సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం.. స్వయం సమృద్ధి/ఆహార భద్రత లక్ష్యంతో ‘ప్రధానమంత్రి జాతీయ వ్యవసాయాభివృద్ధి పథకం’ (పిఎం-ఆర్‌కెవివై).. ‘వ్యవసాయ దిగుబడుల పెంపు పథకాల’ (కెవి)కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

October 03rd, 09:18 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వ్యవసాయం-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలయ్యే అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలను (సిఎస్ఎస్) రెండు సాముదాయక పథకాలుగా హేతుబద్ధీకరించాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మేరకు ఐచ్ఛిక అనుసరణీయ (కెఫెటేరియా) ‘ప్రధానమంత్రి జాతీయ వ్యవసాయాభివృద్ధి పథకం’ (పిఎం-ఆర్‌కెవివై), ‘వ్యవసాయ దిగుబడుల పెంపు పథకా’ల (కెవై)కు ఆమోదముద్ర వేసింది. వీటిలో ‘పిఎం-ఆర్‌కెవివై’ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేది కాగా, ఆహార భద్రత-వ్యవసాయ స్వయం సమృద్ధికి ‘కెవై’ దోహదం చేస్తుంది. ఈ సాముదాయ పథకాల కింద వివిధ పథకాలు-కార్యక్రమాలను సాంకేతికత సద్వియోగంతో ప్రభావవంతంగా, సమర్థంగా అమలు చేస్తారు.