బంగ్లాదేశ్ గణతంత్ర ప్రజాస్వామ్య దేశ ప్రధాని, భూటాన్ రాజ్య ప్రధాని, భారతదేశ గణతంత్ర ప్రధాన మంత్రి, రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ ప్రభుత్వ సలహాదారు, నేపాల్ ప్రధాని, శ్రీ లంక ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు, థాయ్‌లాండ్ ప్రధాని ప్రత్యేక దూత హోదాలలో గల మేమంతా 2016 అక్టోబరు 16న గోవాలో బ్రిక్స్-బిమ్స్ టెక్ అవుట్ రీచ్ సమిట్ లో సమావేశమయ్యాము.
మహా మాననీయులైన థాయ్‌లాండ్ రాజు శ్రీ భూమిబోల్ అదుల్యాదేజ్ మృతిపై మా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాము. ప్రపంచ ప్రగతికి ఆయన అందించిన సహకారాన్ని ఐక్యరాజ్యసమితి తన ఒకటో మానవాభివృద్ధి జీవిత సాఫల్య పురస్కారం ద్వారా ఏనాడో గుర్తించింది. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ రాచ కుటుంబానికి, ప్రజలకు, ప్రభుత్వానికి మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాము.
బ్రిక్స్, బిమ్స్ టెక్ నాయకుల సమన్వయ సదస్సుకు హాజరయ్యే అవకాశం కల్పించడంపై మా హర్షాన్ని తెలియజేస్తున్నాము. పరస్పర ప్రయోజనాల పైన, ప్రాముఖ్యం గల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల పైన చర్చలకు, మా అభిప్రాయాల ఆదాన ప్రదానానికి ఈ సదస్సు వీలు కల్పించింది. దీంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా నిర్దేశిస్తున్న ఐక్యరాజ్యసమితి-2030 కార్యక్రమంపైనా మేము చర్చించుకొనే వెసులుబాటు కలిగింది. ఈ సంయుక్త సమావేశం వల్ల రెండు కూటములలోని దేశాల నడుమ నమ్మకం, అవగాహన ఇనుమడించగలవని మేము విశ్వసిస్తున్నాము. అంతేకాక, పరస్పర ప్రయోజనాల దిశగా మరింత సహకారానికి దోహదపడుతుందని కూడా భావిస్తున్నాము.
ఈ సందర్భంగా బ్యాంకాక్ తీర్మానం-1997 నిర్దేశిస్తున్న సూత్రావళిని గుర్తుచేసుకుంటున్నాము. అలాగే సార్వభౌమ సమత్వం, ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వాతంత్ర్యం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యరాహిత్యం, శాంతియుత సహజీవనం, పరస్పర ప్రయోజనాలు ప్రాతిపదికగా బిమ్స్ టెక్ కూటమిలో అంతర్గత సహకారం పరిఢవిల్లుతుందని పునరుద్ఘాటిస్తున్నాము.
బ్యాంకాక్ తీర్మానం-1997 నిర్దేశించిన మేరకు బిమ్స్ టెక్ ఉద్దేశాలను, లక్ష్యాలను సాధించేందుకు మా కృషిని ముమ్మరం చేస్తామని అంగీకరిస్తున్నాము. నిర్దేశిత ప్రాధాన్య రంగాలలో పరస్పర ప్రయోజనకర సహకారం ద్వారా సామాజిక, ఆర్థికాభివృద్ధిని సాధించగల శక్తి సామర్థ్యాలు బిమ్స్ టెక్ కు ఉన్నాయని కూడా మేము స్పష్టం చేస్తున్నాము. బిమ్స్ టెక్ ను మరింత బలోపేతమూ, ప్రభావవంతమూ చేసి, ఫలితాలను రాబట్టగలిగిందిగా రూపొందించేందుకు సమష్టిగా పనిచేస్తామని ప్రతినబూనుతున్నాము.
