త్రిపుర లోని అగర్తలా విమానాశ్రయం పేరు ను మార్చివేసి ‘‘మహారాజా బీర్ బిక్రమ్ మాణిక్య కిశోర్ విమానాశ్రయం, అగర్తలా’’ అనే పేరును పెట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకోవాలంటూ త్రిపుర ప్రజలు చాలా కాలంగా కోరుతూవస్తున్నారు. అంతే కాక మహారాజా బీర్ బిక్రమ్ మాణిక్య కిశోర్ కు త్రిపుర ప్రభుత్వం ద్వారా నివాళి ని అర్పించడం కోసం కూడా ఈ నిర్ణయం తీసుకోవడమైంది.
పూర్వరంగం
ఇదివరకటి త్రిపుర రాజ్య సింహాసనాన్ని 1923వ సంవత్సరంలో అధిష్టించిన మహారాజా బీర్ బిక్రమ్ మాణిక్య కిశోర్ ఒక విద్వాంసుడే కాక పరాక్రమశీలి అయిన పరిపాలకుని గా కూడా పేరు పొందారు. మహారాజా బీర్ బిక్రమ్ మాణిక్య కిశోర్ దానంగా ఇచ్చినటువంటి భూమి లో 1942 లో అగర్తలా విమానాశ్రయాన్ని నిర్మించడమైంది. ప్రపంచం అంతటా విస్తృతంగా ప్రయాణించిన, ఒక దార్శనికత కలిగిన పాలకునిగా ఆయన త్రిపుర యొక్క సర్వతోముఖాభివృద్ధికి గాను అనేక చర్యలను తీసుకొన్నారు. ఆయన తీసుకొన్న చొరవ తో అగర్తలా లో ఒక విమానాశ్రయాన్ని నిర్మించడం జరిగింది. ఈ విమానాశ్రయం ఈశాన్య ప్రాంతంలో ప్రస్తుతం రెండో అత్యంత రద్దీతో కూడినటువంటి విమానాశ్రయం గా ఎదిగింది. ఈ విమానాశ్రయం త్రిపుర కు కీలక గగనతల సంధానాన్ని సమకూరుస్తోంది. ఈ కారణంగా అగర్తలా విమానాశ్రయానికి ఆయన పేరును పెట్టడం తగినదిగా ఉండడంతో పాటు మహారాజా బీర్ బిక్రమ్ మాణిక్య కిశోర్ పట్ల సముచితమైన నివాళి కూడా అవుతుంది.