ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులో భాగంగా నాలుగోదశకు చెందిన 26.463 కిలోమీటర్ల రిథాలా - నరేలా - నాథూపూర్ (కుండ్లి) కారిడార్‌కు ఆమోదం తెలిపింది. ఇది దేశ రాజధాని, పొరుగున ఉన్న హర్యానా మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మంజూరు చేసిన తేదీ నుంచి 4 సంవత్సరాలలో ఈ కారిడార్‌ను పూర్తి చేయాలని నిర్ణయించారు.
ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.6,230 కోట్లు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ ప్రభుత్వం 50:50 నిష్పత్తితో ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ అయిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీఎంఆర్సీ) నాలుగేళ్లలో దీనిని అమలు చేయాల్సి ఉంది.
ఈ లైన్ ప్రస్తుతమున్న షహీద్ స్థల్ (కొత్త బస్ అడ్డా) - రిథాలా (రెడ్ లైన్) కారిడార్‌కు పొడిగింపుగా ఉంటుంది. దేశ రాజధానిలోని వాయువ్య ప్రాంతాలైన నరేలా, బవానా, రోహిణి తదితర ప్రాంతాల్లో అనుసంధానతను పెంచుతుంది. ఈ మొత్తం విస్తరణలో 21 స్టేషన్లుంటాయి. ఈ కారిడార్ లోని అన్ని స్టేషన్లూ ఎత్తులో ఉంటాయి.
రిథాలా - నరేలా - నాథుపూర్ కారిడార్ పూర్తయిన తర్వాత.. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని షహీద్ స్థల్ కొత్త బస్ అడ్డా స్టేషన్‌ను ఢిల్లీ మీదుగా హర్యానాలోని నాథుపూర్‌తో కూడా కలుపుతుంది. ఇది మొత్తం జాతీయ రాజధాని ప్రాంతంలో అనుసంధానతను అద్భుతంగా పెంచుతుంది.
నాలుగో దశ ప్రాజెక్టుకు చెందిన ఈ కొత్త కారిడార్ ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్ పరిధిని విస్తరిస్తుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. ఈ రెడ్ లైన్ పొడిగింపు రోడ్లపై రద్దీని తగ్గిస్తుంది. తద్వారా మోటారు వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ మొత్తం విస్తరణలో 21 స్టేషన్లుంటాయి. కారిడార్ లోని అన్ని స్టేషన్లూ ఎత్తులో ఉంటాయి. ఈ కారిడార్‌లో వచ్చే స్టేషన్‌లు: రిథాల, రోహినీ సెక్టార్ 25, రోహినీ సెక్టార్ 26, రోహినీ సెక్టార్ 31, రోహినీ సెక్టార్ 32, రోహినీ సెక్టార్ 36, బర్వాలా, రోహినీ సెక్టార్ 35, రోహినీ సెక్టార్ 34, బర్వాలా పారిశ్రామిక ప్రాంతం - 1 సెక్టార్ 3,4, బర్వానా పారిశ్రామిక ప్రాంతం - 1 సెక్టార్ 1,2, బర్వానా జేజే కాలనీ, సానోత్, న్యూ సానోత్, డిపో స్టేషన్, భోర్ఘర్ గ్రామం, అనాజ్ మండీ నరేలా, నరేలా డీడీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్, నరేలా, నరేలా సెక్టార్ 5, కుండ్లి, నాథూపూర్.
ఢిల్లీ మెట్రోకు సంబంధించి ఈ కారిడార్ హర్యానాలోకి నాలుగో పొడిగింపు అవుతుంది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో హర్యానాలోని గురుగ్రామ్, బల్లభ్‌గఢ్, బహదూర్‌ఘర్ వరకు నడుస్తుంది.
65.202 కి.మీ., 45 స్టేషన్లతో నాలుగో దశ నిర్మాణం (3 ప్రాధాన్య కారిడార్లు) జరుగుతోంది. నేటి వరకు 56% కన్నా ఎక్కువ నిర్మాణం పూర్తయింది. నాలుగో దశ (3 ప్రాధాన్య) కారిడార్లు 2026 మార్చి నాటికి దశలవారీగా పూర్తయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు 20.762 కిలోమీటర్ల మేర మరో రెండు కారిడార్‌లు కూడా ఆమోదం పొంది.. టెండరుకు ముందు దశలో ఉన్నాయి.
నేడు ఢిల్లీ మెట్రో ద్వారా సగటున 64 లక్షల ప్రయాణీకులు సేవలు పొందుతున్నారు. నవంబరు 18న నమోదైన ప్రయాణీకుల సంఖ్య 78.67 లక్షలు ఇప్పటివరకు గరిష్టం. ఎమ్మార్టీఎస్ ప్రధాన ప్రమాణాలను.. అంటే సమయపాలన, విశ్వసనీయత, భద్రతలను ఉన్నతంగా తీర్చిదిద్దడం ద్వారా, ఢిల్లీ మెట్రో నగరానికి జీవనాధారంగా మారింది.
392 కిలోమీటర్లలో 288 స్టేషన్లతో మొత్తం 12 మెట్రో లైన్లు డీఎంఆర్సీ ద్వారా ఢిల్లీలో ప్రస్తుతం నడుస్తున్నాయి. నేడు, ఢిల్లీ మెట్రోకు దేశంలో అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఉంది; ప్రపంచంలోని అతిపెద్ద మెట్రోలలో ఒకటిగా కూడా ఉంది.
देशभर में कनेक्टिविटी को बेहतर बनाने के लिए हम संकल्पबद्ध हैं। इसी दिशा में हमारी सरकार ने राष्ट्रीय राजधानी क्षेत्र में दिल्ली मेट्रो के चौथे चरण के तहत रिठाला-कुंडली कॉरिडोर को स्वीकृति दी है। इससे दिल्ली-हरियाणा के बीच आना-जाना और आसान होगा।https://t.co/tJoTOTUPTi
— Narendra Modi (@narendramodi) December 7, 2024