నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

October 27th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా జీవితంలో మరపురాని క్షణాలేవని మీరు నన్ను అడిగితే చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. కానీ చాలా ప్రత్యేకమైన మరపురాని ఒక క్షణం ఉంది- అది గత సంవత్సరం నవంబర్ 15 వ తేదీన జరిగింది. ఆరోజు నేను భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని ఆయన జన్మస్థలమైన ఉలిహాతు గ్రామానికి వెళ్ళాను. ఈ యాత్ర నాపై చాలా ప్రభావం చూపింది. ఈ పుణ్యభూమి మట్టిని తలతో తాకే భాగ్యం పొందిన దేశ తొలి ప్రధానమంత్రిని నేనే. ఆ క్షణంలో స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న శక్తి తెలిసిరావడమే కాకుండా ఈ భూ శక్తితో అనుసంధానమయ్యే అవకాశం కూడా వచ్చింది. ఒక సంకల్పాన్ని నెరవేర్చేందుకు చేసే సాహసం దేశంలోని కోట్లాది ప్రజల భవిష్యత్తును ఎలా మార్చగలదో నేను గ్రహించాను.