
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 28th, 09:36 pm
నేడు దేవభూమి యువశక్తితో మరింత దివ్యంగా మారింది. బాబా కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగామాత ఆశీస్సులతో జాతీయ క్రీడలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఏడాది ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది యువత తమ సత్తా చాటబోతున్నారు. ఎంతో అందమైన ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఈసారి కూడా అనేక స్వదేశీ సంప్రదాయ క్రీడలను జాతీయ క్రీడల్లో చేర్చారు. ఈసారి జాతీయ క్రీడలు ఒక రకంగా హరిత క్రీడలు కూడా. ఇందులో పర్యావరణ హితమైన వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జాతీయ క్రీడల్లో అందుకునే పతకాలు, ట్రోఫీలన్నీ కూడా ‘ఇ-వ్యర్థాల‘తో తయారైనవే. పతకాలు సాధించిన క్రీడాకారుల పేరిట ఇక్కడ మొక్కలను కూడా నాటనున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తూ ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన క్రీడోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ ధామికి, వారి బృందానికి, ఉత్తరాఖండ్ లోని ప్రతి పౌరుడికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతులమీదుగా డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలు ప్రారంభం
January 28th, 09:02 pm
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఉత్తరాఖండ్ లో ఈ రోజు యువ శక్తి పొంగిపొరలుతోందంటూ అభివర్ణించారు. బాబా కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగ మాతల ఆశీర్వాదాలతో 38వ జాతీయ క్రీడలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ ఆవిర్భవించి ఇప్పటికి ఇది 25వ సంవత్సరం అని శ్రీ మోదీ ప్రధానంగా చెబుతూ, ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన యువత తన ప్రతిభను చాటిచెప్పనుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ సుందర చిత్రాన్ని ఆవిష్కరించిందని కూడా ఆయన ప్రశంసించారు. జాతీయ క్రీడల తాజా సంచికలో అనేక స్థానిక ఆటలను చేర్చారనీ, ‘హరిత క్రీడలు’ ఈ ఆటలపోటీకి ఇతివృత్తంగా ఉందనీ ఆయన చెప్పారు. ఈ ఇతివృత్తం గురించి ప్రధాని మరింతగా వివరిస్తూ, ఈ పోటీల సందర్భంగా ప్రదానం చేసే ట్రోఫీలు, పతకాలను ఎలక్ట్రానిక్ వ్యర్ధాల (ఈ-వేస్ట్)తో తయారు చేశారనీ, పతకాన్ని గెలిచే ప్రతి ఒక్క విజేత పేరుతో ఒక మొక్కను నాటనున్నారనీ ఆయన వెల్లడిస్తూ ఇది ఒక గొప్ప కార్యక్రమమని కొనియాడారు.