ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. పంజాబ్, హర్యానాల్లో ఎన్‌హెచ్ (ఓ) కింద, మిశ్రమ వార్షిక చెల్లింపు విధానంలో ఆరు వరుసల జిరాక్‌పూర్ బైపాస్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. జాతీయ రహదారి-7 (జిరాక్‌పూర్-పటియాలా) జంక్షన్ నుంచి మొదలై జాతీయ రహదారి-5 (జిరాక్‌పూర్- పర్వనూ) జంక్షన్ వద్ద ముగుస్తుంది. దీని మొత్తం పొడవు 19.2 కి.మీ. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళిక కింద సమగ్ర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు.
ఈ ప్రాజెక్టు మొత్తం మూలధన వ్యయం రూ.1878.31 కోట్లు.
జిరాక్పూర్ బైపాస్ జిరాక్‌పూర్‌లోని ఎన్‌హెచ్ -7 (చండీగఢ్-బటిండా) జంక్షన్ నుంచి ప్రారంభమవుతుంది. పంజాబ్ ప్రభుత్వ బృహత్ప్రణాళికను అనుసరిస్తూ.. హర్యానాలోని పంచకులలో ఎన్‌హెచ్-5 (జిరాక్‌పూర్ - పర్వానూ) జంక్షన్ వద్ద ముగుస్తుంది. అలా, పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రద్దీతో కూడిన పంజాబ్‌లోని జిరాక్‌పూర్, హర్యానాలోని పంచకుల ప్రాంతాలను తప్పిస్తుంది.
పాటియాలా, ఢిల్లీ, మొహాలి ఏరోసిటీ నుంచి ట్రాఫిక్‌ను మళ్లించడం ద్వారా జిరాక్‌పూర్, పంచకుల, పరిసర ప్రాంతాల్లో రద్దీని తగ్గించడం దానితోపాటు హిమాచల్ ప్రదేశ్‌కు నేరుగా అనుసంధానాన్ని కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఎన్‌హెచ్-7, ఎన్‌హెచ్-5, ఎన్‌హెచ్-152 ప్రదేశాల్లో రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణాన్ని సులభతరం చేయడం ప్రస్తుత ప్రతిపాదన లక్ష్యం.
చండీగఢ్, పంచకుల, మొహాలి నగర పరిధిలో రద్దీని తగ్గించడం కోసం ప్రభుత్వం రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. పటంలో సూచించిన విధంగా అది రింగ్ రోడ్డు ఆకృతిలో రూపు దిద్దుకుంటుంది. ఈ ప్రణాళికలో జిరాక్‌పూర్ బైపాస్ ఒక ముఖ్యమైన భాగం.
Cabinet approval for the construction of the 6-lane Zirakpur Bypass will reduce travel time and also improve connectivity to Himachal Pradesh and NCR. It is also in line with our PM GatiShakti effort to build seamless, future-ready transport infrastructure.…
— Narendra Modi (@narendramodi) April 9, 2025