ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం, కొత్తగా కేంద్ర ప్రాయోజిత పథకమైన ‘ఆయుష్మాన్ భారత్ – జాతీయ ఆరోగ్య పరిరక్షణ మిషన్’ (ఎబి- ఎన్‌హెచ్‌పిఎమ్) ను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధి లో ఆయుష్మాన్ భారత్ మిశన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ కంపొనంట్ తో ఇది అమలవుతుంది. ఈ పథకం లో ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ప్రయోజనంతో కూడిన కవరేజ్ లభిస్తుంది. ఎస్‌ఇసిసి సమాచార నిధి ప్రకారం ఈ పథకం కింద ప్రయోజనం పొందనున్న పేదల కుటుంబాల సంఖ్య 10 కోట్లుగా ఉండనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బివై), సీనియర్ సిటిజన్స్ హెల్త్ స్కీమ్ (ఎస్‌సిహెచ్ ఐఎస్) లను ఎబి- ఎన్‌హెచ్‌పిఎమ్ లో విలీనం చేయనున్నారు.
ముఖ్యాంశాలు:
1. ప్రతి కుటుంబానికి ఏటా 5 లక్షల రూపాయల వరకు కవరేజ్ తాలూకు ప్రయోజనం చేకూర్చాలని ఎబి-ఎన్‌హెచ్‌పిఎమ్ లో పొందుపరచారు.
దీని కింద దాదాపు అన్ని రకాల స్పెషలిస్టుల వైద్య సేవలు, ఆసుపత్రిలో చేరిన తర్వాత అవసరమయ్యే చాలావరకు సేవలకు ఇది వర్తిస్తుంది. ఈ పథకం పరిధి నుండి ఎవరినీ తప్పించకూడదన్న ఉద్దేశంతో (ప్రత్యేకించి మహిళలు, పిల్లలు, వృద్ధులు) కుటుంబ సభ్యుల సంఖ్యలో పరిమితి గానీ, వయస్సు పై పరిమితి గానీ ఈ పథకంలో ఏదీ లేదు. ఈ పథకంలో భాగంగా వర్తించే ప్రయోజనాలలో ఆసుపత్రి లో చేరడానికి ముందు, ఆసుపత్రి లో చేరిన తరువాతి ఖర్చులు కూడా ఉన్నాయి. పాలసీ తీసుకోవడానికి ముందున్న పరిస్థితులన్నీ పాలసీ తీసుకున్న రోజు నుండి వర్తిస్తాయి. ఆసుపత్రి లో చేరిన సందర్భాలలో లబ్ధిదారులకు నిర్దేశిత రవాణా భత్యాన్ని కూడా చెల్లిస్తారు.
2. ఈ పథకం లో భాగంగా ప్రయోజనాలను దేశ వ్యాప్తంగా ఎక్కడికైనా మార్చుకోవచ్చు. ఈ పథకంలో లబ్ధిదారులు దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించిన జాబితా లోని ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి లో నగదు రహిత వైద్య సేవలను పొందవచ్చు.
3. ఎబి-ఎన్‌హెచ్‌పిఎమ్ పథకం ఎస్ఇసిసి సమాచారం ఆధారంగా పేదరికం ప్రాతిపదికగా వర్తింపచేసే పథకం. ఇందుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో వివిధ కేటగిరీల కుటుంబాలు వస్తాయి. ఒకే ఒక గది, కచ్చా గోడ లతో ఉన్న కుటుంబాలు, కచ్చా పై కప్పు కలిగిన కుటుంబాలు, 16- 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఎవరూ తమ కుటుంబంలో లేని వారు, 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు గల వయోజనులైన పురుష కుటుంబ సభ్యులు ఎవరూ లేని ఇంటి పెద్ద గా మహిళను కలిగిన కుటుంబాలు, దివ్యాంగులు, కుటుంబంలో శారీరిక వైకల్యం లేని వయోజనులు లేని కుటుంబాలు, ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలు, భూమి లేని వారు, తమ ఆదాయంలో ఎక్కువ భాగం కాజువల్ కార్మికుడిగా పనిచేయడం వల్ల వచ్చే రాబడి కల వారు, గృహ వసతి లేని, అనాథలు, ఇతరుల సాయంపై ఆధారపడి జీవించే వారు, శుద్ధికారక కుటుంబాలు, ఆదిమ గిరిజన సమూహాలు, చట్ట ప్రకారం విడుదలైన వెట్టి కార్మికుల వంటి వారిలో ఏదో ఒక కేటగిరీ వారు ఈ పథకం కిందకి వస్తారు. పట్టణ ప్రాంతాలలో ఈ పథకం కింద నిర్దేశించిన 11 రకాల వృత్తుల వారు ఈ పథకం కిందికి వస్తారు.
4. ఈ పథకం కింద లబ్ధిదారులు పబ్లిక్, ప్రభుత్వం వద్ద నమోదైన ప్రైవేట్ ఆసుపత్రుల లోనూ ప్రయోజనాలను పొందవచ్చు. రాష్ట్రాలలో ఎబి- ఎన్‌హెచ్‌పిఎమ్ పథకం అమలు చేస్తున్న అన్ని ఆసుపత్రులు ఈ పథకం కింద నమోదైన ఆసుపత్రులుగా పరిగణిస్తారు. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్‌ఐసి) ఆసుత్రులను వాటి వద్ద గల పడకల ప్రమాణాల ఆధారంగా వాటిని కూడా జాబితాలో చేర్చవచ్చు. ప్రైవేటు ఆసుపత్రుల విషయానికి వస్తే, వాటికి సంబంధించి నిర్వచించిన ప్రాతిపదికల ఆధారంగా ఆన్ లైన్ ద్వారా జాబితాలో చేర్చుతారు.
5. ఖర్చులను తగ్గించేందుకు, చికిత్స కు అయ్యే ఖర్చు చెల్లింపులను పాకేజ్ రేట్ లో చెల్లిస్తారు. (ఇందుకు సంబంధించి ప్రభుత్వం ముందుగానే ప్రకటిస్తుంది). పాకేజ్ రేట్ల లో చికిత్స కు సంబంధించిన అన్ని రకాల ఖర్చులు ఇమిడి ఉంటాయి. లబ్ధిదారుల కు ఇది నగదు రహిత పథకం. కాగిత రహిత లావాదేవీల కు వీలు కల్పిస్తుంది. ఆయా రాష్ట్రాల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పరిమిత పరిధి లో రేటులను సవరించుకొనేందుకు వెసులుబాటు ను కల్పిస్తారు.
6. ఎబి- ఎన్ హెచ్ పిఎమ్ పథకం ప్రధాన సూత్రం , సహకార ఫెడరలిజమ్, రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించడం. సహ కూటమి ద్వారా రాష్ట్రాలను భాగస్వాములను చేసేందుకు ఇందులో ఏర్పాటు ఉంది. దీనివల్ల కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు (స్వంత ఖర్చుతో) అమలు చేస్తున్న ప్రస్తుత వైద్య బీమా, వైద్య పరిరక్షణ పథకాలను సమ్మిళితం చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. రాష్ట్రప్రభుత్వాలు ఎబి- ఎన్‌హెచ్‌పిఎమ్ పథకాన్ని నిలువుగా, సమాంతరంగా విస్తరింపచేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వీలు కల్పిస్తారు. ఈ పథకం అమలు కు సంబంధించిన విధి విధానాలను ఎంచుకొనే స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇస్తారు. దీనిని వారు బీమా కంపెనీ ద్వారా గానీ, లేదా నేరుగా ట్రస్ట్ ద్వారా గానీ, లేదా సొసైటీ , లేదా రెండింటి సమాహారమైన నమూనాలో గానీ అమలు చేసుకోవచ్చును.