నేపిడాలో 2014 మార్చి 4నాటి బిమ్స్ టెక్ మూడో శిఖరాగ్ర సదస్సు తీర్మానాన్ని మేము జ్ఞప్తికి తెచ్చుకొంటున్నాము. బంగాళాఖాతం సముద్ర తీర ప్రాంతంలో ప్రాంతీయ సహకారాన్ని ప్రోత్సహించే సంస్థగా బిమ్స్ టెక్ చిత్తశుద్ధిని మరోసారి చాటుతున్నాము. మన భౌగోళిక సాన్నిహిత్యం, సమృద్ధమైన సహజ వనరులు, పుష్కలమైన మానవ వనరులు, సుసంపన్న చారిత్రక సంధానం, సాంస్కృతిక వారసత్వ భాగస్వామ్యం వంటివి ఈ ప్రాంతంలో శాంతికి, సుస్థిరతకు, సమృద్ధికి బిమ్స్ టెక్ ను ఒక ఆదర్శప్రాయ వేదికగా మలుస్తున్నాయని మేము గుర్తించాము.
ఈ ప్రాంతంలో శాంతికి, సుస్థిరతకు చెప్పుకోదగ్గ ఏకైక ముప్పు ఉగ్రవాదమే అని గుర్తిస్తున్నాము. తదనుగుణంగా వివిధ రకాలు, స్వరూపాలు గల ఈ మహమ్మారిపై పోరాటానికి మా దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నాము. కారణాలు ఏవైనా, ఉగ్రవాద చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కావు. ఈ ప్రాంతంలో ఇటీవలి పాశవిక ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉగ్రవాదంపై పోరాటం అంటే ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు, వాటి అనుసంధాన వ్యవస్థల విచ్ఛిన్నం, నిర్మూలన మాత్రమే కాదని మేము బలంగా విశ్వసిస్తున్నాము. దాంతోపాటు ఉగ్రవాదాన్ని సమర్థించే, ఆర్థిక- హార్దిక మద్దతునిచ్చే, ఆశ్రయం కల్పించే, వాటి దుశ్చర్యలను ఘనతగా కీర్తించే దేశాలను గుర్తించడంతో పాటు వాటిని జవాబుదారు చేసి, కఠిన చర్యలు తీసుకోవలసివుంటుందని స్పష్టం చేస్తున్నాము. ఉగ్రవాదులు హతమైనప్పుడు వారిని అమరులుగా కొనియాడరాదు. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, దుర్బోధలతో తప్పుదోవ పట్టించడం వంటివి విస్తరించడాన్ని అరికట్టడంతో పాటు నిరోధానికి తక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని గుర్తిస్తున్నాము. మన కూటమి దేశాలలోని చట్టాల అమలు సంస్థలు, నిఘా విభాగాలు, భద్రత సంస్థల మధ్య సహకారం, సమన్వయాల విస్తరణకు పటిష్ఠ చర్యలను ముమ్మరం చేసే దిశగా మా దృఢ సంకల్పాన్ని ప్రకటిస్తున్నాము.
నేర వ్యవహారాలలో పరస్పర సహాయ సహకారాలపై బిమ్స్ టెక్ సదస్సు తీర్మానం మీద సంతకాల ప్రక్రియను వేగవంతం చేయడానికి కట్టుబడి ఉన్నాము. అలాగే అంతర్జాతీయ ఉగ్రవాదంపై, బహుళజాతీయ వ్యవస్థీకృత నేరాలపై, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోరుకు సహకారంపై బిమ్స్ టెక్ సదస్సు తీర్మానం సత్వర ఆమోదానికీ కృషిచేస్తాము.
భూగోళానికి పెరుగుతున్న వాతావరణ మార్పు ముప్పు గురించి మాకు సంపూర్ణ అవగాహన ఉంది. ప్రత్యేకించి బంగాళాఖాతం సముద్ర తీరప్రాంత దేశాల ప్రజలు, జీవనోపాధిపై పెను ప్రభావం చూపుతుందని మాకు తెలుసు. అందుకే పర్యావరణ రక్షణ, సంరక్షణలకు సహకారాన్ని బలోపేతం చేయాలని తీర్మానించుకున్నాము. సుస్థిర అభివృద్ధి సాధన కృషితో పాటు పారిస్ వాతావరణ సదస్సు ఒప్పందాన్ని జాతీయ, ప్రాంతీయ స్థాయిలలో అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాము.
విపత్తులను ఎదుర్కోవడంలో సంయుక్త కసరత్తు రూపేణా సన్నిహిత సహకారాన్ని ప్రోత్సహిస్తాము. ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు సహా సమాచార ఆదాన ప్రదానం, ముందు జాగ్రత్త చర్యలు, సహాయ-పునరావాస కార్యక్రమాలలో ఉమ్మడి కార్యాచరణ, సామర్థ్య నిర్మాణం వంటి అంశాలలో ఈ సహకారం అవశ్యం. ప్రస్తుత సామర్థ్యాలను మెరుగుపరచుకోవడంతో పాటు ఈ రంగంలోని ఇతర ప్రాంతీయ సంస్థలతో, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటుకు గల అవకాశాలను అన్వేషించేందుకు అంగీకరిస్తున్నాము.
ప్రాంతీయ సమగ్రతను ప్రోది చేయడంలో వివిధ రకాల, మార్గాల అనుసంధానాన్ని అభివృద్ధి చేసుకోవడం కీలకమన్న అంశంతో ఏకీభవిస్తున్నాము. బిమ్స్ టెక్ ప్రాంతంలో బహువిధ భౌగోళిక అనుసంధానం (రైలు, రహదారి, జల, విమాన మార్గాల) కోసం సాగుతున్న నిరంతర కృషి, చర్యలపై మేము సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాము. ఈ మేరకు బిమ్స్ టెక్ రవాణా మౌలిక సదుపాయాలు, రవాణా అధ్యయనం సిఫారసుల అమలులో ప్రగతి పైనా సంతృప్తి వ్యక్తమవుతోంది. అలాగే బిమ్స్ టెక్ మోటారు వాహనాల ఒప్పందాన్ని కుదుర్చుకొనేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించేందుకు కూడా అంగీకరిస్తున్నాము.
సుస్థిర వ్యవసాయం, ఆహారభద్రతలపై మా కట్టుబాటును పునరుద్ఘాటిస్తున్నాము. వ్యవసాయ రంగంలో సహకార విస్తృతికి సమ్మతిస్తున్నాము. అంతే కాదు, ఈ ప్రాంతంలో పంటలు, పశుసంపద, ఉద్యాన రంగాలు సహా ఉత్పాదకత, వ్యవసాయ దిగుబడుల పెంపు దిశగా సహకారాత్మక కృషిని ముమ్మరం చేస్తాము.
ప్రపంచంలోని మత్స్యకారులలో 30 శాతం బంగాళాఖాతం సముద్ర తీరప్రాంతంలోనే ఉన్నందువల్ల మత్స్య పరిశ్రమ సుస్థిర అభివృద్ధికి పరస్పర సహకారం అవసరాన్ని గుర్తించాము. ఈ ప్రాంతంలో ఆహార భద్రతకు ఈ పరిశ్రమ గణనీయంగా భరోసా ఇవ్వగలదు. దీంతోపాటు మా ప్రాంత ప్రజానీకం జీవనోపాధి మార్గాలు మెరుగుపడతాయి. కాబట్టి ఈ రంగంలో సహకార విస్తృతికి అంగీకారం తెలుపుతున్నాము.
మా ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగల నీలి ఆర్థిక వ్యవస్థ అపార సామర్థ్యం గురించి మాకు తెలుసు. ఈ దిశగా మరింత లోతుగా సహకరించుకోవడానికి అంగీకారం తెలుపుతున్నాము. ఆ మేరకు భూ, తీర ప్రాంతాల్లో జల సాగు, సముద్రాధ్యయనం, సముద్రాంతర ఖనిజాన్వేషణ, తీరప్రాంత నౌకా రవాణా, పర్యావరణ పర్యాటకం, పునరుత్పాదక సముద్ర ఇంధనం తదితరాలకు సహకరించుకొంటాము. మా ప్రాంత సుస్థిర, సంపూర్ణాభివృద్ధికి పరస్పరం తోడ్పాటును అందించుకుంటాము. అలాగే, పర్వత ప్రాంతాల నుండి లభించే ప్రయోజనాలు సుస్థిర అభివృద్ధికి కీలకమన్న అవగాహన మాకుంది. తదనుగుణంగా పర్వత ప్రాంతాలలో జీవ వైవిధ్యంతో పాటు పర్వత సంబంధి పర్యావరణ వ్యవస్థల పరిరక్షణకు మరింతగా కృషి చేయాలని భావిస్తున్నాము.
బిమ్స్ టెక్ సభ్య దేశాల మధ్య ఇంధన రంగంలో సహకారం విస్తృతం కావడాన్నిస్వాగతిస్తున్నాము. విద్యుత్‌జాల వ్యవస్థల పరస్పర సంధానం కోసం బిమ్స్ టెక్ అవగాహన ఒప్పందంపై సంతకాల ప్రక్రియను వేగిరపరచాలని నిర్ణయించాం. అలాగే బిమ్స్ టెక్ విద్యుత్ కేంద్రం వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మా యంత్రాంగాలను ఆదేశిస్తున్నాము. మా ప్రాంతంలో ఇంధన వనరులు.. ప్రత్యేకించి పునరుత్పాదక, పరిశభ్ర వనరుల సామర్థ్యం గురించి మాకు ఎరుకే. అందువల్ల ఇంధన సహకారం దిశగా సమగ్ర ప్రణాళికను రూపొందించే కృషిని వేగవంతం చేయాలని అంగీకారానికి వచ్చాము. దీనివల్ల పరస్పర సంధానం వేగిరం కావడంతో పాటు ప్రాంతీయ ఇంధన వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుంది.
బిమ్స్ టెక్ స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతంపై సంప్రదింపులను త్వరగా ముగించేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి ప్రకటిస్తున్నాము. దీనికి సంబంధించిన ఒప్పందాలను ఖరారు చేసే ప్రక్రియను వేగిరపరచాలని వాణిజ్య సంప్రదింపుల కమిటీ (టి ఎన్ సి)తో పాటు కార్యాచరణ బృందాలను ఆదేశిస్తున్నాం. అలాగే సేవలు, పెట్టుబడులపైనా ఒప్పందాలపై సంప్రదింపులను వేగిరం చేయాలని టి ఎన్ సి ని ఆదేశించాం. వాణిజ్య సౌలభ్యానికి పటిష్ఠ చర్యలు తీసుకొనేందుకు అంగీకరించాము. కనీస అభివృద్ధికి పరిమితమైన దేశాలు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యేందుకు వీలుగా ప్రత్యేక, విభిన్న ప్రాధాన్యం ఇచ్చేందుకూ అంగీకరించాము.
ఈ ప్రాంతంలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు సహా వివిధ రంగాలలో సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, అందుబాటు, లభ్యతల అవసరాన్ని గుర్తించాము. అందుకే శ్రీ లంకలో బిమ్స్ టెక్ సాంకేతికత బదిలీ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందం సత్వర ఖరారుకు ఆదేశించాము.
ప్రజారోగ్య సమస్యల పరిష్కరానికీ సమష్టి కృషి కొనసాగించాలని నిర్ణయించాము. తదనుగుణంగా బిమ్స్ టెక్ నెట్‌వర్క్‌లోని సంప్రదాయ వైద్య జాతీయ సమన్వయ కేంద్రాలను, వాటి కార్యాచరణ బృందాలను ఈ రంగంలో సహకార విస్తృతికి ఆదేశించాము.
ఈ ప్రాంతవ్యాప్తంగా లోతైన అవగాహన సృష్టికి దృఢ సంకల్పంతో ఉన్నాము. ఇందుకోసం సభ్య దేశాల్లోని ప్రజల మధ్య వివిధ స్థాయిలలో పరస్పర సంబంధాలను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాము. ఈ దిశగా ఇప్పటికే బిమ్స్ టెక్ లోని విధాన మేధోసంస్థల నెట్‌వర్క్ వ్యవస్థ (బి ఎన్ పి టి టి) రెండు సమావేశాలను నిర్వహించడంపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాము. సభ్యత్వ దేశాలలోని ప్రజల మధ్య సంబంధాలు ఇనుమడించే విధంగా సంబంధిత భాగస్వాములతో తరచూ సంప్రదింపులు, ఇతర కార్యక్రమాలను నిర్వహించేలా బి ఎన్ పి టి టి ని ప్రోత్సహిస్తున్నాము. అలాగే మా దేశాలలోని విద్య, పరిశోధన సంస్థల మధ్య సంబంధాలను విస్తృతపరిచేందుకు అంగీకరించాము.
