రైల్వే మంత్రిత్వ శాఖ దాదాపు రూ.18,036 కోట్ల ఖర్చుతో నిర్మించాలని ప్రతిపాదించిన ఒక కొత్త రైలు మార్గం ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదాన్ని తెలిపింది. ఇండోర్ కు, మన్మాడ్ కు మధ్య ప్రతిపాదించిన ఈ కొత్త రైలు మార్గం ప్రత్యక్ష సంధాన సదుపాయాన్ని కల్పించడంతోపాటు, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. వీటితోపాటు భారతీయ రైల్వేల సామర్థ్యాన్ని వృద్ధి చేస్తుంది. అలాగే, సేవల పరంగా రైల్వేల విశ్వాసనీయతను పెంచనున్నది. నవ భారతాన్ని ఆవిష్కరించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు ఆయా ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడం ద్వారా అక్కడి ప్రజలను ఆత్మనిర్భర్ వైపు నడుపుతుంది. దీనితో వారికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు/స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
బహుళయుత అనుసంధానానికి ఉద్దేశించిన ‘పిఎమ్-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ అమలు ఫలితమే ఈ ప్రాజెక్టు. ప్రజలతో పాటు వస్తు రవాణా నిరంతరాయంగా కొనసాగేందుకు ఏకీకృత ప్రణాళికలను అమలు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలోని ఆరు జిల్లాల మీదుగా వెళుతుంది. కొత్త రైలు మార్గం వల్ల భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్ వర్క్ సుమారు 309 కిలో మీటర్ల మేరకు పెరుగుతుంది.
ఈ ప్రాజెక్టు వల్ల కొత్తగా 30 స్టేషన్లు వస్తాయి. ఫలితంగా, ఆకాంక్ష జిల్లా అయిన బడ్ వానీకి రైలు మార్గం అందివస్తుంది. కొత్త రైలు లైను ప్రాజెక్టు సుమారుగా ఒక వేయి గ్రామాలకు, దాదాపు 30 లక్షల మంది జనాభాకు రైలు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుంది.
దేశంలో పశ్చిమ/నైరుతి ప్రాంతం నుంచి మధ్య భారత ప్రాంతానికి మధ్య దూరాన్ని తగ్గించడం వల్ల ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఇది శ్రీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయం సహా ఉజ్జయిని-ఇండోర్ ప్రాంతాలలోని వేరు వేరు పర్యాటక/ ధార్మిక క్షేత్రాలను సందర్శించే యాత్రికుల సంఖ్యను పెంచనుంది.
ఈ ప్రాజెక్టు జెఎన్‌పిఎ, ఇతర రాష్ట్రాల ఓడరేవుల నుండి పితంపూర్ ఆటో క్లస్టర్ కు నేరుగా సంధానాన్ని అందించనుంది (పితంపూర్ ఆటో క్లస్టర్ లో 90 పెద్ద యూనిట్లతో పాటు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 700 వరకు ఉన్నాయి). ఈ ప్రాజెక్టు మధ్య ప్రదేశ్ లో సిరిధాన్యాలను పండించే జిల్లాలకు, మహారాష్ట్రలో ఉల్లిగడ్డలను పండించే జిల్లాలకు మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని సమకూర్చనుంది. ఫలితంగా ఆయా ఫలసాయాలను దేశంలో ఉత్తరాది ప్రాంతాలకు, దక్షిణాది ప్రాంతాలకు పంపిణీ చేయడానికి మార్గం మరింత సుగమం కానుంది.
వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, కంటైనర్లు, ఇనుప ముడి ఖనిజం, ఉక్కు, సిమెంటు, పిఒఎల్ వంటి సరుకుల రవాణాకు ఇది ఒక ముఖ్య మార్గం. సామర్థ్యం పెంపుదల పనుల వల్ల దాదాపు ఏటా 26 మిలియన్ టన్నుల మేర అదనంగా సరకు రవాణా చేయడానికి ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది. రైల్వేలు పర్యావరణపరంగా మిత్రపూర్వకమైన, శక్తిని ఆదా చేసే తరహా రవాణా మాధ్యం కావడం వల్ల దేశంలో లాజిస్టిక్స్ సంబంధిత వ్యయాన్ని కనీస స్థాయికి తగ్గించుకోవడంతో పాటు వాతావరణ సంబంధిత లక్ష్యాల సాధనలో రైల్వే సహాయకారి కానుంది. దీనికి తోడు, రైల్వేలు చమురు దిగుమతిని 18 కోట్ల లీటర్ల మేరకు తగ్గించడంలో, కార్బన్ డయాక్సైడ్ (CO2 ) ఉద్గారాలను కుదించడంలో దోహదం చేయనుంది. 138 కోట్ల కిలో గ్రాముల మేరకు కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలు తగ్గడమంటే అది 5.5 కోట్ల మొక్కలను పెంచడంతో సమానం అని అన్వయం చెప్పుకోవచ్చు.
Today's Cabinet decision will improve connectivity between Mumbai and Indore. In addition to boosting commerce, it will also provide employment opportunities to several people. https://t.co/k4qUjCtcpY
— Narendra Modi (@narendramodi) September 2, 2024