ఆస్పత్రులకు ఆక్సిజన్ లభ్యతను పెంచాలన్న ప్రధానమంత్రి ఆదేశాలకు అనుగుణంగా దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రుల ప్రాంగణాల్లో ప్రత్యేకంగా 551 ‘పీడన శోషణ సహిత’ (పీఎస్ఎ) వైద్య ఆక్సిజన్ తయారీ యంత్రాగారాల ఏర్పాటు కోసం నిధులు కేటాయించేందుకు ‘‘పీఎం కేర్స్ నిధి’’ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. మరోవైపు ఈ యంత్రాగారాలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని ప్రధానమంత్రి ఆదేశించారు. ఈ యంత్రాగారాలు జిల్లా స్థాయిలో ఆక్సిజన్ లభ్యతను మరింత పెంచేవిగా ఉండాలని ఆయన చెప్పారు. వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోగల గుర్తించిన జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఈ ప్రత్యేక ఆక్సిజన్ యంత్రాగారాలను ఏర్పాటు చేస్తారు. ఈ యంత్రాగారాల నుంచి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రాణవాయువును సమీకరిస్తుంది. కాగా, దేశంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 162 ప్రత్యేక ‘పీఎస్ఎ’ వైద్య ఆక్సిజన్ తయారీ యంత్రాగారాల ఏర్పాటు కోసం ‘పీఎం కేర్స్ నిధి’ ద్వారా ఇప్పటికే రూ.201.58 కోట్లు మంజూరయ్యాయి.
దేశవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రతి జిల్లా కేంద్ర ఆస్పత్రికీ సొంత ఆక్సిజన్ తయారీ సదుపాయం కల్పించడమే జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులలో ‘పీఎస్ఎ’ ఆక్సిజన్ తయారీ యంత్రాగారాల ఏర్పాటులోని ప్రధానోద్దేశం. ఇలాంటి సొంత ఆక్సిజన్ తయారీ సదుపాయం ఉన్నందువల్ల ఈ ఆస్పత్రులలోనే కాకుండా జిల్లావ్యాప్తంగానూ రోజువారీ ప్రాణవాయువు అవసరాలు తీరే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సొంత తయారీ యంత్రాగారాలకు వైద్యపరమైన ద్రవీకృత ఆక్సిజన్ (ఎల్ఎంఒ) ‘అదనపు ఆదరవు’గా ఉంటుంది. ఇటువంటి వ్యవస్థవల్ల జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాలో హఠాత్తుగా ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేగాక కోవిడ్-19 పీడితులతోపాటు ఇతరత్రా ఆక్సిజన్ అవసరమయ్యే ఇతర రోగుల కోసం తగిన పరిమాణంలో నిరంతర ప్రాణవాయువు సరఫరాకు భరోసా ఉంటుంది.