పోర్చుగల్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

November 19th, 06:08 am

బ్రెజిల్ లోని రియో డి జనీరో లో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా పోర్చుగల్ ప్రధాని శ్రీ లుయిస్ మోంటెనెగ్రో తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఇది ఈ నేతలిద్దరికి తొలి సమావేశం. గత ఏప్రిల్ లో పదవీ బాధ్యతలను చేపట్టిన శ్రీ మోంటెనెగ్రోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భారతదేశానికి, పోర్చుగల్ కు మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి, విస్తరింపచేసుకోవడానికి కలసి పని చేయాలని శ్రీ మోదీ అన్నారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన శ్రీ నరేంద్ర మోదీకి శ్రీ మోంటెనెగ్రో అభినందనలు తెలియజేశారు.