యుగాండా పార్లమెంట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం
July 25th, 01:00 pm
ఈ మహనీయమైన చట్ట సభ ను ఉద్దేశించి ప్రసంగించే ఆహ్వానాన్ని అందుకోవడం నాకు లభించిన అరుదైనటువంటి గౌరవంగా భావిస్తున్నాను. కొన్ని ఇతర దేశాల చట్టసభల్లోనూ ప్రసంగించే అవకాశం నాకు లభించింది; అయినప్పటికీ, ఇది మాత్రం చాలా విశిష్టమైంది. ఇటువంటి గౌరవం భారతదేశ ప్రధాన మంత్రి కి లభించడం ఇదే తొలి సారి. ఇది మా దేశం లోని 125 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప సత్కారం. వారు అందరి స్నేహపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక ఆశీస్సులను ఈ చట్ట సభ కోసం.. యుగాండా ప్రజలు అందరి కోసం నేను మోసుకొచ్చాను. గౌరవనీయురాలైన మేడమ్ స్పీకర్ గారూ, మీరు అధ్యక్ష స్థానంలో ఉండడం నాకు మా లోక్ సభ ను గుర్తుకు తెస్తోంది. అక్కడ కూడా స్పీకర్ గా ఒక మహిళ ఉండడం ఇందుకు కారణం. ఇక ఈ చట్ట సభ లో యువ సభ్యులు పెద్ద సంఖ్యలో ఉండడం కూడా చూస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి శుభకరం. నేను యుగాండా కు వచ్చినప్పుడల్లా ఈ ‘‘ఆఫ్రికా ఆణిముత్యం’’ నన్ను మంత్రముగ్ధుడిని చేస్తూనే ఉంది. ఈ గడ్డ అపార సౌందర్యానికి, గొప్ప సహజ వనరుల సంపద కు, సుసంపన్న వారసత్వానికి నిలయంగా ఉంది. ఇక్కడి నదులు, సరస్సులు ఈ అతి పెద్ద ప్రాంతం లో నాగరకత లను పెంచి పోషించాయి.