కోవిడ్‌-19 రెండోదశ ఫలితంగా దెబ్బతిన్న వివిధ రంగాలు… ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ఆదుకునే దిశగా ప్రభుత్వం చొరవ చూపింది. ఈ మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి “కోవిడ్‌ ప్రభావిత రంగాలకు రుణ హామీ పథకం” (ఎల్జీఎస్‌సీఏఎస్‌) అమలుకు ఆమోదం తెలిపింది. దీంతో వైద్య/ఆరోగ్య మౌలిక వసతుల కల్పనలో హరిత (గ్రీన్‌ఫీల్డ్‌) ప్రాజెక్టులకు, ప్రస్తుత సదుపాయాల విస్తరణ సంబంధిత (బ్రౌన్‌ఫీల్డ్‌) ప్రాజెక్టులకు ఆర్థిక సహాయంపై రుణహామీ ఇవ్వడం కోసం రూ.50,000 కోట్లదాకా నిధులు సమకూర్చే వీలు కలుగుతుంది. అంతేగాక మెరుగైన ఆరోగ్య సంరక్షణతో ముడిపడినవి సహా ఇతర రంగాలు/రుణ ప్రదాతల కోసం మరో పథకాన్ని ప్రవేశపెట్టడానికి కూడా మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించి భవిష్యత్‌ పరిస్థితులపై ఆధారపడి కాలక్రమంలో సమగ్ర విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. దీనికి అదనంగా “అత్యవసర దశలవారీ రుణ పథకం” (ఈసీఎల్జీఎస్‌) కింద రూ.1,50,000 కోట్లదాకా నిధులు సమకూర్చడానికి కూడా కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

లక్ష్యాలు:

ఎల్జీఎస్‌సీఏఎస్‌: ఈ పథకం 31.03.2022దాక మంజూరుచేసే లేదా రూ.50,000 కోట్ల గరిష్ఠ స్థాయిని చేరేదాకా ఏది ముందైతే ఆ పరిమితి మేరకు అర్హతగల అన్ని రుణాలకూ వర్తిస్తుంది.

ఈసీఎల్జీఎస్‌: ఇది కొనసాగింపు పథకం… ‘హామీగల అత్యవసర దశలవారీ రుణం’ (జీఈసీఎల్‌) కింద 30.09.2021 వరకూ మంజూరు చేసే లేదా రూ.4,50,000 కోట్ల గరిష్ఠ స్థాయిని చేరేదాకా ఏది ముందైతే ఆ పరిమితి మేరకు అర్హతగల అన్ని రుణాలకూ ఇది వర్తిస్తుంది.

ప్రభావం:

ఎల్జీఎస్‌సీఏఎస్‌: కోవిడ్‌-19 రెండోదశ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరతవల్ల అనూహ్య పరిస్థితులు తలెత్తిన దృష్ట్యా ‘ఎల్జీఎస్‌సీఏఎస్‌’కు ప్రభుత్వం రూపకల్పన చేసింది. మంత్రిమండలి ఆమోదముద్రతో దేశంలో ఎంతో అవసరమైన మౌలిక ఆరోగ్య సంరక్షణ సదుపాయాల కొరత తీరగలదని, దీంతోపాటు మరిన్ని ఉపాధి అవకాశాల సృష్టి సాధ్యమని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ దిశగా రుణ (ప్రధానంగా నిర్మాణపరమైన)ముప్పునుంచి పాక్షికంగా ఉపశమనం కల్పిస్తూ, తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాల లభ్యతకు వీలు కల్పించడమే  ‘ఎల్జీఎస్‌సీఏఎస్‌’ ప్రధాన లక్ష్యం.

ఈసీఎల్జీఎస్‌: ఇదొక కొనసాగింపు పథకం కాగా… ఇటీవలి కాలంలో కోవిడ్‌-19 మహమ్మారి రెండోదశ ఫలితంగా ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాల్లో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ‘ఈసీఎల్జీఎస్‌’ పరిధిని ప్రభుత్వం మరింత విస్తరించింది. ఈ విస్తరణతో ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు ఎంతో అవసరమైన ఉపశమనం లభించనుంది. ఈ దిశగా రూ.1.5 లక్షల కోట్ల మేర తక్కువ వ్యయంతో అదనపు రుణాలు మంజూరు చేసేవిధంగా రుణ ప్రదాన సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. తద్వారా వాణిజ్య, వ్యాపార సంస్థలు తమ నిర్వహణ బాధ్యతలను నెరవేరుస్తూ కార్యకలాపాలను కొనసాగించగలుగుతాయి. అంతేగాక ప్రస్తుత అనూహ్య పరిస్థితుల నడుమ ‘ఎంఎస్‌ఎంఈ’ రంగం సజావుగా నడిచేందుకు మద్దతు ఇవ్వనుంది. ఈ పథకం ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపడంతోపాటు దాని పునరుద్ధరణకు తోడ్పడగలదని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

నేపథ్యం:

