ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఇవాళ సమావేశమైంది. ఈ సందర్భంగా దేశంలో 2021-22 మార్కెటింగ్ సీజన్‌లో అధీకృత ఖరీఫ్ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఆయా పంటలు సాగుచేసిన రైతులకు దిగుబడిపై గిట్టుబాటు ధర లభ్యతపై భరోసా ఇస్తూ 2021-22 మార్కెటింగ్ సీజన్‌కుగాను ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ఈ మేరకు నిరుటితో పోలిస్తే ‘నువ్వు’ పంట మద్దతు ధర (క్వింటాలుకు రూ.452) అత్యధికంగా పెంచుతూ కమిటీ సిఫారసు చేసింది. అటుపైన ‘కంది, మినప’ పంటలకు అత్యధికంగా (క్వింటాలుకు రూ.300 వంతున) పెంచాలని సూచించింది. అలాగే నూనె గింజల్లో వేరుసెనగ, వెర్రి నువ్వులు (నైగర్ సీడ్)లపై క్వింటాలుకు రూ.275, రూ.235 వంతున పెరిగింది. పంటల సాగులో వైవిధ్యం దిశగా రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో కమిటీ ఈ సిఫారసులు చేసింది.
2021-22 మార్కెటింగ్ సీజన్‌లో అన్ని ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర కిందివిధంగా ఉంది:
పంట |
ఎంఎస్పీ 2020-21 |
ఎంఎస్పీ 2021-22 |
2021-22లో ఉత్పత్తి వ్యయం (క్వింటాలుకు/రూ) |
(మొత్తంమీద) ఎంఎస్పీ పెరుగుదల |
వ్యయంపై రాబడి (శాతంలో) |
వరి (సాధారణ) |
1868 |
1940 |
1293 |
72 |
50 |
వరి (గ్రేడ్-ఎ)^ఎ)ఎ |
1888 |
1960 |
- |
72 |
- |
జొన్న(హైబ్రిడ్) |
2620 |
2738 |
1825 |
118 |
50 |
జొన్న (మాల్దండి)^ |
2640 |
2758 |
- |
118 |
- |
సజ్జ |
2150 |
2250 |
1213 |
100 |
85 |
రాగి |
3295 |
3377 |
2251 |
82 |
50 |
మొక్కజొన్న |
1850 |
1870 |
1246 |
20 |
50 |
కంది |
6000 |
6300 |
3886 |
300 |
62 |
పెసర |
7196 |
7275 |
4850 |
79 |
50 |
మినప |
6000 |
6300 |
3816 |
300 |
65 |
వేరుసెనగ |
5275 |
5550 |
3699 |
275 |
50 |
పొద్దుతిరుగుడు |
5885 |
6015 |
4010 |
130 |
50 |
సోయాబీన్స్(పసుపు) |
3880 |
3950 |
2633 |
70 |
50 |
నువ్వులు |
6855 |
7307 |
4871 |
452 |
50 |
వెర్రినువ్వులు (నైగర్) |
6695 |
6930 |
4620 |
235 |
50 |
పత్తి (పొట్టి పింజ) |
5515 |
5726 |
3817 |
211 |
50 |
పత్తి (పొడుగు పింజ)^ |
5825 |
6025 |
- |
200 |
- |
* కూలీలు, దున్నకం, యంత్రాల వ్యయం, భూమి కౌలు, విత్తనాలు, ఎరువులు, సూక్ష్మ పోషకాలు, నీటి తీరువా, వ్యవసాయ ఉపకరణాలు, భవనాలపై తరుగుదల, నిర్వహణ మూలధనంపై వడ్డీ, పంపుసెట్ల కోసం డీజిల్/విద్యుత్ వినియోగంసహా ఇతరాలతోపాటు కుటుంబ శ్రమ కూడా ఇందులో అంతర్భాగంగా ఉంటాయి.
^వరి (ఎ-గ్రేడ్), జొన్నలు (మాల్దండి), పత్తి (పొడుగు పింజ) పంటలకు సంబంధించి వ్యయ సమాచారం ప్రత్యేకంగా క్రోడీకరించలేదు.
