ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన 2017 మార్చి నెల 17వ తేదీ నాడు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం జాతీయ ఆరోగ్య విధానం-2017 (ఎన్ హెచ్ పి-2017)కు ఆమోదం తెలిపింది. సమగ్రమైన పద్ధతిలో అందరికీ ఆరోగ్య సేవలు అందించే దిశగా ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది. అందుబాటు ధరలలో అందరికీ ఆరోగ్య సేవలు అందేలా, అందులోనూ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు లభించేలా చూడడమే ఈ విధానం లక్ష్యం.
ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య సంస్థలను వ్యూహాత్మక భాగస్వాములుగా కలుపుకొనివెళ్తూ ఆరోగ్య రంగంలోని సమస్యలను సమగ్రమైన రీతిలో పరిష్కరించుకోవడానికి ఈ విధానం ప్రాధాన్యమిస్తుంది. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను కల్పించడం జరుగుతుంది. కొత్త కొత్త సవాళ్లను విసురుతున్న రోగాలను ఎదుర్కోవడం పైన శ్రద్ధ తీసుకొంటారు. ఆరోగ్య రక్షణను ప్రోత్సహించడానికి, ముందు జాగ్రత్త చర్యలను చేపట్టడంపైనే కాకుండా, ఈ రంగంలో పెట్టుబడుల పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది.
వీలయినంత స్థాయి వరకు సరైన మెరుగైన ఆరోగ్యాన్ని సాధించడమే జాతీయ ఆరోగ్య విధానం-2017 ప్రధాన లక్ష్యం. అన్ని అభివృద్ధి విధానాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారాను, ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడం ద్వారాను ఈ లక్ష్యాన్ని అందుకోవడం జరుగుతుంది. అంతే కాదు, అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు.. వారికి ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు కలగకుండా అందించడమే ఇందులో ముఖ్యమైన అంశం.
ఆరోగ్య సంరక్షణ రంగం లోని ద్వితీయ, తృతీయ స్థాయిలలో సేవలను అందించడానికి, ఆర్థిక పరమైన అండ అందించడానికిగాను ఉచితంగా మందులు, రోగ నిర్ణయకారి సేవలు, అత్యవసర ఆరోగ్య సేవలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అందించడం జరుగుతుంది.
ఆరోగ్య వ్యవస్థలో ఏర్పడిన ముఖ్యమైన అంతరాలను తొలగించడానికిగాను తక్కువ కాలపరిమితిలో ద్వితీయ, తృతీయ దశలలో అందించే ఆరోగ్య సేవలను వ్యూహాత్మకంగా కొనుగోలు చేయాలని జాతీయ ఆరోగ్య విధానంలో నిర్ణయించడమైంది.
ఆరోగ్య రంగంలోని వ్యవస్థలను అన్ని కోణాలలోను రూపొందించడంలో ప్రభుత్వ పాత్రకు ప్రాధాన్యమిచ్చేలా ఈ విధానం ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వం చేయబోయే వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధానం అమలుకు కావలసిన మార్గసూచీని రూపొందించారు. సమగ్రమైన, అందరినీ కలుపుకుపోగలిగే ప్రజా ఆరోగ్య భద్రత వ్యవస్థను అందించాలనే లక్ష్యంతో కూడా ఈ మార్గసూచీని సిద్ధం చేశారు.
జాతీయ స్థాయిలో లక్ష్యాలను అందుకోవడానికిగాను కీలకమైన అంతరాలను తొలగించడానికి వీలుగా ప్రైవేటు రంగంతో సకారాత్మకమైన, ముందస్తు చురుకుదనం గల భాగస్యామ్యాన్ని కోరుకుంటూ ఎన్ హెచ్ పి-2017ను తీర్చిదిద్దారు. వ్యూహాత్మకంగా సేవలను పొందడం కోసం, సామర్థ్య పెంపుదల కోసం, నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాల కోసం, చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాల కోసం, మానసిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయడం కోసం, విపత్తుల నిర్వహణలో పౌరులతో సుస్థిరమైన నెట్ వర్కులను అభివృద్ధి పరచుకోవడం కోసం ప్రైవేటు రంగ భాగస్వామ్యం ఉండాలని ఈ విధానం భావిస్తోంది. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికిగాను ఆర్ధిక పరమైన సహాయ చర్యలు ఉండాలని ఈ విధానంలో పేర్కొనడం జరిగింది.
ప్రజా ఆరోగ్యం కోసం జిడిపిలో 2.5 శాతం వ్యయాన్ని ఒక కాలపరిమితి లోగా పెంచకుంటూ పోవాలని ఈ విధానం ప్రతిపాదించింది. దేశంలోని ఆరోగ్య కేంద్రాల ద్వారా తప్పనిసరిగా సమగ్రమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను భారీ స్థాయిలో అందించాలని ఈ విధానం చెబుతోంది. ఎంపిక చేసిన సేవలకు కాకుండా సమగ్రమైన ప్రాథమిక ఆరోగ్య భద్రత ప్యాకేజీలను ఇచ్చేలా చూడాలని ఈ విధానం చెబుతోంది. వృద్ధుల ఆరోగ్య సేవలు, పాలియేటివ్ కేర్, పునరావాస సంబంధ రక్షణ సేవలు ఈ విధానంలో భాగంగా ఉన్నాయి. వనరులలో ప్రధాన భాగాన్ని(మూడింట రెండు వంతుల వరకు లేదా అంతకు మించి) ప్రాథమిక ఆరోగ్య సేవలకు మళ్లిస్తారు. ఆ తరువాత ద్వితీయ, తృతీయ సేవలకు ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుతం వైద్య విద్య కళాశాల ఆసుపత్రిలో లభిస్తున్న ద్వితీయ స్థాయి ఆరోగ్య సేవలను జిల్లా స్థాయిలో అందించాలని ఈ విధానం పేర్కొంటోంది.
వ్యాధులు సంభవించకుండా చూడడంలోను, వాటి నివారణలోను ప్రత్యేకమైన లక్ష్యాలను నిర్దేశించాలని ఈ విధానం చెబుతోంది. ఆరోగ్య స్థాయి, కార్యక్రమ ప్రభావం, ఆరోగ్య వ్యవస్థ పనితీరు, వ్యవస్థను బలోపేతం చేయడం మొదలైన అంశాలు మెరుగ్గా ఉండడానికి ఈ లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. ఈ విధానం ద్వారా 2020 నాటికి ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలని నిర్దేశించారు. ప్రజారోగ్య ప్రాధాన్యత ప్రకారం వ్యాధుల వివరాల రిజిస్ట్రీలను ఏర్పాటు చేసుకోవడం, పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించడం ఈ విధానంలోని అంశాలే. వైద్య పరికరాలు, ఇతర సామగ్రికి సంబంధించిన ఇతర విధానాలను ప్రజారోగ్య లక్ష్యాలతో ముడిపెట్టడం సైతం ఈ విధానంలో భాగంగా ఉంటుంది.
దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు అన్ని విధాలుగా రూపొందేలా ప్రభుత్వ పాత్రను రూపొందించడానికి, దానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడానికి, బలోపేతం చేయడానికి, ప్రజలకు చైతన్యం కలిగించడానికి వీలుగా స్పష్టత ఇవ్వడం తదితర అంశాలు జాతీయ ఆరోగ్య విధానం 2017 ప్రధాన ఉద్దేశంలో ఇమిడివున్నాయి. ఆరోగ్య రంగంలో పెట్టుబడులు, ఆరోగ్య సేవల నిర్వహణ, ఆర్థికపరమైన మద్దతు, అన్ని రంగాల కార్యాచరణతో వ్యాధులను నివారించి మెరుగైన ఆరోగ్యాన్ని సాధించడం, సాంకేతిక వ్యవస్థలను అందుబాటులోకి తేవడం, మానవ వనరులను అభివృద్ధి చేయడం, ఆరోగ్య రంగంలో బహుళ విధానాలను ప్రోత్సహించడం, మెరుగైన ఆరోగ్యం కోసం అవసరమై విజ్ఞాన పునాదులను నిర్మించడం, ఆర్థికపరమైన రక్షణ వ్యూహాలను తయారు చేసుకోవడం, ఆరోగ్యానికి అవసరమయ్యేలా నియంత్రణలతో పాటు, ప్రగతిశీల భరోసాను సాధించడం ఈ విధానంలో ముఖ్యమైన అంశాలు.
ఈ విధానంలోని ప్రధానమైన నియమ నిబంధనలు పలు అంశాలపైన ఆధారపడి ఉన్నాయి. ఆ అంశాలు ఏమిటంటే.. వృత్తిపరమైన నిబద్దత, నిజాయితీ, నైతిక విలువలు, సమానత్వం, ఆరోగ్య సంరక్షణ సేవలు తక్కువ ఖర్చులో అందుబాటులోకి తేవడం, సార్వజనీనత, రోగిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన రక్షణను అతడికి/ఆమెకు అందించడం, బాధ్యతాయుత ధోరణితో పాటు బహుళత్వానికి ప్రాధాన్యమివ్వడమూను.
ఈ విధానం ద్వారా నాణ్యమైన, మెరుగైన, అందరికీ అందుబాటులో వుండే ద్వితీయ, తృతీయ ఆరోగ్య రక్షణ సేవల్ని పలు పద్ధతులద్వారా అందివ్వడం జరుగుతుంది. ప్రజారోగ్య ఆసుపత్రులు, గుర్తింపు పొందిన ఆరోగ్యరంగ స్వచ్ఛంద సేవాసంస్థల సాయంతో ఆరోగ్య భద్రత లోపించిన ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా సేవలను పొందడం, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఖర్చులను గణనీయంగా తగ్గించగలగడం, ప్రజారోగ్య వ్యవస్థపైన నమ్మకం కలిగించడం, ప్రైవేటు రంగంలోని ఆరోగ్య వ్యవస్థలను అభివృద్ధి చేయడం, వైద్య రంగ సాంకేతికతలను ప్రజారోగ్య లక్ష్యాలకు అనుగుణంగా మలుచుకోవడం మొదలైన పద్ధతుల ద్వారా ఈ రెండు స్థాయిల్లో ఆరోగ్య సంరక్షణ సేవలను పొందగలం.