ఎల్జీఎస్‌సీఏఎస్‌: కోవిడ్‌-19 మహమ్మారివల్ల తలెత్తిన సంక్షోభం, దాని రెండోదశతో మరింత ముదరడాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా రెండోదశలో ఆరోగ్య సదుపాయాలతోపాటు వివిధ రంగాల్లో జన జీవనోపాధి, వ్యాపార-వాణిజ్యాలపైనా అంతులేని దుష్ప్రభావం చూపింది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడుల ఆవశ్యకతను ఈ రెండోదశ బలంగా ముందుకు తెచ్చింది. దేశవ్యాప్తంగా మహా నగరాల నుంచి 5వ, 6వ అంచె పట్టణాలుసహా గ్రామీణ ప్రాంతాలదాకా నేడు ఇది తక్షణావసరం. ఈ అవసరాల్లో ఆస్పత్రులలో అదనపు పడకలు, ఐసీయూలు, రోగ నిర్ధారణ కేంద్రాలు, ఆక్సిజన్‌ కేంద్రాలు, టెలిఫోన్‌-ఇంటర్నెట్‌ ఆధారిత వైద్యసలహాలు/పర్యవేక్షణ, పరీక్ష సదుపాయాలు/సరఫరాలు, టీకాల కోసం శీతల వ్యవస్థ, మందులు/టీకాల నిల్వ కోసం ఆధునిక గిడ్డంగులు, కీలక చికిత్స కోసం ఏకాంతీకరణ సౌకర్యాలు, సిరంజిలు, సూదిమందులు వంటి అనుబంధ వస్తూత్పత్తి పెంపు వగైరాలు ఇప్పుడు ఎంతో ప్రధానం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా… ప్రత్యేకించి సేవల కొరతగల ప్రాంతాలపై దృష్టితో మౌలిక వైద్య వసతులు పెంచడం లక్ష్యంగా ‘ఎల్జీఎస్‌సీఏఎస్‌’ ప్రతిపాదించబడింది. ఈ దిశగా దేశంలోని మొదటి అంచె (టైయర్‌-1)లోగల 8 మహా నగరాలు మినహా పట్టణ లేదా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులకు మంజూరు చేసే రూ.100 కోట్లదాకా రుణాలపై ‘ఎల్జీఎస్‌సీఏఎస్‌’ హామీ ఇస్తుంది. ఈ మేరకు విస్తరణ ప్రాజెక్టుల విషయంలో రుణంలో 50 శాతానికి, కొత్త (హరిత) ప్రాజెక్టుల రుణంలో 75 శాతానికి హామీ లభిస్తుంది. కాగా, ప్రగతి కాముక జిల్లాల్లో రెండురకాల ప్రాజెక్టులకూ ఇచ్చే రుణంలో 75 శాతానికి హామీ ఉంటుంది.

ఈసీఎల్జీఎస్‌: భారతదేశంలో ఇటీవలి వారాల్లో కోవిడ్‌-19 మహమ్మారి పునఃవిజృంభణ, స్థానిక, ప్రాంతీయ స్థాయులలో దానితో ముడిపడిన నియంత్రణ చర్యలు కొత్త అనిశ్చితికి దారితీసి, తిరిగి రూపుదిద్దుకుంటున్న ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యే వర్గాల్లో వ్యక్తిగత రుణగ్రహీతలు, చిన్నవ్యాపారాలు, ‘ఎంఎస్‌ఎంఈ’లు ప్రధానమైనవి. అందుకే ఈ వర్గాలను ఆదుకోవడం కోసం విధానపరమైన ప్రతిస్పందనగా ‘ఈసీఎల్జీఎస్‌’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎప్పటికప్పుడు తలెత్తే అవసరాలపై సత్వర స్పందన వెసులుబాటు కల్పించే విధంగా ‘ఈసీఎల్జీఎస్‌’ రూపొందించబడింది. ఆ మేరకు ‘ఈసీఎల్జీఎస్‌ 2.0, 3.0, 4.0’ దశలుసహా 30.05.2021న ప్రకటించిన మార్పులు తదితరాలన్నిటివల్ల గరిష్ఠంగా రూ.3 లక్షల కోట్ల మేర నిధులు అందుబాటులో ఉండగా ‘ఈసీఎల్జీఎస్‌’ కింద ఇప్పటిదాకా రూ.2.6 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయబడ్డాయి. వ్యాపారాలపై కోవిడ్‌ దుష్ప్రప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో  ఒకసారి రుణ పునర్వ్యవస్థీకరణ పరిమితిని రూ.50 కోట్లకు విస్తరిస్తూ భారత రిజర్వు బ్యాంకు 04.06.2021న ప్రకటించిన నేపథ్యంలో మరికొంత ముందంజకు అవకాశం ఉందని అంచనా.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'

Media Coverage

'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16ఫెబ్రవరి 2025
February 16, 2025

Appreciation for PM Modi’s Steps for Transformative Governance and Administrative Simplification