లోగడ 2018-19 కేంద్ర బడ్జెట్ సమర్పణ సమయంలో- దేశవ్యాప్త సగటు ఉత్పత్తి వ్యయం (సీఓపీ)తో పోలిస్తే ఒకటిన్నర రెట్లు అధికంగా కనీస మద్దతు ధర నిర్ణయిస్తామన్న ప్రకటనకు అనుగుణంగా, రైతుకు గిట్టుబాటు ధర లభ్యత లక్ష్యంగా ప్రభుత్వం నేడు 2021-22 మార్కెటింగ్ సీజన్ ఖరీఫ్ పంటల మద్దతు ధరలను పెంచింది. ఈ నేపథ్యంలో ‘సజ్జ’ పంటకు ఉత్పత్తి వ్యయంపై అత్యధికంగా (85 శాతం) ధర లభించనుందని అంచనా. అలాగే మినప (65 శాతం), కంది (62శాతం) పంటలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన పంటల విషయంలో ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతందాకా అధికంగా రైతుకు మద్దతు ధర లభించనుంది.
నూనె గింజలు, పప్పుదినుసులు, ముతక తృణధాన్యాల సాగుకు అనుకూలంగా కనీస మద్దతు ధరను సమన్వయం చేయడానికి కొన్నేళ్లుగా సంయుక్త కృషి సాగింది. ఇందులో భాగంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు, ఆధునిక పద్ధతులు అనుసరిస్తూ ఈ పంటలను మరింత ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా గిరాకీ-సరఫరాల మధ్య అసమతౌల్యాన్ని సరిదిద్దడానికి నడుం బిగించింది. భూగర్భ జలమట్టంపై దీర్ఘకాలిక ప్రతికూలత లేకుండా వరి-గోధుమ పండించలేని ప్రాంతాల్లో పోషకాలతో కూడిన, పోషక సమృద్ధ తృణధాన్యాలను సాగుచేయడాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వ మరింతగా దృష్టి సారించింది. దీంతోపాటు రైతులకు తమ ఉత్పత్తులపై గిట్టుబాటు ధర లభించడంలో వివిధ పథకాల సమాహారంగా ప్రభుత్వం 2018లో ప్రకటించిన ‘‘ప్రధానమంత్రి అన్నదాత ఆదాయం సంరక్షణ పథకం’’ (పీఎం-ఆషా) ఎంతగానో దోహదం చేస్తుంది. ఇందులో మూడు ప్రయోగాత్మక ఉప పథకాలు ‘మద్దతు ధర పథకం’, ‘ధర లోటు భర్తీ పథకం’, ప్రైవేటు కొనుగోళ్లు-నిల్వ పథకం’ అంతర్భాగంగా ఉన్నాయి.
దేశంలో పప్పుదినుసుల ఉత్పత్తిలో స్వావలంబన లక్ష్యంగా రాబోయే 2021 ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం తగు వ్యూహాన్ని రూపొందించింది. తదనుగుణంగా కంది, పెసర, మినప పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి.. రెండింటినీ విస్తృతంగా పెంచడానికి సమగ్ర ప్రణాళికను రచించింది. దీనికింద అంతరపంటగా, ఏకైక పంటగా సాగుద్వారా ఉత్పాదన పెంచడం కోసం అందుబాటులోగల అన్నిరకాల వంగడాల్లో అధిక దిగుబడినిచ్చే విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. అదేవిధంగా నూనెగింజల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ప్రణాళికను ఆమోదించింది. దీనికి అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే రకాల విత్తనాలను 2021 ఖరీఫ్ సీజన్లో రైతులకు ‘మినీకిట్’ రూపేణా ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఈ ఖరీఫ్ ప్రత్యేక కార్యక్రమం ద్వారా 6.37 లక్షల హెక్టార్ల మేర అదనపు భూమి నూనెగింజల సాగుకిందకు వస్తుంది. ఫలితంగా 120.26 లక్షల క్వింటాళ్ల నూనెగింజల ఉత్పత్తితో 24.36 లక్షల క్వింటాళ్ల వంటనూనెల లభ్యత సాధ్యమని అంచనా.