2024 సీజన్ కోసం ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధరకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
December 27th, 03:38 pm
ఎండు కొబ్బరికి 2024 సీజన్‌లో చెల్లించే కనీస మద్దతు ధరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. సాగుదారులకు లాభదాయకమైన ధరలను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో ప్రకటించింది.పంట ఉత్పత్తికి జాతీయ స్థాయిలో నిర్ణయించిన వెయిటెడ్ ఉత్పత్తి వ్యయంకి మించి కనీసం 1.5 రెట్లు ఎక్కువగా కనీస మద్దతు ధర నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొబ్బరి నూనె తయారు చేయడానికి ఉపయోగించే ఎండు కొబ్బరికి 2024 సీజన్‌లో క్వింటాల్‌కు రూ.11,160 కనీస ధరగా నిర్ణయించారు. కురిడి కొబ్బరి కాయకు చెల్లించే కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.12,000/-గా నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు నూనె తీయడానికి ఉపయోగించే కొబ్బరిపై 51.84 శాతం, కురిడి పై 63.26 శాతం మార్జిన్ లభిస్తుంది. జాతీయ స్థాయిలో నిర్ణయించిన వెయిటెడ్ ఉత్పత్తి వ్యయం తో పోల్చి చూస్తే ఇది1.5 రెట్లు ఎక్కువ. ఎండు కొబ్బరిని నూనెను తీయడానికి ఉపయోగిస్తారు. బంతి ఆకారంలో ఉండే కురిడి కొబ్బరికాయను డ్రై ఫ్రూట్‌గా , మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఎండు కొబ్బరి ఉత్పత్తి లో కేరళ, తమిళనాడు అగ్రస్థానంలో ఉన్నాయి. కురిడి కొబ్బరి ప్రధానంగా కర్ణాటకలో ఉత్పత్తి అవుతోంది.