చతుర్దేశాధినేతల సమావేశం : సమాచార పత్రం

September 25th, 11:53 am

అమెరికాలోని శ్వేత సౌధంలో చతుర్దేశాధినేతల తొట్టతొలి వ్యక్తిగత శిఖరాగ్ర సమావేశంలో భాగంగా అధ్యక్షుడు బైడెన్‌ సెప్టెంబరు 24న భారత, జపాన్‌, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, యోషిహిడే సుగా, స్కాట్‌ మోరిసన్‌లకు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనడంలో ఆచరణాత్మక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం సహా స్నేహ సంబంధాల బలోపేతానికి తోడ్పడే విశిష్ట చర్యలు చేపట్టాలని అధినేతలు ఆకాంక్షించారు. ఈ మేరకు కోవిడ్‌-19 అంతం దిశగా సురక్షిత, ప్రభావశీల టీకాల ఉత్పత్తి-లభ్యత పెంపు, ఉన్నత ప్రమాణాలతో మౌలిక వసతులకు ప్రోత్సాహం, వాతావరణ మార్పు సంక్షోభ నిరోధం, ఆవిష్కరణాత్మక సాంకేతిక పరిజ్ఞానాల్లో భాగస్వామ్యం, అంతరిక్షం, సైబర్‌ భద్రత, నాలుగు దేశాల్లోనూ భవిష్యత్తరం ప్రతిభాపాటవాల వృద్ధి వంటివి ఈ చర్యలలో భాగంగా ఉన్నాయి.