ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. సాంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ప్రారంభం సందర్భంగా ఈ పథకంపై తన ఆలోచనలను ఇలా పంచుకున్నారు.
"అభివృద్ధిని చేరుకునేందుకు మనం అనుసరిస్తున్న విధానం సరఫరా ఆధారితమైనది. ఇది మన ప్రధాన సమస్యలలో ఒకటి. లక్నో, లేదా గాంధీనగర్ లేదా ఢిల్లీలో ఒక పథకాన్ని ప్రవేశపెట్టామనుకోండి; అదే పథకాన్ని మిగిలిన చోట్ల కూడా అమలు చేయాలని చూస్తాం. ఇలాంటి సరఫరా ఆధారిత విధానాన్ని మేం పక్కన పెట్టి.. ఆదర్శ్ గ్రామ్ ద్వారా.. గిరాకీ (డిమాండ్) ఆధారిత విధానాన్ని అమల్లోకి తేవాలనుకుంటున్నాం. అభివృద్ధికి ప్రేరణ గ్రామంలోనే ఏర్పడాలి.
ఇందుకోసం మనం చేయాల్సిందల్లా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవటమే. మన ప్రజల మనసులను ఏకం చేయాలి. సాధారణంగా ఎంపీలు రాజకీయ కార్యక్రమాలలో మునిగి ఉంటారు. కానీ, దీని తరువాత వారు తమ గ్రామానికి చేరాక.. అక్కడ రాజకీయ కార్యకలాపాలేమీ ఉండవు. ఊరంతా ఓ కుటుంబంలా ఉంటుంది. గ్రామస్తులతో కలసి కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇది పల్లెకు కొత్త శక్తినిస్తుంది, ఊరిని ఐకమత్యంగా ఉంచుతుంది.’
సాంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (ఎస్ఏజీవై) అక్టోబర్ 11, 2014న ప్రారంభమైంది. మహాత్మ గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదర్భ భారత గ్రామాల్లో మార్పును తీసుకురావటం దీని ఉద్దేశం. ఈ పథకం కింద ప్రతి పార్లమెంటు సభ్యుడు ఒక గ్రామపంచాయతీని దత్తత తీసుకుని, ఆ గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు సమగ్రమైన సాంఘిక పురోగతి కూడా చోటు చేసుకొనేటట్లు మార్గదర్శకత్వం వహిస్తారు. 'ఆదర్శ గ్రామాలు' స్థానిక అభివృద్ధి, పాలన, స్ఫూర్తిదాయకమైన పంచాయతీల నిర్మాణాన్ని నేర్పించే పాఠశాలలుగా నిలవాలి.
గ్రామస్తులకు అధునాతన సాంకేతిక పనిముట్లను అందించి.. గ్రామ పురోగతి ప్రణాళికలో వారిని భాగస్వాములను చేయాలి. దీనికి పార్లమెంటు సభ్యుడు నాయకత్వం వహించాలి. ఆ తర్వాత దీనిపై వివరణాత్మకమైన ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేసి, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు అందించాలి. రాష్ట్ర స్థాయి అభివృద్ధి కమిటీలు వీటిని సమీక్షించి.. నిధుల కేటాయింపునకు సంబంధించి సలహాలు, సూచనలు ఇస్తాయి. ఇప్పటివరకు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ద్వారా ఎస్ఏజీవై గ్రామ పంచాయత్ ప్రాజెక్టుల కోసం 21 పథకాలు అమలు చేస్తున్నారు.
జిల్లా స్థాయిలో ఎంపీ నాయకత్వంలో ప్రతి గ్రామపంచాయతీ నెలకోసారి సమీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రభుత్వ విభాగాధికారి ఇందులో పాల్గొని, ప్రతి ప్రాజెక్టును సమీక్ష జరుపుతారు. ఆ తర్వాత ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తారు. దీని వల్ల ఒక్కో ఎంపీ 2016 కల్లా ఒక్కో గ్రామపంచాయతీ పురోగతికి నాయకత్వం వహించిన వారవుతారు. 2019 కల్లా మరో రెండు గ్రామాలు, 2024 కల్లా మరో ఐదు గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారతాయి. ఇప్పటివరకు ఎంపీలు దేశంలో 696 గ్రామాలను దత్తత తీసుకున్నారు.
ఈ పనులను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ఓ సీనియర్ అధికారిని (చార్జ్ ఆఫీసర్) జిల్లా కలెక్టర్ నామినేట్ చేశారు. ఈ అధికారే అమలవుతున్న అన్ని పనులకు పూర్తి బాధ్యత వహించాలి. దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో 653 మంది చార్జ్ ఆఫీసర్లకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. 2015 సెప్టెంబర్ 23- 24 తేదీల్లో భోపాల్‌లో జాతీయస్థాయి వర్క్ షాప్ ను నిర్వహించారు. దీనికి అందరు ఎంపీలు, రాష్ట్రప్రభుత్వాలు, జిల్లా కలెక్టర్లు, అన్ని రాష్ర్టాల గ్రామ ప్రధానులను ఆహ్వానించారు. వివిధ ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయి కమిటీ చేపడుతున్న మంచి కార్యక్రమాలతో ఒక సమగ్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ తరహా కార్యక్రమాలనే ఎస్‌ఏజీవై గ్రామ పంచాయతీల్లో అమలు చేయాలనేది ఈ ప్రదర్శన ఏర్పాటు లోని ముఖ్యోద్దేశం. అలా చేస్తే మరిన్ని ప్రయోజనాలుంటాయని వివరించారు. ఈ ఆదర్శ గ్రామ పంచాయతీల్లో పురోగతిని నిర్ధారించేందుకు మంత్రిత్వ శాఖ ' పంచాయత్ దర్శన్ ' వంటి 35 సూచికలను ప్రవేశపెట్టింది.
కొన్ని విజయ గాథలు:
జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం లోని కుప్వారా జిల్లా త్రెఘాం బ్లాకు పరిధిలో లాదెర్వాన్ గ్రామ ప్రజల ముఖ్యమైన ఆదాయ వనరు వ్యవసాయం. ఇక్కడ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గ్రామంలోని 379 మంది అన్నదాతల మొబైల్ నంబర్లను కృషి విజ్ఞాన్ కేంద్ర (కేవీకే)కు అనుసంధానం చేశారు. కేవీకే ద్వారా ఈ రైతులకు వాతావరణం, వేసుకోవాల్సిన పంటలు, సాంకేతికంగా అనుసరించాల్సిన పద్ధతులు, పంటల పెరుగుదలకు పాటించాల్సిన చిట్కాలు మెసేజ్ రూపంలో ప్పటికప్పుడు అందించారు. ఇదంతా స్థానిక ఎంపీ శ్రీ ముజఫర్ హుసేన్ బేగ్ ఆలోచనలకు అనుగుణంగా జరిగింది. దీని ప్రతిఫలంగా ఇప్పడు రైతులు వ్యవసాయ సూచనలను ఫోన్ పైనే పొందుతున్నారు. సాంకేతికంగా విత్తనాలు నాటడం, భూసార పరీక్షలు, పంట రక్షణ, వ్యవసాయార్థిక విధానం, పంట చేతికి వచ్చిన తరువాత చేయాల్సిన పనులు, మార్కెట్ సమాచారం వంటివి మొబైల్ ద్వారా అందుతున్నాయి. దీని ద్వారా పంట ఉత్పత్తి, పండించిన దాన్ని మార్కెట్లో అమ్ముకోవటంలో వారికి పూర్తి సహాయం అందుతుంది.
తమిళనాడులోని శివగంగ జిల్లా.. మరవమంగళం గ్రామాన్ని రాజ్యసభ ఎంపీ డాక్టర్ ఇ.ఎం. సుదర్శన నాచియప్పన్ దత్తత తీసుకున్నారు. గ్రామస్తుల జీవన ప్రమాణాలు మార్చేందుకు సాధ్యమైన మార్గాలను ఆయన గుర్తించారు. కొబ్బరినార, లెదర్ వస్తువుల తయారీ వంటి వాటిలో వివిధ సామాజికవర్గాలకు శిక్షణ ఇప్పించారు. జిల్లా అధికారులు, అలగప్ప యూనివర్సిటీ సాయంతో.. పలు అవగాహన కార్యక్రమాలను ఎంపీ ఏర్పాటుచేశారు. తనకున్నపరిచయాల కారణంగా కాయిర్ బోర్డు ఆఫ్ ఇండియా, కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు ఆఫ్ ఇండియా. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ల నుంచి శిక్షణ భాగస్వాములను పిలిపించి గ్రామస్తులకు శిక్షణ ఇప్పించారు.
గ్రామస్తులను చిన్నవ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దేందుకు రెండు నెలల పాటు కొబ్బరినార శిక్షణ కార్యక్రమాలను నిర్వహించే సంస్థలతో సమన్వయం చేశారు. 120 మంది మహిళలకు కొబ్బరినారలో, 112 మందికి లెదర్‌లో, 27మందికి కొబ్బరితో వస్తువుల తయారీలో శిక్షణ పొందేందుకు పేరు నమోదు చేసుకున్నారు. శిక్షణ పూర్తయ్యాక వారందరికీ ఆర్థిక సహకారం అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా.. వారి జీవితాల్లో మార్పు వచ్చేలా జిల్లా అధికారులు, శిక్షణ సంస్థలు సహకారం అందించనున్నాయి.
జార్ఖండ్‌లోని తూర్పు సింగ్ భూమ్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో బాలికల ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. చాలా మంది మరీ ముఖ్యంగా మహిళలు, బాలికలు ఎనీమియాతోపాటు ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు స్థానిక ఎంపీ శ్రీ బిద్యుత్ బరన్ మహతో.. బంగుర్డా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ గ్రామంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఈ హెల్త్త్ క్యాంపు లను ఏర్పాటు చేశారు. ఇందులో 188 మంది బాలికలను పరీక్షించారు. ఈ పరీక్షల్లో చాలా మంది బాలికలు గైనకాలజీ సంబంధిత వ్యాధులు, మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్‌లు, చర్మ రోగాలతో బాధపడుతున్నారని వెల్లడైంది. సామాజిక- సాంస్కృతిక వెనకబాటుకు ప్రత్యక్ష ఉదాహరణలు.
అపరిశుభ్రమైన జీవన విధానం, అపరిశుభ్ర పరిసరాలే ఈ వ్యాధులు రావటానికి కారణం. వ్యక్తిగతంగా ఎలా పరిశుభ్రంగా ఉండాలి? సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు.