వంద మందికి పైగా ‘‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’’ లబ్దిదారులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా లబ్దిదారులు అంతక్రితం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఆతిథేయిగా వ్యవహరించిన ఎల్‌పిజి పంచాయత్ లో పాలుపంచుకోవడం కోసం న్యూ ఢిల్లీ కి తరలివచ్చారు.
ఎల్‌పిజి సిలిండర్ల వినియోగం తమ జీవితాలను ఏ విధంగా మెరుగు పరచిందీ లబ్ధిదారులు శ్రీ నరేంద్ర మోదీ తో ఇష్టాగోష్టి సందర్భంగా వివరించారు. వారి దైనందిన జీవనం తాలూకు వివిధ అంశాలపై మాట్లాడవలసిందంటూ ప్రధాన మంత్రి వారిని కోరారు. వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ను సమకూర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘సౌభాగ్య యోజన’ ను తీసుకువచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆడ శిశువు పట్ల అన్ని రకాల వివక్షకు స్వస్తి పలకవలసిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టంచేశారు. తనతో భేటీ కావడానికి వచ్చిన వారు వారి యొక్క గ్రామాలలో స్వచ్ఛత పరిరక్షణ దిశగా చొరవ తీసుకోవాలని ఆయన ఉద్బోధించారు. ఇలా చేస్తే గనక- ‘ఉజ్జ్వల యోజన’ వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగు పరచినట్లే- మొత్తం పల్లెవాసుల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన చెప్పారు.
ఉజ్జ్వల యోజనను ప్రవేశపెట్టినందుకు ప్రధాన మంత్రి ని లబ్దిదారులు ప్రశంసించి, ధన్యవాదాలు తెలిపారు. లబ్ధిదారులలో కొంత మంది తాము హుషారుగా పాలుపంచుకొంటున్న రంగాలలో ఎదురవుతున్న కొన్ని ఫలానా అభివృద్ధి సంబంధిత సవాళ్ళను గురించి కూడా చర్చించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకొన్నారు.
పెట్రోలియమ్ మరియు సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు.