బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ

November 20th, 08:05 pm

రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాకియో లూలా ద సిల్వా తో సమావేశమయ్యారు. శ్రీ లూలా ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని, జి-20, ఐబీఎస్ఏ (భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా కూటమి) అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు. పేదరికం, క్షుద్బాధల నిర్మూలన కోసం ప్రపంచ స్థాయి సహకార సమితిని ప్రారంభించాలన్న శ్రీ లూలా యోచన పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీ మోదీ, సంస్థకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని వెల్లడించారు. మూడు దేశాల జి-20 ప్రత్యేక బృందం (ట్రోయికా) సభ్య దేశంగా బ్రెజిల్ జి-20 ఎజెండాకు శ్రీ మోదీ సంపూర్ణ మద్దతును తెలిపారు. జి-20 కార్యాచరణ పత్రంలో సుస్థిరాభివృద్ధి, ప్రపంచ పాలనలో సంస్కరణలు వంటి లక్ష్యాలను పేర్కొనడం సహా అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు ప్రాముఖ్యాన్నివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే యేడాది బ్రెజిల్ చేపట్టనున్న ‘బ్రిక్స్’ సదస్సు, ‘కాప్-30’ అధ్యక్ష బాధ్యతలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ మోదీ, బ్రెజిల్ కు భారత్ సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.