హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు 2024లో ప్రధాని ప్రసంగానికి అనువాదం

November 16th, 10:15 am

వందేళ్ల క్రితం, పూజనీయ బాపూజీ హిందూస్థాన్ టైమ్స్‌ను ప్రారంభించారు. ఆయన గుజరాతీ మాట్లాడతారు. వందేళ్ల తర్వాత మరో గుజరాతీని మీరు ఇక్కడకు ఆహ్వానించారు. హిందూస్థాన్ టైమ్స్‌కు, ఈ వందేళ్ల చారిత్రక ప్రయాణంలో ఈ పత్రికతో కలసి పనిచేసిన వారికి, అభివృద్ధిలో భాగస్వాములైనవారికి, సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ అభినందనలకు, గౌరవానికి వీరంతా అర్హులు. వందేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ గుర్తింపునకు మీరంతా అర్హులు, మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి రాగానే, ఈ కుటుంబ సభ్యులను నేను కలుసుకున్నాను. వందేళ్ల ప్రయాణాన్ని (హిందూస్థాన్ టైమ్స్) తెలియజేసే ప్రదర్శనను సందర్శించాను. మీకు సమయం ఉంటే, ఇక్కడి నుంచి వెళ్లే ముందు దాన్ని సందర్శించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అది ప్రదర్శన మాత్రమే కాదు. ఓ అనుభవం. నా కళ్ల ముందే వందేళ్ల చరిత్ర నడయాడిన అనుభూతికి నేను లోనయ్యాను. భారత దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన రోజు, రాజ్యాంగం అమల్లోకి వచ్చన నాటి పత్రికలను నేను చూశాను. మార్టిన్ లూథర్ కింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజపేయి, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వంటి విశిష్ట వ్యక్తులు హిందూస్థాన్ టైమ్స్‌లో వ్యాసాలు రాసేవారు. వారి రచనలు పత్రికను సుసంపన్నం చేశాయి. నిజంగా మనం చాలా దూరమే ప్రయాణించాం. స్వాంతంత్య్రం సాధించడానికి చేసిన పోరాటం నుంచి, స్వాంతంత్య్రం అనంతరం సరిహద్దులు లేని ఆశల తరంగాలను చేరుకోవడం వరకు చేసిన ప్రయాణం అద్భుతం, అసాధారణం. అక్టోబర్ 1947లో కశ్మీర్ భారత్‌లో విలీనమైన తర్వాత ప్రతి పౌరుడూ అనుభవించిన ఉత్సాహాన్ని మీ వార్తా పత్రిక ద్వారా తెలుసుకున్నాను. సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఏడు దశాబ్దాలుగా కశ్మీర్లో హింస ఎలా చెలరేగిందో కూడా తెలుసుకోగలిగాను. గతానికి భిన్నంగా జమ్ము కశ్మీర్లో రికార్డు స్థాయిలో జరిగిన పోలింగ్‌కు సంబంధించిన వార్తలను ఈ రోజు మీ పత్రికలో ప్రచురిస్తున్నారు. పత్రిక మరో పేజీ కూడా పాఠకుల దృష్టిని ఆకర్షించింది. ఒక వైపు అస్సాంను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారన్న వార్తను ప్రచురిస్తే, మరో పక్క అటల్‌జీ బీజేపీకి పునాది వేశారన్న వార్త ప్రచురించారు. ఈ రోజు అస్సాంలో శాశ్వతంగా శాంతిని నెలకొల్పడంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించడం కాకతాళీయమే.

న్యూఢిల్లీలో ‘2024- హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్’ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

November 16th, 10:00 am

న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన ‘2024-హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్’ నుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వందేళ్ల కిందట జాతి పిత మహాత్మా గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన హిందుస్థాన్ టైమ్స్ పత్రిక, నూరేళ్ళ చారిత్రాత్మక ప్రయాణం పూర్తిచేసినందుకు పత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. తొలినాళ్ళ నుంచీ పత్రికతో అనుబంధం కలిగిన వారిని అభినందిస్తూ, వారికి అన్ని విధాలా శుభం చేకూరాలని ఆకాంక్షించారు. పత్రిక శతాబ్ది వేడుకల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక ప్రదర్శనను తిలకించిన శ్రీ మోదీ, అద్భుతమైన ఈ ప్రదర్శనను ప్రతినిధులందరూ తప్పక సందర్శించాలని సూచించారు. భారత్ కు స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భం, రాజ్యాంగం అమలు… మొదలైన అలనాటి చారిత్రక ఘట్టాలకు సంబంధించిన పాత ప్రతులను చూసే అవకాశం కలిగిందన్నారు. మార్టిన్ లూథర్ కింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజపేయి, డాక్టర్ ఎం ఎస్ స్వామినాథన్ వంటి లబ్ధ ప్రతిష్ఠులు హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు వ్యాసాలు రాసేవారని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర పోరు నాటి పరిస్థితులకు, అనంతర కాలంలోని ఆశలూ ఆకాంక్షలకు ప్రత్యక్షసాక్షిగా నిలిచిన పత్రిక ప్రయాణం అద్భుతమనదగ్గదని అన్నారు. అక్టోబర్ 1947లో భారతదేశంలో కాశ్మీర్ విలీనానికి సంబంధించిన వార్తను తానూ మిగతా దేశవాసులతో కలిసి అబ్బురంగా చదివానని శ్రీ మోదీ నెమరువేసుకున్నారు. నిర్ణయం తీసుకోవడంలో అసంగదిగ్ధత కాశ్మీర్ ను ఏ విధంగా ప్రతికూలంగా ప్రభావితం చేసిందో ఆ క్షణం తనకు అవగతమైందని, ఏడు సుదీర్ఘ దశాబ్దాల పాటు కాశ్మీర్ హింసను ఎదుర్కొనవలసి వచ్చిందని అన్నారు. ఇప్పటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, ఇప్పుడు జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో రికార్డు సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం గురించి వార్తల ప్రచురణ తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. తనని ఆకర్షించిన మరో వార్త గురించి చెబుతూ, వార్తా పత్రిక ఒకవైపు పుటలో అస్సాం ను సమస్యాత్మక ప్రాంతంగా ప్రకటించిన వార్త ప్రచురితమవగా, మరోవైపు భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజపేయి శంకుస్థాపనకు సంబంధించిన వార్త ప్రచురితమైందని వెల్లడించారు. నేడు అస్సాంలో సుస్థిర శాంతిని నెలకొల్పేందుకు అదే బీజేపీ కీలక భూమిక పోషిస్తూండడం తనకు ఆనందం కలిగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

ఇసంజీవని ఏప్ ద్వారా 10 కోట్ల టెలి-కన్సల్టేశన్స్ స్థాయి ని చేరుకోవడాన్ని అభినందించిన ప్రధాన మంత్రి

February 17th, 11:20 am

ఇసంజీవని ఏప్ లో టెలి-కన్ సల్టేశన్ లు 10 కోట్ల మైలురాయి ని చేరుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసల ను వ్యక్తం చేశారు.