మా ప్రాంతాల మధ్య నాగరిక, చారిత్రక, సాంస్కృతిక సంబంధాల గురించి మాకు చక్కగా తెలుసు. దీనివల్ల పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని కూడా గుర్తించాము. ఆ మేరకు బిమ్స్ టెక్ దేశాల మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు… ప్రత్యేకించి పర్యాటక వలయాలు, పర్యావరణ పర్యాటకంపై దృష్టితో పటిష్ఠ చర్యలు తీసుకోవడంపై ఆసక్తితో ఉన్నాము. ఈ ప్రాంతంలో బౌద్ధ పర్యాటక వలయాలు, ఆలయ పర్యాటక వలయాల అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తాము.
భూటాన్‌లో బిమ్స్ టెక్ సాంస్కృతిక పరిశ్రమల కమిషన్, బిమ్స్ టెక్ సాంస్కృతిక పరిశ్రమల పరిశీలన కేంద్రాల ఏర్పాటును వేగిరపరచాలని నిర్ణయించాము. ఇవి సాంస్కృతిక పరిశ్రమల సంబంధిత సమాచారానికి భాండాగారాలుగా ఉపయోగపడతాయి. బిమ్స్ టెక్ పేదరిక నిర్మూలన కార్యాచరణ ప్రణాళిక అమలుకు మా కట్టుబాటును పునరుద్ఘాటిస్తున్నాము. నేపాల్‌లో 2012 జనవరిలో నిర్వహించిన బిమ్స్ టెక్ మంత్రుల స్థాయి రెండో సమావేశంలో పేదరిక నిర్మూలనపై ప్రణాళికను ఆమోదించగా, మయన్మార్‌లో 2014 మార్చిలో నిర్వహించిన బిమ్స్ టెక్ మూడో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా దీనికి అంగీకారం తెలిపాము.
ఢాకాలో ఏర్పాటు చేసిన బిమ్స్ టెక్ శాశ్వత సచివాలయం 2014 సెప్టెంబరు నుండి కార్యకలాపాలు నిర్వహించడంపై సంతృప్తితో ఉన్నాము. ఈ సచివాలయం ఇంత త్వరగా కార్యరంగంలో దిగేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అందించిన సహకారాన్ని ప్రశంసిస్తున్నాము. ఇక 2017ను బిమ్స్ టెక్ 20వ వ్యవస్థాపన సంవత్సరంగా గుర్తిస్తున్నాము. ఈ ద్విదశాబ్ద వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాల, ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికను సిద్ధం చేయాలని, తదనుగుణంగా దానిని అమలు చేయాలని సచివాలయాన్ని ఆదేశిస్తున్నాము.
బిమ్స్ టెక్ స్థాయిలో ప్రాంతీయ సహకారం ప్రభావవంతంగా ఉండాల్సిన ఆవశ్యకతను పునరుద్ఘాటిస్తూ- కూటమిలోని అన్ని యంత్రాంగాలు నిర్దేశిత స్థాయిలలో సకాలంలో సమావేశాలు నిర్వహించేలా చూసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంటున్నాము.
బ్రిక్స్- బిమ్స్ టెక్ సమన్వయ సదస్సుకు బిమ్స్ టెక్ దేశాల నాయకులను ఆహ్వానించడంలో భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చూపిన చొరవకు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీ లంక, థాయ్‌లాండ్ ల నాయకులమైన మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అంతేకాక, అద్భుత ఏర్పాట్లతో పాటు అమోఘమైన ఆదరణ, ఆతిథ్యం లభించడం విశేషించి హర్షణీయం.
నేపాల్‌లో 2017లో నిర్వహించబోయే బిమ్స్ టెక్ నాలుగో శిఖరాగ్ర సమావేశంలో మళ్లీ కలుసుకోవడం కోసం ఇక వేచి ఉంటాము.