ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవకుండా సాయమందించే పీఎం-విద్యాలక్ష్మి పథకానికి కేబినెట్ ఆమోదం
November 06th, 03:14 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎం విద్యాలక్ష్మి పథకానికి ఆమోద ముద్ర వేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకుండా ఈ నూతన కేంద్ర ప్రభుత్వం పథకం సహకారం అందిస్తుంది. జాతీయ విద్యా విధానం-2020 నుంచి ఆవిర్భవించిన మరో ముఖ్యమైన కార్యక్రమమే ఈ పీఎం విద్యాలక్ష్మి పథకం. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసరమైన ఆర్థికసాయాన్ని ఈ పథకం అందిస్తుంది. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉన్నత విద్యా సంస్థ (క్యూహెచ్ఐఈలు)ల్లో ప్రవేశం సాధించిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు, కోర్సుకు సంబంధించిన ఇతర ఖర్చులకు అయ్యే పూర్తి మొత్తాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి హామీ రహిత రుణం పొందేందుకు అర్హులు. సరళమైన, పారదర్శకమైన పూర్తి స్థాయి డిజిటల్ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తారు.