కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణ హామీ పథకం (ఎల్జీఎస్‌సీఏఎస్).. అత్యవసర దశలవారీ రుణ పథకం (ఈసీఎల్జీఎస్) మూలనిధి పెంపుపై మంత్రిమండలి ఆమోదం
June 30th, 06:57 pm
కోవిడ్-19 రెండోదశ ఫలితంగా దెబ్బతిన్న వివిధ రంగాలు… ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ఆదుకునే దిశగా ప్రభుత్వం చొరవ చూపింది. ఈ మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి “కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణ హామీ పథకం” (ఎల్జీఎస్‌సీఏఎస్) అమలుకు ఆమోదం తెలిపింది. దీంతో వైద్య/ఆరోగ్య మౌలిక వసతుల కల్పనలో హరిత (గ్రీన్‌ఫీల్డ్) ప్రాజెక్టులకు, ప్రస్తుత సదుపాయాల విస్తరణ సంబంధిత (బ్రౌన్‌ఫీల్డ్) ప్రాజెక్టులకు ఆర్థిక సహాయంపై రుణహామీ ఇవ్వడం కోసం రూ.50,000 కోట్లదాకా నిధులు సమకూర్చే వీలు కలుగుతుంది. అంతేగాక మెరుగైన ఆరోగ్య సంరక్షణతో ముడిపడినవి సహా ఇతర రంగాలు/రుణ ప్రదాతల కోసం మరో పథకాన్ని ప్రవేశపెట్టడానికి కూడా మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించి భవిష్యత్ పరిస్థితులపై ఆధారపడి కాలక్రమంలో సమగ్ర విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. దీనికి అదనంగా “అత్యవసర దశలవారీ రుణ పథకం” (ఈసీఎల్జీఎస్) కింద రూ.1,50,000 కోట్లదాకా నిధులు సమకూర్చడానికి కూడా కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.