వచ్చే సంవత్సరం లో శ్రీ గురు నానక్ దేవ్ గారి 550వ జయంతి సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వాలతో, విదేశాల్లోని భారతదేశ రాయబార కార్యాలయాలతో కలసి దేశవ్యాప్తం గాను, ప్రపంచం అంతటా కూడాను ఘనమైన రీతి లో, సముచితమైన విధం గా ఉత్సవాలను నిర్వహించడానికి ఒక తీర్మానాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. గురు నానక్ దేవ్ గారు బోధించిన ప్రేమ, శాంతి, సమానత్వం, ఇంకా సౌభ్రాతృత్వం శాశ్వత విలువలను కలిగివున్నటువంటి ప్రబోధాలు.
మంత్రిమండలి సమావేశం లో తీసుకొన్న నిర్ణయాల ప్రధానాంశాలు ఈ కింది విధం గా ఉన్నాయి:
కర్తార్ పుర్ సాహిబ్ నడవా ను అభివృద్ధిపరచడం :
గురు నానక్ దేవ్ గారు వారి యొక్క జీవితం లో 18 సంవత్సరాల కాలాన్ని గడిపిన పాకిస్తాన్ లోని రావి నది తీరాన ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్ పుర్ ను దర్శించే భారతీయ యాత్రికుల సౌకర్యార్ధం గురుదాస్ పుర్ జిల్లా లోని డేరా బాబా నానక్ నుండి అంతర్జాతీయ సరిహద్దు వరకు ఉన్న కర్తార్ పుర్ నడవా ను నిర్మించి అభివృద్ధిపరచే ముఖ్య నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని వలన యాత్రికులు సంవత్సరం అంతా కూడా పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొనే అవకాశం కలుగుతుంది.
కర్తార్ పుర్ నడవా ను భారత ప్రభుత్వం నిధులతో ఒక సమగ్ర అభివృద్ధి పథకం వలె అమలుచేయడం జరుగుతుంది. యాత్రికులకు యాత్ర సుగమం గా, సౌకర్యవంతం గా సాగడానికి భారత ప్రభుత్వం అన్ని ఆధునిక సౌకర్యాలను సమకూర్చుతుంది. అలాగే సిక్కు సముదాయం యొక్క విశ్వాసాలను గుర్తించి వారి యాత్ర సుగమం గా సాగడానికి కావలసిన సౌకర్యాలను కల్పించి ఈ నడవా ను అభివృద్ధిపరచవలసింది గా పాకిస్తాన్ ను భారత ప్రభుత్వం అభ్యర్ధించనుంది కూడా.
సుల్తాన్ పుర్ లోధీ యొక్క అభివృద్ధి :
గురునానక్ దేవ్ జీ జీవితంతో సంబంధం కలిగి ఉన్న చారిత్రాత్మక సుల్తాన్ పుర్ లోఢీ ని కూడా అభివృద్ధి పరచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనిని విద్యుత్ సామర్థ్యంతో బాటు ఆకర్షణీయ పట్టణాల సూత్రాలకు అనుగుణంగా గురునానక్ దేవ్ జీ పై గౌరవ భావంతో అభివృద్ధి పరచాలని మంత్రివర్గం ఉద్ఘాటించింది. గురునాననక్ దేవ్ జీ జీవితం లోని పలు ముఖ్యమైన అంశాలను వివరించే ‘‘పింద్ బాబే నానక్ దా’’ను స్థాపించి, ఒక వారసత్వ భవనాన్ని నిర్మించి యాత్రికులకు, సందర్శరకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలపనుంది. సుల్తాన్ పుర్ లోఢీ రైల్వే స్టేషన్ ను కూడా స్థాయి పెంచి, ఆధునిక సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయనున్నారు.
మత విశ్వాసాల గురించిన అంతరంగిక అధ్యయన కేంద్రం మరియు విదేశీ విశ్వవిద్యాలయాల్లో పదవి :
అమృత్ సర్ లోని గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం లో సిక్కు మత విశ్వాసాల అధ్యయనాని కై ఒక అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. బ్రిటన్ లోను, కెనడా లోను చెరి ఒక విశ్వవిద్యాలయం లో గురు నానక్ దేవ్ గారి కి ఒక స్థానాన్ని కల్పించనున్నారు. న్యూ ఢిల్లీ లో గురు నానక్ దేవ్ గారి జీవితం పై మరియు బోధనల పై ఒక అంతర్జాతీయ సదస్సు ను నిర్వహించనున్నారు.
దేశ వ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా జయంతి ఉత్సవాల నిర్వహణ :
గురు నానక్ దేవ్ గారి 550వ జయంతి ఉత్సవాల ను తగిన విధం గా నిర్వహించవలసింది గా రాష్ట్రాల ప్రభుత్వాలను మరియు కేంద్రపాలిత ప్రాంతాల పాలన యంత్రాంగాలను సైతం అభ్యర్థించడం జరుగుతుంది. జయంతి సందర్భం గా విదేశాల లోని భారత దౌత్య కార్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాల ను నిర్వహిస్తాయి.
స్మారక నాణేలు మరియు తపాలా బిళ్ల లు :
జయంతి ఉత్సవాల సందర్భం గా శ్రీ గురు నానక్ దేవ్ గారి సంస్మరణార్థం భారత ప్రభుత్వం నాణేలను మరియు తపాలా బిళ్ల లను విడుదల చేయనుంది.
మత పరమైన కార్యక్రమాలు మరియు ప్రచురణలు:
దేశ వ్యాప్తం గా మత పరమైన కార్యక్రమాలను నిర్వహించబడుతాయి. శ్రీ గురు నానక్ దేవ్ గారి పై మరియు గురుబాణి పై దూరదర్శన్ లో కార్యక్రమాలు ప్రసారం చేయబడుతాయి. గురుబాణి ని వివిధ భారతీయ భాష లలో నేశనల్ బుక్ ట్రస్టు ప్రచురిస్తుంది. శ్రీ గురు నానక్ దేవ్ గారి రచనలను వివిధ విదేశీ భాషలలో ప్రచురించవలసింది గా యుఎన్ఇఎస్ సిఒ (UNESCO) ను అభ్యర్థిస్తారు.
యాత్రికుల కోసం ప్రత్యేక రైలు :
శ్రీ గురు నానక్ దేవ్ గారి జీవితం తో సంబంధం ఉన్న వివిధ పవిత్ర స్థలాల ను కలుపుతూ ఒక రైలు ను యాత్రికుల కోసం, సందర్శకుల కోసం భారత రైల్వే మంత్రిత్వ శాఖ నడుపనుంది.