చెరకు కాలం 2024-25కు చక్కెర రికవరీ రేటు 10.25% వద్ద క్వింటాలు చెరకును న్యాయమైన, లాభదాయక ధర ( ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్ - ఎఫ్ ఆర్‌పి) రూ.340కి కొనుగోలు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాలకేబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ చారిత్రిక ధర ప్రస్తుత 2023-24 కాలంలో చెరకు ఎఫ్ఆర్‌పి కన్నా దాదాపు 8% ఎక్కువ. సవరించిన ఎఫ్ఆర్‌పి 01 అక్టోబర్ 2024 నుంచి అమలులోకి వస్తుంది.
చెరకు ఎ2+ఎఫ్ఎల్ ధరకంటే 107% ఎక్కువగా ఉన్న నూతన ఎఫ్ఆర్‌పి చెరకు రైతుల శ్రేయస్సుకు హామీ ఇస్తుంది. ప్రపంచంలోనే భారతదేశం చెరకుకు అత్యధిక ధరను చెల్లిస్తుండడం గమనార్హం. అయినప్పటికీ ప్రభుత్వం దేశ ప్రజానీకానికి ప్రపంచంలో అత్యంత చౌకగా చక్కెర అందుబాటులో ఉండేలా నిర్ధారిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 5 కోట్లమందికి పైగా (కుటుంబ సభ్యులు సహా) చెరుకు రైతులకు, చక్కెర రంగంతో ప్రమేయం ఉన్న లక్షలాది మంది వ్యక్తులకు లబ్ధి చేకూర్చనుంది. రైతులకు రెట్టింపు ఆదాయం అన్న మోడీ కీ గ్యారంటీని (హామీని) నెరవేర్చడాన్ని ఇది పునరుద్ఘాటిస్తుంది.
ఈ ఆమోదముద్రతో, చక్కెర మిల్లులు రికవరీ రేటు 10.25% వద్ద చెరకును క్వింటాలుకు రూ. 340 చెల్లిస్తాయి. ప్రతి 0.1% రికవరీ పెంపుతో రైతులకు రూ. 3.32 అదనపు ధర అందుతుంది. కాగా, ఇదే మొత్తాన్ని 0.1% రికవరీని క్షయింప చేసిన సమయంలో తగ్గిస్తారు. కాగా, 9.5% రికవరీ వద్ద చెరుకు కనీస ధర క్వింటాలు కు రూ. 315.10గా ఉంటుంది. చక్కెర రికవరీ తక్కువ అయినప్పటికీ, రైతులకు క్వింటాలుకు రూ. 315.10 ఎఫ్ఆర్‌పి హామీ ధర చెల్లిస్తారు.
గత 10 ఏళ్ళలో మోడీ ప్రభుత్వం రైతుల పంటలకు సరైన సమయంలో సరైన ధర ఇచ్చేలా నిర్ధారించింది. గత చక్కెర కాలం 2022-23కు సంబంధించిన చెరకు బకాయిలలో 99.5%, అన్ని చక్కెర కాలాలకు సంబంధించి 99.9% న్ని రైతులకు చెల్లించివేయడం ద్వారా చెరకు రంగ చరిత్రలో అత్యంత తక్కువ చెరకు బాకీలు ఉండేందుకు దారి తీసింది. సకాలంలో ప్రభుత్వం చేపట్టిన విధాన చొరవల కారణంగా చక్కెర మిల్లలు స్వయం సమృధ్ధిని సాధంచడంతో, 2021-22 నుంచి ప్రభుత్వం వారికి ఎటువంటి ఆర్ధిక సాయాన్ని అందించడంలేదు. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన చెరకు ఎఫ్ఆర్‌పి, హామీ ఇచ్చిన సేకరణను నిర్ధారించింది.