ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ 2018-2021 సంవత్సరాల మధ్యన నాలుగు సంవత్సరాల కాలంలో ఆఫ్రికాలో 18 కొత్త దౌత్య కార్యాలయాలు ప్రారంభించేందుకు ఆమోదముద్ర వేసింది.
ఈ 18 కొత్త దౌత్య కార్యాలయాలు బుర్కినా ఫాసో, కామెరూన్, కేప్ వెర్దే, చాద్, కాంగో రిపబ్లిక్, జిబౌతి, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, గినియా, గినియా బిసావు, లైబీరియా, మారిటానియా, రువాండా, సవో టోమ్ మరియు ప్రిన్సిప్, సియెరా లియోన్, సోమాలియా, స్వాజిలాండ్, టోగోలలో 2018-2021 సంవత్సరాల మధ్యన ప్రారంభిస్తారు. దీంతో ఆఫ్రికాలో భారత దౌత్య కార్యాలయాల సంఖ్య 29 నుంచి 47కి పెరుగుతుంది.
ఈ నిర్ణయం వల్ల ఆఫ్రికా ఖండంలో భారత దౌత్య కార్యకలాపాలు పెరిగి ఆయా దేశాల్లోని భారతీయ సంతతి ప్రజలతో నిరంతర అనుసంధానం కలిగి ఉండేందుకు వీలు కలుగుతుంది. ఆఫ్రికాతో మరింత విస్తృత సహకారం కలిగి ఉండాలన్న భారత్ ఆకాంక్ష ఆచరణీయం చేయడంలో ఇదొక ముందడుగు అవుతుంది.