ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్.. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్ వై) ఉప పథకంగా 2025-26 కాలానికి కమాండ్ ఏరియా డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ (ఎం-సీఏడీడబ్ల్యూఎం) ఆధునికీకరణకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ప్రాథమిక అంచనా వ్యయం రూ.1600 కోట్లు.
సాగునీటి సరఫరా వ్యవస్థను ఆధునికీకరించడం ద్వారా.. ప్రస్తుతమున్న కాల్వలు, ఇతర నీటి వనరుల నుంచి నిర్దేశిత ఆయకట్టు ప్రాంతానికి సాగునీటిని సరఫరా చేయడం ఈ పథకం లక్ష్యం. సూక్ష్మసేద్యం కోసం నీటి వనరుల నుంచి వ్యవసాయ క్షేత్రం దాకా.. భూగర్భ పీడనంతో కూడిన పైపు నీటి పారుదలతో ఒక హెక్టారు వరకు నీళ్లందించడం కోసం సహాయక మౌలిక సదుపాయ వ్యవస్థను ఇది బలోపేతం చేస్తుంది. వాటర్ అకౌంటింగ్, జల నిర్వహణ కోసం స్కాడా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీలను వినియోగిస్తారు. ఇది క్షేత్ర స్థాయిలో నీటి వినియోగ సామర్థ్యాన్నీ.. వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలనూ తద్వారా రైతుల ఆదాయాన్నీ పెంచుతుంది.
సాగునీటి సంఘాలకు ఇరిగేషన్ నిర్వహణను అప్పగించి వనరులను సక్రమంగా నిర్వహించడం ద్వారా ప్రాజెక్టులు దీర్ఘకాలం మనుగడ సాగించగలుగుతాయి. సాగునీటి వినియోగ సంఘాలను ప్రస్తుత ఎఫ్ పీవో లేదా పీఏసీఎస్ వంటి ఆర్థిక సంస్థలతో ఐదేళ్ల పాటు అనుసంధానించడం కోసం చేయూతనిస్తారు. యువత కూడా వ్యవసాయం వైపు ఆకర్షితమై ఆధునిక నీటిపారుదల విధానాలను అవలంబిస్తారు.
రాష్ట్రాలకు ఛాలెంజ్ ఫండింగ్ ద్వారా దేశంలోని వివిధ వ్యవసాయ వాతావరణ మండలాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణంలో గ్రహించిన అంశాల ఆధారంగా.. 16వ ఆర్థిక సంఘం కాలానికి 2026 ఏప్రిల్ నుంచి కమాండ్ ఏరియా డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ కోసం జాతీయ ప్రణాళికను ప్రారంభిస్తారు.
Union Cabinet has approved the Modernisation of Command Area Development & Water Management, which will modernise irrigation networks, boost micro-irrigation and encourage the use of latest technology. It will boost Water Use Efficiency, improve productivity, and also raise…
— Narendra Modi (@narendramodi) April 9, 2025