ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2017-18 సంవత్సరానికి సంబంధించి రైతులకు ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ (ఐఎస్ఎస్)కు ఆమోదం తెలిపింది. ఇది వ్యవసాయదారులు కేవలం 4 శాతం వార్షిక వడ్డీకి రూ. 3 లక్షల వరకు ఒక ఏడాది వ్యవధిలో తిరిగి చెల్లించదగ్గ స్వల్పకాలిక పంట రుణాన్ని పొందేందుకు తోడ్పడనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 20,339 కోట్లను కేటాయించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌బి లు), ప్రైవేటు రంగ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్‌బి లు) వాటి సొంత నిధులను వినియోగించినపుడు వడ్డీలో ప్రభుత్వ ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది. అలాగే, ఆర్ ఆర్ బి లకు మరియు సహకార బ్యాంకులకు రీఫైనాన్స్ కు గాను నాబార్డ్ కూ ఇవ్వబడుతుంది.
ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ స్కీము ఒక సంవత్సరంపాటు కొనసాగుతుంది. దీనిని నాబార్డ్ మరియు ఆర్ బిఐ అమలుచేస్తాయి.
దేశంలో వ్యవసాయ రంగ ఉత్పాదకతకు మరియు ఉత్పత్తికి ఉత్తేజాన్ని ఇవ్వడం కోసం తక్కువ రేటు లో స్వల్పకాలిక పంట రుణాలను క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండేటట్లు చూడటం ఈ పథకం లక్ష్యం.
ఈ పథకం ప్రధానాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఎ) సకాలంలో తిరిగి చెల్లింపులు జరిపే వ్యవసాయదారులందరికీ 2017-18 సంవత్సరంలో రూ. 3 లక్షల వరకు స్వల్ప కాలిక పంట రుణంపై వడ్డీ లో 5 శాతం వార్షిక ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ఈ విధంగా వ్యవసాయదారులు చెల్లించవలసిన వడ్డీ కేవలం 4 శాతం కాగలదు. ఒకవేళ వ్యవసాయదారులు స్వల్పకాలిక పంట రుణాన్ని సకాలంలో చెల్లించకుంటే వారు పైన ప్రస్తావించిన 5 శాతానికి బదులుగా 2 శాతం ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ కు అర్హులవుతారు.
బి) కేంద్ర ప్రభుత్వం సుమారుగా రూ. 20,339 కోట్లను ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ రూపంలో 2017-18 సంవత్సరంలో అందించనుంది.
సి) చిన్న మరియు సన్నకారు రైతులు ఎవరైతే ఫలసాయాన్ని పంట కోతల అనంతరం నిల్వ చేసుకోవడానికి 9 శాతం వడ్డీకి అప్పులు చేయవలసిన పరిస్థితి ఉందో వారికి ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం 2 శాతం ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ ను ఆమోదించింది. అంటే, 6 నెలల వరకు రుణాలపై 7 శాతం వడ్డీ రేటు వర్తిస్తుందన్న మాట.
డి) ప్రకృతి వైపరీత్యాల ప్రభావానికి లోనైన వ్యవసాయదారులకు ఉపశమనం కలిగించడం కోసం ఒకటవ సంవత్సరంలో పునర్ వ్యవస్థీకరించిన సొమ్ముపై 2 శాతం ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ ను బ్యాంకులకు ఇవ్వడం జరుగుతుంది.
ఇ) వ్యవసాయదారులు స్వల్పకాలిక పంట రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే వారు పైన పేర్కొన్న దానికి బదులుగా 2 శాతం ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ కు వారు అర్హులు అవుతారు.
బృహత్ ప్రభావం:
వ్యవసాయ రంగంలో అధిక దిగుబడి మరియు మొత్తం మీద ఉత్పత్తి సాధనలో పరపతి ఒక కీలకమైన ఇన్ పుట్ గా లెక్కకు వస్తోంది. వ్యవసాయదారులకు స్వల్ప కాలిక పంట రుణాల పైన, అలాగే పంట కోతల తరువాతి నిల్వలపై ఇచ్చే రుణాల పైన వడ్డీలో ప్రభుత్వ ఆర్థిక సహాయంగా రూ. 20,339 కోట్లు సమకూర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం, దేశంలోని వ్యవసాయదారులకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఇన్ పుట్ అవసరాన్ని తీర్చడమే అవుతుంది. సంస్థాగతమైన ఈ పరపతి సౌకర్యం వ్యవసాయదారులను సంస్థాగతేతర పరపతి మార్గాల నుండి విముక్తిని ప్రసాదించగలదు. వారు సంస్థాగతేతర పరపతి మార్గాలను అనుసరిస్తే హెచ్చు వడ్డీ రేట్లకు అప్పులు చేయక తప్పని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎమ్ఎఫ్‌బివై)లో భాగంగా ఉన్న పంట బీమా సదుపాయం పంట రుణాల లభ్యతతో ముడిపడింది కావడంతో వ్యవసాయదారులు ప్రభుత్వం యొక్క రైతు ప్రయోజన ప్రధానమైన కార్యక్రమాలు రెండింటి ద్వారా ప్రయోజనం పొందగలుగుతారు.
ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలలో మార్కెట్ సంస్కరణలు ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఇది వ్యవసాయదారులు వారి ఉత్పత్తికి మార్కెట్ లో గిట్టుబాటు ధరలను పొందేటట్లు చూస్తుంది. 2016 ఏప్రిల్ లో ప్రభుత్వం ప్రారంభించిన ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (e-NAM.. ఇ-నామ్) ఎపిఎమ్ సి లను ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారా సమీకృత పరచడం మరియు స్పర్ధాత్మక రీతిలో ధరలు కనుగొనేందుకు వీలు కల్పించడం ధ్యేయంగా పని చేస్తోంది. ఇది వ్యవసాయదారులకు ప్రయోజనకరం. వ్యవసాయదారులకు ఆన్ లైన్ వ్యాపారానికి మళ్ళవలసిందిగా సలహా ఇవ్వడం జరిగింది. అలాగే, వారు వారి దిగుబడులను గుర్తింపు పొందిన గిడ్డంగులలో నిల్వచేయడం ద్వారా పంట కోతల అనంతర కాలపు రుణాలను సైతం తమంతట తాము పొందగలగడం కూడా మరో ముఖ్యమైన ప్రయోజనం. ఈ రుణాలు కిసాన్ క్రెడిట్ కార్డు (కెసిసి) ని కలిగివున్న చిన్న మరియు సన్నకారు రైతులకు ఆరు మాసాల లోపు కాలానికి గాను అటువంటి నిల్వల మీద 2 శాతం ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ ప్రాతిపదికన లభిస్తున్నాయి. ఇది వ్యవసాయదారులు మార్కెట్ ఉత్సాహంగా ఉందని వారు భావించినప్పుడు విక్రయాలకు సిద్ధపడేందుకు తోడ్పడుతుంది. అంతే తప్ప తెగనమ్మే స్థితికి తావు ఇవ్వదు. ఈ కారణంగా చిన్న మరియు సన్నకారు రైతులు వారి కెసిసి లను తప్పక చెలామణిలో ఉంచుకొనేటట్లు చూస్తుంది.
వ్యవసాయదారుల ఆదాయాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వం తపిస్తోంది. అందుకోసం ప్రభుత్వం విత్తనాలు మొదలు విక్రయాల వరకు విస్తరించిన అనేక నూతన కార్యక్రమాలను ప్రారంభించింది. భూమి స్వస్థత కార్డు, ఇన్ పుట్ మేనేజ్‌మెంట్ ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (పిఎమ్ కెఎస్ వై) లో భాగంగా ప్రతి నీటి బిందువుకు మరింత పంట, పిఎమ్ ఎఫ్ బివై, ఇ-నామ్ ల వంటి ప్రభుత్వ పథకాలన్నింటికి తోడుగా తాజాగా సంస్థాగత వనరుల ద్వారా పరపతి సౌకర్యం తెర మీదకు వస్తోంది.
పూర్వ రంగం:
ఈ పథకం 2006-07 నుండి కొనసాగుతోంది. ఇందులో భాగంగా వ్యవసాయదారులు రూ. 3 లక్షల వరకు 7 శాతం వడ్డీ రేటుకు రాయితీతో కూడిన పంట రుణాలను పొందవచ్చు. అంతేకాకుండా, ఇది అదనంగా 3 శాతం ప్రత్యేక ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తోంది. అడ్వాన్సు తీసుకున్న తేదీ నాటి నుండి ఒక సంవత్సరం కాలం లోపల తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కెసిసి కలిగివున్న చిన్న మరియు సన్నకారు రైతులకు 6 నెలల వరకు నెగోషియబుల్ వేర్ హౌస్ రిసీట్స్ (ఎన్ డబ్ల్యుఆర్) ల పై గుర్తింపు పొందిన గిడ్డంగులలో వారి ఉత్పత్తిని పంట కోతల తరువాత నిల్వ చేసుకొనే సౌకర్యం కూడా ఉంది. పంటను తెగనమ్మే పరిస్థితిని నివారించడం కోసం ఈ వెసులుబాటును కల్పించడమైంది. 2016-17 సంవత్సరంలో స్వల్ప కాలిక పంట రుణాలుగా మంజూరు చేసిన మొత్తం రూ. 6,22,685 కోట్లుగా ఉంది. ఇది అనుకున్న లక్ష్యమైన రూ. 6,15,000 కోట్లను మించింది.
అన్ని స్వల కాలిక పంట రుణ ఖాతాలను ప్రస్తుత సంవత్సరం నుండి ‘ఆధార్’ తో ముడి పెట్టడం జరుగుతుంది.