కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
December 07th, 05:52 pm
పవిత్రమైన కార్యకర్ సువర్ణ మహోత్సవం సందర్భంగా, భగవాన్ స్వామి నారాయణుని పాదాలకు వినమ్రతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురు హరి ప్రగత్ బ్రహ్మ స్వరూపమైన ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి ఈ రోజు. ఆయనకు కూడా భక్తితో నమస్కరిస్తున్నాను. పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్ చేస్తున్న నిర్విరామ కృషి, అంకిత భావం ద్వారానే భగవాన్ స్వామి నారాయణుడి బోధనలు, ప్రముఖ్ స్వామి మహరాజ్ తీర్మానాలు ఈ రోజు నిజరూపం దాలుస్తున్నాయి. లక్ష మంది వాలంటీర్లు, యువత, చిన్నారులు భాగం పంచుకుంటున్న ఈ అద్బుతమైన సాంస్కృతిక కార్యక్రమం విత్తనం, చెట్టు, ఫలం అనే భావనను అందంగా సూచిస్తోంది. నేను అక్కడ ప్రత్యక్షంగా లేనప్పటికీ, ఈ కార్యక్రమ ఉత్సాహాన్ని, శక్తినీ నా హృదయం అనుభూతి చెందుతోంది. ఇంత గొప్ప దైవిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, మహనీయులైన సాధువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వినయంగా నమస్కరిస్తున్నాను.అహమదాబాద్ లో కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 07th, 05:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్‌లో ఏర్పాటైన కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మొదట పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, ఆరాధనీయులైన సాధు సంతులకు, సత్సంగి కుటుంబ సభ్యులకు, ఇతర ప్రముఖులకు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ చరణాలకు శ్రీ మోదీ ప్రణామాన్ని ఆచరించారు. ఈ రోజు ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి సందర్భం కూడా అని ప్రధాని గుర్తుకు తీసుకువచ్చారు. భగవాన్ స్వామి నారాయణ్ ప్రబోధాలు, ప్రముఖ్ స్వామి మహారాజ్ సంకల్పాలు పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్ కఠోర శ్రమతో, అంకితభావం తో నెరవేరుతున్నాయని కూడా శ్రీ మోదీ అన్నారు. సుమారు ఒక లక్షమంది కార్యకర్తలతోపాటు యువతీయువకులు, బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇదెంత భారీ కార్యక్రమమో చెప్పకనే చెబుతోందని, దీనిని చూడడం తనకు సంతోషాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు. తాను సభాస్థలిలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఈ కార్యక్రమంలో ఉత్సాహాతిరేకం ఏ స్థాయిలో వెల్లువెత్తుతోందీ తనకు తెలుస్తూనే ఉందన్నారు. పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, సాధువులందరికీ ఈ భవ్య దివ్య కార్యక్రమానికిగాను ఆయన తన అభినందనలను అందజేశారు.