శ్రేష్ఠుడైన ప్రధాని శ్రీ శింజో అబే,
గౌరవనీయ అతిథులారా, సోదర సోదరీమణులారా,
కాన్‌బాన్ వా.
ప్రధాన మంత్రి గా జపాన్ లో పర్యటించేందుకు రెండో సారి రావడం నాకు దక్కిన ఒక గొప్ప గౌరవం. జపాన్ ప్రజల అంకిత భావం, హుషారు, ఉత్సాహం, జీవశక్తి ఇంకా వారు సాధించిన విజయాలను గురించి భారతదేశ వాసులు చాలా కాలం నుండి అభినందిస్తూ వచ్చారు.
జపాన్ అనుభవాలను చూసి నేర్చుకోవలసిందీ, ఆకళింపు చేసుకోవలసిందీ చాలా ఉంది. ఇండియా, జపాన్ లు సుదీర్ఘ కాలం నుండి సన్నిహిత , స్నేహ సంబంధాలును కలిగి ఉన్నాయి. మన సమాజాలు హిందూ, బౌద్ధ ఆలోచనా స్రవంతితో ముడిపడిన లోతైన అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. మనము ఆర్థిక ప్రగతికి, నాగరికతత విలువల పరిరక్షణకు మధ్య సమతూకం పాటించాల్సిన అవసరాన్ని గ్రహించిన వాళ్లమే.
మన సంబంధాలు పారదర్శకత, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనను గౌరవించడం అనే ఉమ్మడి విలువలతో దృఢతరమయ్యాయి. ఈ రోజు, మన ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ బాగస్వామ్యం నానాటికీ దగ్గరవుతున్నఆర్థిక, వ్యూహాత్మక అంశాలకు గుర్తుగా నిలుస్తోంది.
సన్నిహిత భాగస్వాములుగా మనం కలిసి చేయగలిగింది చాలా ఉంది. అది మన సమాజాలకోసం మాత్రమే కాదు, ఈ ప్రాంతానికి, మొత్తం ప్రపంచానికే మనం చేయగలిగింది ఎంతో ఉంది. మన భాగస్వామ్యం, చర్చల స్థాయి, మన ప్రాంతంలో మంచి పొరుగు దేశాలుగా మెలగడాన్ని ప్రోత్సహిస్తుంది.
ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాళ్లు , అవకాశాలకు సంబంధించి స్పందించడానికి మన సామర్థ్యాలను మిళితం చేయవచ్చు. ప్రపంచ ప్రజానీకంతో కలిసి అతివాదం, తీవ్రవాదం, ఉగ్రవాదాల ముప్పును మనం ఎదుర్కొనగలము, ఎదుర్కోవడం తప్పని సరి కూడా.
మిత్రులారా,
ఇండియా ఆర్థిక ప్రగతి పథంలో,మౌలిక సదుపాయాల అభివృద్ధిలో, సామర్థ్యాల వృద్ధిలో, సాంకేతిక పురోగతిలో జపాన్ ఎల్లప్పుడూ విలువైన భాగస్వామిగా ఉంటూ వచ్చింది. మన మధ్య సహకారం పరిధి, స్థాయి భిన్న రంగాలకు విస్తరించాయి.
మన ఆర్థిక బంధాలు మరింతగా వృద్ధి చెందనున్నాయి. వాణిజ్య బంధం వృద్ధి కొనసాగనుంది. జపాన్ నుండి పెట్టుబడులు పెరుగుతున్నాయి. మా కీలక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా జపాన్ కంపెనీలు బాగా లబ్ధి పొందనున్నాయి. ఇందుకు బదులుగా మేము సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలలో నాయకత్వ స్థానంలో ఉన్న జపాన్ నుండి ఎంతో ప్రయోజనం పొందవచ్చు.
ఉభయ దేశాల మధ్య సంబంధాలలో స్వాగతించదగిన అంశం ఏమంటే, ఇండియా లోని రాష్ట్రాలు, జపాన్‌లోని వివిధ ప్రాంతాల మధ్య సంబంధాలు, సహకారం పెరిగాయి. మా ప్రపంచ దృక్పథంలో మేం జపాన్‌కు ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సౌహార్దం, పరస్పర గౌరవాభిమానాలు వెల్లివిరిసే రీతిలో ఇవి పెరుగుతూ వస్తున్నాయి. ఇరు దేశాల ప్రజలు ఒకరికి మరొకరుగా ఉన్నారు. అంతే కాదు, శ్రేష్ఠుడైన శ్రీ అబే పటుతర నాయకత్వంలో జపాన్ ప్రజలు ముందుకు సాగుతున్నారు.
ఈరోజు నేను వీరితో జరుపుతున్న సమావేశంతో కలిపి గత రెండు సంవత్సరాలలో మేము 8 సార్లు భేటీ అయ్యాము. అనేక సత్ఫలితాలను ఇచ్చిన మా శిఖరాగ్ర సమావేశపు ఆనందోత్సాహాల సమయంలో నాకు, నా ప్రతినిధి వర్గానికి లభించిన స్వాగతం, అద్బుతమైన ఏర్పాట్లకు ప్రధాని శ్రీ అబేకు, జపాన్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మన ఆకాంక్షలు సందేహాతీతంగా ఒకదానితో మరొకటి ముడిపడ్డాయి. జపాన్ తీరపు ఒడి చేరే ఇండో – పసిఫిక్ సముద్ర జలాలే, మరోవైపు తరంగాలై భారతదేశ తీరాన్ని తాకుతుంటాయి. మనం శాంతి, అభివృద్ధి, సుసంపన్నత ల కోసం కలిసి పనిచేద్దాము.
సోదర సోదరీమణులారా,
జపాన్ చక్రవర్తి, జపాన్ చక్రవర్తి వారి సతీమణి ఆయరారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రధాని శ్రీ శింజో అబేకు, స్నేహశీలురైన జపాన్ ప్రజలకు, నేటి రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి విజయం లభించాలని నేను శుభాకాంక్షలు చెబుతూ ఈ విందులో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.
భారతదేశం- జపాన్ ల మైత్రి చిరస్థాయిగా కొనసాగాలని ఆశిస్తూ,
కన్‌పాయ్.