7. ఈ పథకం కింద విధానపరమైన ఆదేశాలు ఇవ్వడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని సాధించడానికి ఆయుష్మాన్‌భారత్- జాతీయ ఆరోగ్య పరిరక్షణ మిషన్ కౌన్సిల్ (ఎబి- ఎన్‌హెచ్‌పిఎమ్ సి) ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికి కేంద్ర ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షత వహిస్తారు. అలాగే ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిశన్ గవర్నింగ్ బోర్డ్ (ఎబి- ఎన్‌హెచ్‌పిఎమ్ జిబి) ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికి కార్యదర్శి (ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ), మరియు నీతి ఆయోగ్ మెంబర్ (హెల్త్) లు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. సభ్యులుగా.. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ యొక్క ఆర్థిక సలహాదారు, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ కు చెందిన ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ (ఎబి- ఎన్‌హెచ్‌పిఎమ్) అదనపు కార్యదర్శి & మిషన్ డైరక్టర్, మరియు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ కు చెందిన (ఎబి- ఎన్‌హెచ్‌పిఎమ్) జాయింట్ సెక్రటరీ లు.. ఉంటారు. మెంబర్ సెక్రటరీగా ఆయుష్మాన్ భారత్- నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిశన్ యొక్క సిఇఒ ఉంటారు. అవసరాన్ని బట్టి ఆరోగ్య విభాగ రాష్ట్ర కార్యదర్శులు కూడా సభ్యులుగా ఉండవచ్చు. ఆయుష్మాన్ భారత్- జాతీయ ఆరోగ్య పరిరక్షణ మిషన్ ఏజెన్సీ (ఎబి-ఎన్‌హెచ్‌పిఎమ్ఎ) ని సైతం ఏర్పాటు చేస్తారు. ఇది సొసైటీ రూపంలో ఉండి కార్యకలాపాల నిర్వహణకు ఉపకరిస్తుంది. ఆయుష్మాన్ భారత్-ఎన్‌హెచ్‌పిఎమ్ఎ కి పూర్తి కాలపు సిఇఒ ఉంటారు. ఈ సిఇఒ భారత ప్రభుత్వ కార్యదర్శి లేదా అదనపు కార్యదర్శి హోదా కలిగివుంటారు.
8. ఈ పథకం అమలుకు రాష్ట్రాలకు స్టేట్ హెల్త్ ఏజెన్సీలు అవసరం. రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్న ట్రస్ట్, సొసైటీ, లాభాపేక్ష లేని కంపెనీ, రాష్ట్ర నోడల్ ఏజెన్సీని కానీ లేదా కొత్త ట్రస్టు, సొసైటీ, లాభాపేక్ష లేని కంపెనీ, స్టేట్ హెల్త్ ఏజెన్సీ ని ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర హెల్త్ ఏజెన్సీ గా వ్యవహరించవచ్చు. జిల్లా స్థాయిలో కూడా ఈ పథకం అమలు కు ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
9. స్టేట్ హెల్త్ ఏజెన్సీ కి నిధులు సకాలంలో అందే విధంగా చేయడానికి, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను ఎబి- ఎన్‌హెచ్‌పిఎమ్ఎ నుండి రాష్ట్ర హెల్త్ ఏజెన్సీ లకు ఎస్క్రో ఖాతా ద్వారా నేరుగా బదిలీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు వాటి వంతు వాటా గ్రాంట్ ను నిర్దీత కాల వ్యవధి లోగా జమ చేయవలసివుంటుంది.
10. నీతి ఆయోగ్ తో భాగస్వామ్యం ద్వారా, అద్భుతమైన ఐటి ప్లాట్ ఫారమ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇది లావాదేవీలను నగదు రహితం, కాగితం రహితం చేస్తుంది. దీనివల్ల పథకం దుర్వినియోగం కాకుండా చూడడంతో పాటు, దుర్వినియోగాన్ని, మోసాలను కనిపెట్టడానికి వీలు కలుగుతుంది. దీనితో పాటు పటిష్టమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఏర్పాటవుతుంది. దీనికి తోడు నైతిక నియమాలకు భంగకరంగా ఉండే (దుర్వినియోగానికి అవకాశం ఉన్న సందర్భాలలో) చికిత్స కు ముందస్తు అనుమతి ని తప్పనిసరి చేయనున్నారు.
