ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ కేంద్ర ప్రభుత్వ రంగ పథకం ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ (ఎఐఎఫ్) ప్రగతిశీల విస్తరణకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించే సదుపాయాన్ని మరింత ఆకర్షణీయం, ప్రభావశీలం, సార్వజనీనం చేయడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.
దేశవ్యాప్తంగా రైతులోకానికి చేయూత దిశగా వ్యవసాయ మౌలిక సదుపాయాల మెరుగుదల, బలోపేతం కోసం తీసుకుంటున్న కీలక చర్యల్లో భాగంగా ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ పథకం పరిధి విస్తరణకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రకటించింది. అర్హతగల ప్రాజెక్టుల పరిధి విస్తరణ, బలమైన వ్యవసాయ మౌలిక సదుపాయాల పర్యావరణ వ్యవస్థ ప్రోత్సహించే అదనపు సహాయక చర్యలను ఏకీకృతం చేయడం ఈ కార్యక్రమాల ధ్యేయం.
ఆచరణాత్మక వ్యవసాయ ఆస్తులు: ‘వ్యవసాయ సామాజిక ఆస్తుల కల్పన ప్రాజెక్టుల’ కిందకు వచ్చే మౌలిక సదుపాయాల కల్పన దిశగా అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ పథకం వెసులుబాటు కల్పిస్తుంది. ఈ చర్యతో సామాజిక వ్యవసాయ సామర్థ్యాలను పెంచే ఆచరణాత్మక ప్రాజెక్టుల నిర్మాణం సులభమవుతుంది. తద్వారా ఈ రంగంలో ఉత్పాదకత, స్థిరత్వం మెరుగుపడతాయి.
ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు: ‘ఎఐఎఫ్’ కింద అర్హతగల కార్యకలాపాల జాబితాలో ‘ఇంటిగ్రేటెడ్ ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు’ కూడా చేరుతాయి. అయితే, దీనికింద పరిగణించబడిన నిర్దేశిత అనుబంధ ప్రాజెక్టులకు కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ పథకాల కింద తోడ్పాటు లభిస్తుంది.
పిఎం కుసుమ్-ఎ: రైతు/రైతు బృందాలు/రైతు ఉత్పాదక సంస్థలు/సహకార సంఘాలు/పంచాయతీల కోసం ‘ఎఐఎఫ్’తో ‘పిఎం-కుసుమ్’లోని ‘ఎ’ భాగాన్ని కలిపే వెసులుబాటు లభిస్తుంది. ఈ కార్యక్రమాలను ఒకేతాటిపైకి తేవడం ద్వారా వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనతోపాటు సుస్థిర, పరిశుభ్ర ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడం హం దీని లక్ష్యం.
ఎన్ఎబిసంరక్షణ్: ‘సిజిటిఎంఎస్ఇ’తోపాటు ‘ఎన్ఎబిసంరక్షణ్’ ట్రస్టీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ‘ఎఫ్‌పిఒ’ల రుణహామీ సదుపాయాన్ని విస్తరించే ప్రతిపాదన కూడా ఆమోదం పొందింది. ఈ రుణహామీ సౌలభ్యం విస్తరణ వల్ల ‘ఎఫ్‌పిఒ’ల ఆర్థిక భద్రత, రుణార్హత మెరుగుపడతాయి. తద్వారా వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో మరిన్ని పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020లో ‘ఎఐఎఫ్’ను ప్రారంభించారు. అప్పటినుంచి ఈ నిధి తోడ్పాటుతో 6623 గిడ్డంగులు, 688 శీతల గిడ్డంగులు, 21 గాదెల నిర్మాణం పూర్తయింది. దీంతో దేశవ్యాప్తంగా 500 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటి) అదనపు నిల్వ సామర్థ్యం సమకూరింది. ఇందులో 465 ‘ఎల్ఎంటి’ సాధారణ నిల్వ, 35 ‘ఎల్ఎంటి’ శీతల నిల్వ సామర్థ్యం ఏర్పడ్డాయి. దీనివల్ల ఏటా 18.6 ‘ఎల్ఎంటి’ మేర ఆహార ధాన్యాలు, 3.44 ‘ఎల్ఎంటి’ల ఉద్యాన ఉత్పత్తులు ఆదా అవుతాయి. కాగా, ‘ఎఐఎఫ్’ కింద ఇప్పటిదాకా 74,508 ప్రాజెక్టులకు రూ.47,575 కోట్లదాకా నిధులు మంజూరయ్యాయి. మరోవైపు ఈ ప్రాజెక్టులవల్ల వ్యవసాయ రంగంలో రూ.78,596 కోట్ల పెట్టుబడుల కూడా సమకూరాయి. ఇందులో రూ.78,433 కోట్లు ప్రైవేట్ సంస్థల నుంచి సమీకరించినవే కావడం విశేషం. వీటన్నిటికీ తోడు ‘ఎఐఎఫ్’ కింద మంజూరైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వ్యవసాయ రంగంలో 8.19 లక్షలకుపైగా గ్రామీణ ఉపాధి అవకాశాల సృష్టికి దోహదం చేశాయి.
తాజాగా ‘ఎఐఎఫ్’ పథకం విస్తరణతో వృద్ధికి మరింత ఊపు లభిస్తుంది. ఉత్పాదకత మెరుగుకు, వ్యవసాయ ఆదాయాల పెంపునకు, మొత్తంమీద దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సుస్థిరతకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. దేశంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల సమగ్రాభివృద్ధి ద్వారా వ్యవసాయ రంగ బలోపేతంపై ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్యలు ప్రతిబింబిస్తాయి.