ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా జంతలూరు గ్రామం లో “సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్” పేరుతో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఈ విశ్వవిద్యాలయం స్థాపన లో తొలి దశ వ్యయాన్ని భరించేందుకు 450 కోట్ల రూపాయల నిధులను అందించాలని నిర్ణయించారు.
సెంట్రల్ యూనివర్సిటీ కార్యకలాపాలను తాత్కాలిక క్యాంపస్ నుండి ఆరంభింపచేయాలనే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఇందుకోసం సి, చట్టబద్ధ హోదా ను కల్పిస్తారు. ది సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్, 2009 కు సవరణను తీసుకు వచ్చే వరకు తాత్కాలిక కేంపస్ కు చట్టబద్ధ హోదా ను కల్పించేందుకు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1860 లో భాగంగా తొలుత ఒక సొసైటీ ని ఏర్పాటు చేస్తారు. విద్యా సంబంధ కార్యకలాపాలను 2018-19 విద్యా సంవత్సరం నుండి మొదలుపెట్టేందుకు వీలుగా ఈ మేరకు సొసైటీని ఏర్పాటు చేస్తారు. నూతన విశ్వవిద్యాలయ పాలక వ్యవస్థ ఏర్పడేటంత వరకు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఇప్పటికే పనిచేస్తున్న ఒక సెంట్రల్ యూనివర్సిటీ మార్గదర్శకత్వాన్ని వహిస్తుంది.
ఈ ఆమోదం విద్యా సంబంధ సదుపాయాలలో ప్రాంతీయ అసమానతలను తగ్గించడంతో పాటు ఉన్నత విద్య యొక్క నాణ్యతను మరియు ఉన్నత విద్య యొక్క లభ్యతను పెంపొందించడంలో తోడ్పడనుంది; అలాగే, ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 అమలు కు కూడా వీలు కల్పించనుంది.