వెనుకబడిన వర్గాలకు రుణసాయంపై మార్చి 13న దేశవ్యాప్త విస్తృత ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
March 12th, 06:43 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి 13న సాయంత్రం 4:00 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా వెనుకబడిన వర్గాలకు రుణసాయం దిశగా నిర్వహించే దేశవ్యాప్త విస్తృత ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా ‘‘ప్రధానమంత్రి సామాజికోత్థాన-ఉపాధి ఆధారిత జనసంక్షేమ (పిఎం-సూరజ్) పథకం జాతీయ పోర్టల్‌ను ఆయన ప్రారంభిస్తారు. అదే సమయంలో దేశంలోని లక్షమంది బలహీనవర్గాల పారిశ్రామికవేత్తలకు రుణ సహాయం మంజూరు చేస్తారు. అంతేకాకుండా షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులు సహా వెనుకబడిన వర్గాలకు చెందిన వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషిస్తారు. అటుపైన ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు.