పెద్దగా ఆలోచించండి, పెద్దగా కలలు కనండి మరియు వాటిని సాకారం చేయడానికి కష్టపడండి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

December 26th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం! ఈ సమయంలో మీరు 2021కి వీడ్కోలు చెప్తూ 2022కి స్వాగతం పలకడానికి సిద్ధమవుతూ ఉంటారు. ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ వచ్చే ఏడాదిలో రాబోయే సంవత్సరంలో మరింత మెరుగ్గా మారాలని, ఏదైనా మంచి చేయాలని సంకల్పం తీసుకోవడం జరుగుతుంది. గత ఏడు సంవత్సరాలుగా మన 'మన్ కీ బాత్' కూడా వ్యక్తి, సమాజం, దేశం మంచితనాన్ని ఎత్తిచూపుతోంది. మంచి చేయడానికి , మంచిగా మారడానికి స్ఫూర్తినిస్తోంది. ఈ ఏడేళ్లలో 'మన్ కీ బాత్' చేస్తున్నప్పుడు ప్రభుత్వం సాధించిన విజయాల గురించి కూడా చర్చించగలిగాను. మీరు దీన్ని ఇష్టపడ్డారు. మెచ్చుకున్నారు. కానీ మీడియాకు దూరంగా, వార్తాపత్రికల ఆకర్షణలకు దూరంగా చాలా మంది మంచి చేస్తున్నారనేది దశాబ్దాల అనుభవం. దేశ భవిష్యత్తు కోసం తమ నేటి కాలాన్ని వెచ్చిస్తున్నారు. వారు దేశంలోని రాబోయే తరాల కోసం తమ ప్రయత్నాలతో తీరిక లేకుండా ఉన్నారు. అలాంటి వ్యక్తుల చర్చ చాలా ఓదార్పునిస్తుంది. లోతైన స్ఫూర్తిని ఇస్తుంది. నా విషయంలో 'మన్ కీ బాత్' ఎప్పుడూ అలాంటి వారి కృషితో నిండిన అందమైన ఉద్యానవనం. 'మన్ కీ బాత్'లో ప్రతి నెలా నా ప్రయత్నం ఈ విషయంపైనే. ఆ తోటలోని ఏ పుష్పాదళాన్ని మీకోసం తీసుకురావాలా అని నేను ఆలోచిస్తాను. బహురత్న వసుంధరగా పేర్కొనే భారతదేశ పుణ్యకార్యాల ఎడతెగని ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నందుకు సంతోషిస్తున్నాను. దేశం అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు ఈ మానవశక్తి, ప్రజల శక్తి, ఆ శక్తి ప్రస్తావన, ప్రజల కృషి, భారతదేశ ప్రజలతో పాటు సమస్త మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం హామీ ఇస్తుంది.