు, పెట్టుబడిదారులు, స్థిరాస్తి రంగ సంస్థ లు పాల్గొన్నాయి. ఈ సందర్భం గా కొనుగోలుదారులు, నిర్మాణదారులు, రుణదాత లు, పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రత్యేక గవాక్షం ద్వారా పరిష్కారం కాగలవన్న ఏకాభిప్రాయం వ్యక్తమైంది.