ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 09th, 11:00 am

నేటి నుంచి ఉత్తరాఖండ్ రజతోత్సవ సంవత్సరం మొదలవుతుంది. అంటే ఉత్తరాఖండ్ 25వ వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్రానికి ఉజ్వలమైన, జాజ్వల్యమానమైన భవిష్యత్తును నిర్మించే దిశగా అంకితభావంతో మనముందున్న వచ్చే 25 సంవత్సరాల ప్రస్థానాన్ని మనం ప్రారంభించాలి. యాదృచ్ఛికమే అయినా, సంతోషకరమైన విషయమొకటి ఇందులో ఉంది: జాతీయవృద్ధి కోసం అంకితం చేసిన 25 ఏళ్ల విశేష సమయమైన భారత అమృత్ కాల్, మనం సాధించబోయే ఈ పురోగతి ఏకకాలంలో తటస్థించబోతున్నాయి. అభివృద్ధి చెందిన భారత్‌లో అభివృద్ధి చెందిన ఉత్తరాఖండ్ భావనను ఈ కలయిక దృఢపరుస్తుంది. ఈ కాలంలో మనందరి ఆకాంక్షలు నెరవేరతాయి. ఉత్తరాఖండ్ ప్రజలు రానున్న 25 ఏళ్ల లక్ష్యాలపై దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా ఉత్తరాఖండ్ ఘనతను చాటడంతోపాటు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అనే భావన రాష్ట్ర ప్రజలందరిలో ప్రతిధ్వనిస్తుంది. దృఢ సంకల్పాన్ని స్వీకరించిన ఈ ముఖ్య సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రెండు రోజుల కిందటే ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్ విజయవంతంగా నిర్వహించారు. మన ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో గణనీయమైన పాత్ర పోషిస్తారని విశ్వసిస్తున్నాను.

దేవభూమి ఉత్తరాఖండ్ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

November 09th, 10:40 am

ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు రజతోత్సవ సంవత్సరం ఈ రోజే ప్రారంభమవుతున్నదని గుర్తు చేశారు. ఉత్తరాఖండ్ ఏర్పడి 25 వసంతాలు పూర్తవుతుండడాన్ని గుర్తుచేస్తూ... రాబోయే 25 ఏళ్ల రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని ప్రజలను శ్రీ మోదీ కోరారు. వచ్చే 25 ఏళ్ల ఉత్తరాఖండ్ ప్రస్థాన సమయానికి భారత్ అమృత కాల్ కు కూడా 25 ఏళ్లు నిండబోతుండడం శుభసూచకమన్నారు. వికసిత భారత్ లో వికసిత ఉత్తరాఖండ్ సంకల్పం నెరవేరబోతుండడాన్ని అది సూచిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వచ్చే 25 ఏళ్లకు పలు తీర్మానాలతో అనేక కార్యక్రమాలను ప్రజలు చేపట్టారని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు ఉత్తరాఖండ్‌ ఘనతను చాటుతాయని, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ ఎదిగి ఆ ఫలితాలు రాష్ట్ర ప్రజలందరికీ అందుతాయని అన్నారు. ఈ సంకల్పాన్ని స్వీకరించిన రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ‘ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్’ను గుర్తుచేసిన ప్రధాని.. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.