రోగాలు వచ్చిన తరువాత ఖర్చులు పెట్టడం కంటే అవి రాక ముందే నివారణ చర్యలు చేపట్టడానికి ఈ విధానం ప్రాధాన్యమిస్తోంది. తద్వారా చిన్నారుల ఆరోగ్యంతో పాటు, యువత ఆరోగ్యాన్ని గరిష్ఠ స్థాయిలో కాపాడుకోగలం. పాఠశాల స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలపైన ఈ విధానం ప్రధానంగా దృష్టి సారిస్తున్నది. అంతే కాకుండా ఆరోగ్యం, పారిశుధ్య అంశాలను పాఠ్య ప్రణాళికలో భాగం చేయడం జరుగుతుంది.
దేశంలో ప్రాచుర్యంలో వున్న బహుళ ఆరోగ్య రక్షణ వారసత్వాన్నుండి లబ్ధిని పొందడానికి వీలుగా వివిధ ఆరోగ్య వ్యవస్థలను జన జీవన స్రవంతిలోకి తీసుకురావాలని ఈ విధానం ప్రతిపాదిస్తోంది. ‘ఆయుష్’ కు ఉన్న సమర్థతను జన జీవన స్రవంతిలోకి తీసుకురావాలి.. అందుకుగాను జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం ‘ఆయుష్’ చికిత్స విధానాలను ప్రజా సౌకర్యాలకు అనుగుణంగా స్థానికంగా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించడంలో భాగంగా పాఠశాలల్లోను, ఆఫీసుల్లోను మరింత విస్తారంగా యోగాను పరిచయం చేయడం జరుగుతుంది.
సమాజానికి తిరిగి ఇవ్వాలనే కార్యక్రమం కింద గుర్తింపు పొందిన ఆరోగ్యసంరక్షణ వృత్తి నిపుణుల సాయంతో గ్రామీణ ప్రాంతాలలోను, ఆరోగ్య సేవలు తక్కువగా గల ప్రాంతాలలోను స్వచ్ఛందంగా సేవలను అందిచడానికి ఈ విధానం మద్దతు పలుకుతోంది.
ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సక్రమంగా పని చేసి సరైన ఫలితాలను ఇవ్వడానికి వీలుగా, సమర్థతను మెరుగుపరచడానికి వీలుగా డిజిటల్ పరికరాలను విస్తారంగా అందుబాటులోకి తీసుకురావాలని ఈ విధానం పేర్కొంటున్నది. ఇందుకుగాను నేషనల్ డిజిటల్ హెల్త్ అథారిటీ (ఎన్ డిహెచ్ఎ)ను ఏర్పాటు చేయాలంటోంది. తద్వారా అన్ని ప్రాంతాలలో ఆరోగ్య రంగంలో డిజిటల్ సేవలను విస్తరించి అభివృద్ది పరచడమే కాకుండా వాటిని నియంత్రించడం కూడా చేయవచ్చు.
ప్రగతి సాధనతో, ప్రోత్సాహకాలతో కూడిన భరోసాను ఇవ్వడంపైన ఆధారపడే విధంగా ఆరోగ్య రక్షణ పరిధిని నిరంతర రీతిలో విస్తరించాలని ఈ విధానం కోరుకుంటోంది.
పూర్వ రంగం
వైద్య ఆరోగ్య రంగంలోని భాగస్వాములందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని జాతీయ ఆరోగ్య విధానం- 2017 ను రూపొందించారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ ఆరోగ్య విధాన ముసాయిదాను తయారు చేసింది. ఆ తర్వాత దానిని 2014 డిసెంబర్ 30న పబ్లిక్ డొమేన్ లో ఉంచింది. అందరి అభిప్రాయాలను సేకరించింది. ఆ తరువాత ఈ రంగంలోని భాగస్వాములందరితో చర్చలు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన అనంతరం వాటి సూచనలు, సలహాల మేరకు జాతీయ ఆరోగ్య విధాన ముసాయిదాను తీర్చిదిద్దడం జరిగింది. ఈ ముసాయిదాకు 2016 ఫిబ్రవరి 27నాడు జరిగిన పన్నెండో ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మండలి సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మండలికి ఈ రంగంలో విధాన నిర్ణాయక అత్యున్నత సంస్థగా పేరుంది.
మన దేశంలో చివరి జాతీయ ఆరోగ్య విధానాన్ని 2002లో తయారు చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి సామాజిక, ఆర్ధిక, ఆరోగ్య రంగంలో ముఖ్యంగా అంటువ్యాధుల పరంగా వచ్చిన మార్పుల కారణంగా ఒక కొత్త జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించుకోవలసిన అవసరం ఏర్పడింది. అటువంటి ఒక కొత్త జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించుకున్నప్పుడే వర్తమానంలోని పలు సవాళ్ళను ఎదుర్కోవడం సాధ్యపడుతుంది.