‘‘మూడు కొత్త నేర విచారణ చట్టాలు’’ విజయవంతంగా అమలు.. దేశానికి అంకితం చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 03rd, 12:15 pm
చండీగఢ్‌కు రావడమంటే అది నా సొంత ప్రజల మధ్యకు వచ్చినట్లు అనిపిస్తుంది. చండీగఢ్ గుర్తింపు శక్తి స్వరూపిణి చండీదేవి మాతతో జతపడి ఉంది. చండీ మాత సత్యానికి, న్యాయానికి ప్రతీక. ఇదే భావన భారతీయ న్యాయ సంహితకు, భారతీయ నాగరిక్ సురక్ష సంహితకు పునాదిగా ఉంది. దేశ ప్రజలు ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని తీసుకొని ముందుకు సాగిపోతున్న కాలంలో, మన రాజ్యాంగానికి 75 సంవత్సరాలు అయిన వేడుకలను మనం జరుపుకొంటున్న క్రమంలో రాజ్యాంగ ఆదర్శాల నుంచి ప్రేరణను పొందిన భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రావడం విజయ ప్రస్థానంలో మరో మెట్టు అని చెప్పాలి. దేశ పౌరుల కోసం మన రాజ్యాంగంలో ప్రస్తావించుకొన్న ఆదర్శాలను సాకారం చేసే దిశలో ఇది ఒక ప్రత్యేక చర్య. కొద్దిసేపటి కిందటే నేను ఈ చట్టాలు అమలవుతున్న తీరును ప్రత్యక్షంగా గమనించాను. ఈ అంశాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను న్యాయశాస్త్ర విద్యార్థులు, న్యాయవాదుల సంఘం సభ్యులు (బార్), న్యాయాధికారులు సహా అందరూ.. వారి వీలునుబట్టి చూడాల్సిందని నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహితలు ఆచరణలోకి వచ్చినందుకుగాను పౌరులందరికీ నేను నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. చండీగఢ్ పాలన యంత్రాంగంలోని వారందరినీ అభినందిస్తున్నాను.కొత్తగా తెచ్చిన మూడు నేరవిచారణ చట్టాల అమలు విజయవంతం చండీగఢ్‌లో దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి
December 03rd, 11:47 am
పెనుమార్పులతో తీసుకువచ్చిన మూడు కొత్త నేర చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్.. విజయవంతం కావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చండీగఢ్‌లో జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ... చండీదేవి మాతతో చండీగఢ్ గుర్తింపు జతపడి ఉందన్నారు. శక్తులలో ఒక రూపమే చండీదేవి, సత్యానికి, న్యాయానికి ప్రతీక చండీదేవి అని ఆయన అన్నారు. ఇవే అంశాలను ఆధారంగా చేసుకొని భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలను సమగ్రంగా రూపొందించారన్నారు. దేశ ప్రజలు... భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తి కావడాన్ని స్మరించుకొంటున్న, ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) సంకల్పంతో ముందుకు సాగిపోతున్న ఈ తరుణంలో భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రేరణను పొందిన భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రావడం ఒక గొప్ప సందర్భం అని ప్రధాని అన్నారు. దేశ పౌరుల కోసం మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను సాకారం చేసే దిశలో ఇది ఒక గట్టి ప్రయత్నమని కూడా ఆయన అన్నారు. ఈ కొత్త చట్టాలను అమలుచేస్తున్న తీరుతెన్నులపై ఒక ప్రత్యక్ష ప్రదర్శనను ఏర్పాటుచేయగా ఆ ప్రదర్శనలో కొంత భాగాన్ని తాను కాసేపటి కిందటే చూశానని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. చట్టాలు అమలవుతున్న తీరును వివరించే ఈ ప్రత్యక్ష ప్రదర్శనను చూడాల్సిందిగా ప్రజలను ప్రధానమంత్రి కోరారు. కొత్తగా తెచ్చిన మూడు నేర విచారణ చట్టాలు విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా దేశ పౌరులందరికీ ఆయన తన స్నేహపూర్వక అభినందనలు తెలిపారు. చండీగఢ్ పాలన యంత్రాంగంలో ప్రతి ఒక్కరినీ కూడా ఆయన అభినందించారు.