11. ఈ పథకం నిర్దేశిత లబ్ధిదారులకు, సంబంధిత ఇతర వర్గాలకు ప్రయోజనం కలిగేలా చూసేందుకు సమగ్ర మీడియా, అవుట్ రీచ్ వ్యూహాన్ని అభివృద్ధి చేస్తారు. ఇందులో ముద్రణ మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లు, సంప్రదాయ ప్రసార మాధ్యమాలు, ఐఇసి మెటీరియల్, ఇంకా అవుట్ డోర్ కార్యకలాపాలు ఉండనున్నాయి.
అమలు వ్యూహం:
జాతీయ స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయడానికి ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిశన్ ఏజెన్సీ (ఎబి-ఎన్‌హెచ్‌పిఎమ్ఎమ్) ఏర్పడుతుంది. ఈ పథకం అమలుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్టేట్ హెల్త్ ఏజెన్సీ పేరుతో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయవలసివుంటుంది. ఇందుకు వారు ప్రస్తుత ట్రస్ట్, సొసైటీ, లాభాపేక్ష లేని కంపెనీ, స్టేట్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్‌ఎ) ని ఉపయోగించుకోవచ్చు. లేదా ఈ పథకం అమలుకు కొత్త సంస్థ ను ఏర్పాటు చేయవచ్చు. ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలన్న విషయాన్ని రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయించుకోవచ్చు. బీమా కంపెనీ ద్వారా గానీ లేదా ప్రత్యక్షంగా ట్రస్ట్ ద్వారా గానీ లేదా సొసైటీ ద్వారా గానీ లేదా సమీకృత నమూనా ద్వారా గానీ దీనిని అమలు చేయవచ్చు.
ప్రధాన ప్రభావం:
భారతదేశం లో గత పది సంవత్సరాలలో ఇన్ పేశంట్ చికిత్స ఖర్చులు సుమారు 300 శాతం పెరిగాయి (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ 2015). 80 శాతం పైగా ఆసుపత్రి ఖర్చును రోగులు స్వంతంగా భరించవలసి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల లోని కుటుంబాల వారు ప్రధానంగా తమ కుటుంబ ఆదాయం, పొదుపు లపై (68 శాతం), రుణాలపై (25 శాతం) ఆధార పడతారు. పట్టణ ప్రాంత కుటుంబాల వారు ఆసుపత్రి ఖర్చులకు తమ ఆదాయం, పొదుపులపై (75 శాతం), అప్పులపై (18 శాతం) ఆధారపడతారు (ఎన్‌ఎస్‌ఎస్ఒ 2015). ఆసుపత్రి ఖర్చుల విషయంలో రోగులు వారి జేబు నుండి ఖర్చు పెట్టే మొత్తం 60 శాతానికి పైగా ఉంటోంది. దీనితో 60 లక్షల కుటుంబాలు మోయలేని ఆరోగ్య ఖర్చుల కారణంగా పేదరికం బారిన పడుతున్నారు. దిగువ కారణాల వల్ల రోగులు వారి జేబు నుండి పెట్టే ఖర్చు ను తగ్గించడానికి ఆయుష్మాన్ భారత్- జాతీయ ఆరోగ్య పరిరక్షణ మిశన్ తోడ్పడుతుంది.
i) సుమారు 40 శాతం జనాభాకు (పేదలు, అణగారిన వర్గాలవారికి) విస్తృత ప్రయోజనం
ii) దాదాపు అన్ని రకాల సెకండరీ, టెర్షియరీ ఆసుపత్రి ఖర్చులు (నెగటివ్ జాబితా లోనివి మినహా)
iii) ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల కవరేజ్ వర్తింపు (కుటుంబ సభ్యుల సంఖ్యపై పరిమితి లేకుండా).
ఇది, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ చర్యలకు, వైద్యం అందుబాటుకు వీలు కల్పిస్తుంది. దీనికి తోడు ఆర్థిక వనరులు లేని కారణంగా ప్రజలకు ఇంత కాలం అందుబాటులో లేని వైద్య సదుపాయాలు ఇప్పుడు అందుబాటు లోకి వస్తాయి. దీనితో సకాలంలో చికిత్స అందడానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి, రోగి సంతృప్తికి , ఉత్పాదకత, సామర్ధ్యం పెంపునకు, ఉపాధి కల్పనకు, మొత్తంగా జీవన నాణ్యత పెంపునకు దోహదపడుతుంది.
