ఈరోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 12461 కోట్ల వ్యయంతో జల విద్యుత్ ప్రాజెక్టు (హెచ్ఈపీ)లలో మౌలిక వసతుల కోసం ఆర్థిక సహాయ పథకాన్ని సవరించాలనే విద్యుత్ శాఖ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం 2024-25 ఆర్థిక సంవత్సరం నుండి 2031-32 వరకు అమలుకానుంది.
జల విద్యుత్ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, మౌలిక వసతుల లేమి వంటి సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వం అనేక విధానపరమైన కార్యక్రమాలను చేపడుతున్నది. జల విద్యుత్ రంగాన్ని ప్రోత్సహించి దానిని మరింత విస్తృతపరచడానికి 2019 మార్చిలో మంత్రివర్గం పలు చర్యలను ఆమోదించింది. భారీ జల విద్యుత్ ప్రాజెక్టులను పునరుత్పాదక ఇంధన వనరులుగా ప్రకటించడం, జల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (హెచ్‌పీఓలు), టారిఫ్ పెంపు ద్వారా టారిఫ్ క్రమబద్దీకరణ చర్యలు, స్టోరేజ్ హెచ్ఈపీలలో వరద నియంత్రణకు, అలాగే రహదారులు, వంతెనల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం అందించడం వంటి చర్యలు వాటిలో భాగంగా ఉన్నాయి.
జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి అలాగే మారుమూల ప్రాంతాలలో మౌలిక వసతులను మెరుగుపర్చడానికి, మునుపటి పథకంలో కింది సవరణలు చేయబడినవి:
a) రహదారులు, వంతెనల నిర్మాణం కాకుండా మరో నాలుగు అంశాలను చేర్చడం ద్వారా మౌలిక వసతుల అబివృద్ధి వ్యయం కోసం ఆర్థిక సహాయ పరిమితిని పెంచడం,
ఆ నాలుగు అంశాలు: (i) రాష్ట్ర/కేంద్ర ట్రాన్స్‌మిషన్ సదుపాయం పూలింగ్ సబ్‌స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు పవర్ హౌస్ నుండి సమీప పూలింగ్ పాయింట్‌కి ట్రాన్స్‌మిషన్ లైన్ ఏర్పాటు (ii) రోప్‌వేలు (iii) అనుబంధ రైలు మార్గాలు, (iv) కమ్యూనికేషన్ సదుపాయాలు. అలాగే ఈ ప్రాజెక్టులకు వెళ్లే దారిలో ప్రస్తుత రహదారులు/వంతెనలు బాగు చేయడం ద్వారా ఈ పథకం కింద కేంద్ర సాయానికి కూడా అర్హత లభిస్తుంది.
b) 2024-25 ఆర్థిక సంవత్సరం నుండి 2031- 32 వరకు మొత్తం 31350 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం మొత్తం రూ.12,461 కోట్లు ఈ పథకం ద్వారా కేటాయించబడుతాయి.
c) పారదర్శకంగా కేటాయించబడిన ప్రైవేట్ రంగ ప్రాజెక్టులు సహా 25 మెగావాట్లకు మించి విద్యుత్ ఉత్పత్తి జరిగే జల విద్యుత్ ప్రాజెక్టులన్నింటికీ ఈ పథకం వర్తిస్తుంది. క్యాప్టివ్/మర్చంట్ పీఎస్‌పీలు సహా పారదర్శకంగా కేటాయించబడిన అన్ని పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు (పీఎస్‌పీ)లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. సుమారుగా, 15,000ల మెగావాట్ల మొత్తం సామర్థ్యం గల పీఎస్‌పీలకు ఈ పథకం ద్వారా సహాయం అందనుంది.
d) 30.06.2028 వరకు మొదటి ప్రధాన ప్యాకేజీ లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ చేయబడిన ప్రాజెక్ట్‌లు ఈ పథకం కిందకు వస్తాయి.
e) 200 మెగావాట్ల వరకు సామర్థ్యం గల ప్రాజెక్టుల మౌలిక వసతుల అబివృద్ధి వ్యయం కోసం ఆర్థిక సహాయ పరిమితిని ప్రతి మెగావాట్‌కు కోటి రూపాయలుగా క్రమబద్దీకరించారు. అలాగే 200 మెగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం గల ప్రాజెక్టుల కోసం ఆర్థిక సాయం పరిమితిని 200కోట్లకు అదనంగా ప్రతి మెగావాట్‌కు 0.75కోట్లుగా క్రమబద్దీకరించారు. ప్రత్యేక సందర్భాలలో పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆర్థిక సాయం పరిమితి ప్రతి మెగావాట్‌కు రూ.1.5 కోట్ల వరకు పెరగవచ్చు.
f) మౌలిక వసతుల అభివృద్ధికి అయ్యే ఖర్చును డీఐబీ/పీఐబీ అంచనా వేసిన తర్వాత, ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం కాంపిటెంట్ అథారిటీ ఆమోదం లభించిన వెంటనే, మౌలిక వసతుల అభివృద్ధి వ్యయం కోసం ఆర్థిక సాయం అందిస్తారు.
ప్రయోజనాలు:
సవరించిన ఈ పథకం కారణంగా జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి వేగవంతం అవుతుంది అలాగే మూరుమూల, కొండ ప్రాంతాలలో మౌలిక వసతులు మెరుగవుతాయి. వీటి ద్వారా అనేక మంది స్థానికులకు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. రవాణా, పర్యాటకం, చిన్న-తరహా వ్యాపారాల ద్వారా మరింత మందికి పరోక్షంగా ఉపాధి లభించడంతో పాటు వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. దీని ద్వారా జల విద్యుత్ రంగంలో తాజా పెట్టుబడులకు అలాగే కొత్త ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది.