చంద్రునిపైకి మరోసారి భారత్: ఈ దఫా వ్యోమనౌక భూమికి తిరిగి రాక
September 18th, 04:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి చంద్రయాన్-4 మిషన్‌కు ఆమోదం తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రునిపై వ్యోమనౌకను దింపి విజయం సాధించిన నేపథ్యంలో తాజా మిషన్‌కు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈసారి చంద్రుని పైనుంచి నమూనాలతో వ్యోమనౌకను తిరిగి భూమికి రప్పించి, వాటిని విశ్లేషించగల సాంకేతిక పరిజ్ఞానం రూపకల్పన, సామర్థ్య ప్రదర్శన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చంద్రునిపైకి వ్యోమనౌకను పంపి, తిరిగి రప్పించగల (2040 నాటికి అమలయ్యే ప్రణాళిక) ప్రాథమిక సాంకేతిక సామర్థ్యాలను సాధించాలని ఇస్రో తలపెట్టింది. ఇందులో భాగంగా డాకింగ్/అన్‌డాకింగ్, ల్యాండింగ్ సహా భూమికి సురక్షితంగా రప్పించడంతోపాటు చంద్ర నమూనాల సేకరణ-విశ్లేషణకు అవసరమైన కీలక సాంకేతిక సామర్థ్యాలను చాటుకుంటుంది.