ఇమిడి ఉన్న ఖర్చు:
ఈ పథకం కింద ప్రీమియమ్ చెల్లింపునకు సంబంధించి అయ్యే ఖర్చును కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత నిష్పత్తిలో, అమలులో ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా భరిస్తాయి. మొత్తం వ్యయం, ఆయుష్మాన్ భవ -ఎన్‌హెచ్‌పిఎమ్ పథకం బీమా కంపెనీల ద్వారా అమలయ్యే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నిర్ణయించిన మార్కెట్ ఆధారిత వాస్తవ ప్రీమియంను బట్టి ఖర్చు ఉంటుంది. ట్రస్టులు, సొసైటీ విధానంలో ఈ పథకం అమలయ్యే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నిధులను వాస్తవ ఖర్చు ఆధారంగా లేదా ప్రీమియమ్ సీలింగ్ (ఏది తక్కువ అయితే అది) కేంద్రం వాటాగా ముందుగా నిర్ణయించిన నిష్పత్తిలో భరించడం జరుగుతుంది.
లబ్ధిదారుల సంఖ్య:
తాజా సామాజిక, ఆర్థిక కుల గణన (ఎస్‌ఇసిసి) లో పేర్కొన్న గ్రామీణ, పట్టణ ప్రాంత గణాంకాల ఆధారంగా పేదలు, అణగారిన వర్గాల గ్రామీణ కుటుంబాలకు, పట్టణ ప్రాంత కార్మికులలో గుర్తించిన వృత్తుల కు చెందిన సుమారు 10.74 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడాన్ని ఆయుష్మాన్‌భవ- ఎన్‌హెచ్‌పిఎమ్ లక్ష్యం గా నిర్దేశించుకొంది. ఈ పథకాన్ని క్రియాశీలంగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఎస్ఇసిసి అందించే సమాచారం ఆధారంగా ఆయా వృత్తుల చేర్పునకు, లేదా తొలగింపునకు లేదా భవిష్యత్‌లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలుగా రూపొందించారు.
రాష్ట్రాలు/జిల్లాలకు వర్తింపు:
ఆయుష్మాన్ భవ,-ఎన్‌హెచ్‌పిఎమ్ ను అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అన్ని జిల్లాల లోని లక్షిత లబ్దిదారులకు అందే లక్ష్యంతో వర్తింప చేస్తారు.
పూర్వరంగం:
రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ 2008 లో ప్రారంభించింది. దీని ద్వారా ఏడాదికి 30,000 రూపాయల కవరేజ్‌ని ఫామిలీ ఫ్లోటర్ ఆధారిత పద్ధతిలో (కుటుంబంలో ఐదుగురు సభ్యులకు) ఆరోగ్య బీమా సదుపాయం కల్పించేది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి, అసంఘటిత రంగానికి చెందిన మరో 11 రకాల నిర్దేశిత వర్గాలకు ఇది వర్తించేది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బివై) ని ఆరోగ్య వ్యవస్థతో ఏకీకృతం చేయడానికి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సమగ్ర ఆరోగ్య రక్షణ దార్శనికతలో భాగం చేయడానికి ఆర్‌ఎస్‌బివై ని ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు 1.4.2015 నుండి బదిలీ చేయడం జరిగింది. 2016-2017 సంవత్సరంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకం కింద దేశం లోని 278 జిల్లాలలో 3.63 కోట్లకుటుంబాలకు వర్తింపచేయడం జరిగింది. వీరు దేశవ్యాప్తంగా గల 8,697 నమోదిత ఆసుపత్రుల నెట్ వర్క్ ద్వారా వైద్య సేవలు పొందడానికి వీలు కల్పించారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు , రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్దేశిత లబ్ధిదారుల కోసం ఆరోగ్య బీమా, రక్షణ పథకాలను ప్రారంభించిన నేపథ్యంలో జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం రూపుదిద్దుకుంది. ఆరోగ్య పరిరక్షణ సామర్ధ్యం పెంపుదలకు, విస్తృతి పెంచడానికి, కవరేజ్ పెంచడానికి ఈ పథకాలన్నింటినీ విలీనం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.